మైదానాల్లో మళ్లీ సందడి మొదలైంది. కరోనా దెబ్బకు దాదాపుగా అయిదు నెలలు ఆగిపోయిన ఆటలు నెమ్మదిగా పట్టాలెక్కుతున్నాయి. ఐపీఎల్ ప్రకటనతో క్రికెటర్లు బ్యాట్లు, బంతులు పట్టుకోగా.. ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడాకారులు బిజీగా మారిపోయారు. హైదరాబాద్‌లోని సాయ్ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జాతీయ శిక్షణా శిబిరం జోరుగా సాగుతోంది. స్టార్ షట్లర్లు పి.వి.సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, సిక్కిరెడ్డి సాధనలో నిమగ్నమయ్యారు. టోర్నీలు కూడా మొదలైతే బ్యాడ్మింటన్ పరుగులు తీస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు.
అప్పుడు తీవ్రత పెంచొచ్చు: సింధు
ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు సాధన చేస్తున్నా. తర్వాత సాయిప్రణీత్, శ్రీకాంత్, సిక్కి ప్రాక్టీస్ చేస్తున్నారు. కోచ్‌లు గోపీచంద్, పార్క్‌లు సాధన చేయిస్తున్నారు. కరోనా కారణంగా ఇంట్లో ఉన్నన్ని రోజులూ ఫిట్‌నెస్ కసరత్తులు చేశా. ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్నా.. సాధన ఆరంభంలో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఎప్పట్లాగే ప్రాక్టీస్ చేశా. గోపీచంద్ అకాడమీలో మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నా. గంటన్నర సాధనకు.. రెండున్నర గంటలు ఫిట్‌నెస్‌కు కేటాయిస్తున్నా. టోర్నీలపై స్పష్టత వస్తే ప్రాక్టీస్ తీవ్రత పెంచొచ్చు.