అంతర్జాతీయ వేదికపై ప్రారంభంలో వైఫల్యాలు తనను ఎంతగానో నిరాశపరిచాయని చెప్పింది బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు. అయితే 2012లో చైనా ఓపెన్లో అప్పటి ఒలింపిక్ ఛాంపియన్ లి జురుయ్ను ఓడించడం వల్ల.. సీనియర్ సర్క్యూట్లో విజయం సాధించాలనే తన సంకల్పానికి బలం చేకూరిందని తెలిపింది.
"నేను ఆటను ప్రారంభించేటప్పుడు బాగానే ఉన్నా. కానీ, అంతర్జాతీయ ప్రమాణాలు ఒకేలా లేవు. మొదట్లో నేను తొలి రౌండ్, క్వాలిఫయింగ్ రౌండ్లలో ఓడిపోతూ వచ్చా. ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి కష్టపడి పని చేస్తూనే ఉన్నా. అంతే కాదు నేను కూడా ఇతరుల్లాగే కష్టపడుతున్నా కానీ, ఎందుకు గెలవలేకపోతున్నా అని బాధపడేదాన్ని. ఎక్కడ తప్పు చేస్తున్నానో ఆలోచించా. అలా 2012లో లి జురుయ్ను ఓడించా. ఆ సమయంలో ఆమె ఒలింపిక్ ఛాంపియన్. ఆ తర్వాత నుంచి ఇంకా బాగా కష్టపడ్డా. దశలవారిగా ఆటపై మరింత పట్టు సంపాదిస్తూ వచ్చా."
-పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి