రియో ఒలింపిక్స్‌లో వెండి పతకంతో మెప్పించిన తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu).. అనంతరం కొన్నాళ్లకు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్(2019లో) గెలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా నిలిచింది. అయితే ఈ విజయం సాధించక ముందు ఈ మెగాటోర్నీలో రెండు రజత, కాంస్య పతకాలను గెలుచుకుంది. రెండుసార్లు ఫైనల్ చేరినా రెండో స్థానంతోనే సరిపెట్టుకుంది. దీంతో ఆమెపై 'సిల్వర్ సింధు' అనే ముద్ర పడిపోయింది. 'కాంస్యాలు గెలిచారు.. రజతాలు సాధించారు.. మరి స్వర్ణం మాటేమిటి?' అంటూ విమర్శలు వచ్చాయి. ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ విజయంతో ఈ ప్రశ్నలకు చెక్ పెట్టింది. ఏదేమైనప్పటికీ టైటిల్ విజయంతో తనపై ఉన్న ట్యాగ్‌ను చెరిపేసుకున్న సింధు.. మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు(Olympics) సిద్ధమవుతోంది. మెగాక్రీడల్లో ఆమె తప్పకుండా స్వర్ణం సాధించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశమంతా కోరుకుంటున్నారు! ఆమెపై కోటి ఆశలు పెట్టుకున్నారు.
వారిని ప్రోత్సహించాలి
దేశంలో క్రీడారంగానికి ఆదరణ పెరుగుతుందని సింధు ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. దేశం తరఫున, వివిధ క్రీడల్లో ఆడేందుకు సిద్ధమవుతున్న అథ్లెట్లను చూస్తుంటే ఆనందంగా ఉందని తెలిపింది. వారిలో మనం స్ఫూర్తిని నింపి, సరైన ప్రోత్సాహం అందిస్తే మరింత మంది అథ్లెట్లు తయారవుతారని ధీమా వ్యక్తం చేసింది.
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు
తనను ప్రోత్సాహిస్తున్నరెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలపై అభిమానాన్ని చాటుకుంది సింధు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆమెకు డిప్యూటీ కలెక్టర్ బాధ్యతల్ని అప్పగించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మరోవైపు ఇటీవలే ఆమె ప్రతిభకు మెచ్చి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షల చెక్‌ను అందించింది. సింధు పేరిట బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు రెండు ఎకరాల భూమిని కేటాయించింది. విశాఖ గ్రామీణ మండలం చినగదిలిలో భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
"రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు నా కృతజ్ఞతలు. నాకెప్పుడు ఎటువంటి సాయం కావాలన్నా అందిస్తారు. టోర్నీలు ఉన్నప్పుడు ఆన్‌డ్యూటీ లీవ్‌లు ఇస్తారు. అందుకు నేను రుణపడి ఉంటాను. వారు క్రీడాకారులను అర్థం చేసుకుని ప్రోత్సాహిస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనూ అకాడమీ శిక్షణ కోసం ప్రయాణించేందుకు ప్రత్యేకంగా అనుమతినిచ్చారు" అని సింధు చెప్పింది.
ఆల్ ది బెస్ట్