జులై 1 నుంచి బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరాన్ని హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది భారత బ్యాడ్మింటన్ సంఘం (బీఏఐ). దీని కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే బెంగళూరులోని ప్రకాశ్ పదుకొణె బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణా శిబిరాలు పునఃప్రారంభం కాగా.. హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న కారణంగా ఆటగాళ్ల ట్రైనింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు.
"కరోనా సంక్షోభం కారణంగా బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరాలకు విరామాన్ని ఇచ్చాం. తాజాగా వాటిని జులై 1 నుంచి హైదరాబాద్‌లో పునఃప్రారంభించాలని నిర్ణయించాం. అయితే అందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంది. అన్ని రాష్ట్రాల సెక్రటరీలతో ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చంచిన తర్వాత దేశవాళీ టోర్నీలను నిర్వహిస్తాం. అయితే ప్రస్తుతానికి సెప్టెంబర్ వరకు ఎలాంటి టోర్నీలు జరపలేం. సెప్టెంబరులో పరిస్థితులకు అనుగుణంగా తిరిగి కార్యకలాపాలను మొదలుపెట్టాలని చూస్తున్నాం".