తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీడబ్ల్యూఎఫ్​ ఫైనల్స్​ నుంచి సింధు ఔట్​ - Defending champion PV Sindhu

చైనా వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ టూర్​ ఫైనల్స్​ నుంచి భారత క్రీడాకారిణి సింధు నిష్ర్కమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్​ మ్యాచ్​లో చెన్​ యుఫెయ్​(చైనా) చేతిలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో వరుసగా రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుని ఇంటిముఖం పట్టింది.

BWF Finals 2019
బీడబ్ల్యూఎఫ్​ ఫైనల్స్​ నుంచి సింధు ఔట్​

By

Published : Dec 12, 2019, 11:11 PM IST

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో.. ఫేవరెట్లలో ఒకరిగా బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పి.వి.సింధు రెండడుగులు వేయకుండానే ఇంటిముఖం పట్టింది.

గురువారం జరిగిన మ్యాచ్​లో చెన్​ యుఫెయ్​(చైనా)చేతిలో ఓడిపోయింది సింధు. తొలి సెట్​ను 22-20 తేడాతో కైవసం చేసుకున్న ఈ క్రీడాకారిణి... తర్వాత రెండు సెట్లలో తేలిపోయింది. ప్రత్యర్థి చేతిలో 21-16, 21-12 తేడాతో ఓడి ఇంటిముఖం పట్టింది.

గ్రూప్​-ఎ నుంచి రెండు మ్యాచ్​లు గెలిస్తే సెమీఫైనల్​కు చేరేది సింధు. అయితే బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో సింధు 21-18, 18-21, 8-21తో అకానె యమగూచి (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూసింది. తాజాగా జరిగిన రెండో మ్యాచ్​లో చెన్​ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా భారత్​ నుంచి మెగాటోర్నీలో అడుగుపెట్టిన ఒకే ఒక్క ఈ క్రీడాకారిణి.. ఆరంభంలోనే వెనక్కిమళ్లింది. నామమాత్రపు మూడో మ్యాచ్​లో హే బింగ్​జియో(చైనా)తో శుక్రవారం తలపడనుంది. సింధుపై గెలిచిన ఈ ఇద్దరు విజేతలు గ్రూప్​-ఎ నుంచి సెమీఫైనల్లో అడుగుపెట్టారు.

ఒలింపిక్స్​ ముంగిట కలవరం...

వచ్చే ఏడాది ఒలింపిక్స్​ ముంగిట సింధు ఫామ్ అభిమానులను కలవరపెడుతోంది. ఈ ఏడాది బాసెల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన సింధు.. ఆ తర్వాత ఏ టోర్నీలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఈ మెగాటోర్నీ తర్వాత ఇండోనేసియా ఓపెన్​ సూపర్​ 750లో మాత్రమే ఫైనల్​ చేరింది. అనంతరం జరిగిన అన్ని టోర్నీల్లో క్వార్టర్‌ ఫైనల్‌కు కూడా చేరకుండా, గ్రూప్‌ దశలోనే వెనుదిరిగింది.

ABOUT THE AUTHOR

...view details