పూసర్ల వెంకట సింధు.. భారత బ్యాడ్మింటన్‌లో ఎవరెస్టంతటి క్రీడాకారిణి. ప్రపంచ ఛాంపియన్‌గా.. ఒలింపిక్స్ రజత పతక విజేతగా అత్యున్నత ఘనతల్ని అందుకున్న షట్లర్. అయితే ఇన్నాళ్లూ రాకెట్‌తో పతకాల్ని వేటాడిన ఆమె చేతులు ఇప్పుడు వంటింట్లో గరిటె తిప్పుతున్నాయి. తీరిక లేకుండా టోర్నీలాడిన సింధు.. అక్క కుమారుడితో ఆడుతూ సేదదీరుతోంది. కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవన శైలిని పూర్తిగా మార్చేసిందంటున్న సింధుతో ప్రత్యేక ఇంటర్వ్యూ.
మళ్లీ మళ్లీ రాదు..
లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నా. పదహారేళ్ల క్రితం బ్యాడ్మింటన్ రాకెట్ పట్టా. ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి. ఊహించని విరామమిది. ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. రెండు నెలలు గడిచిపోయాయి. అయినా తప్పదు. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి లాక్‌డౌన్ మినహా మరో మార్గం లేదు. అన్నిటికంటే జీవితం ముఖ్యం. ప్రస్తుత పరిస్థితి నిరాశ కలిగిస్తుండొచ్చు. కానీ అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిని సానుకూలంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో గడపొచ్చు. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మళ్లీ ఎప్పుడూ ఇంత సమయం దొరక్కపోవచ్చు.
నా డైరీలో ఒక రోజు
లాక్‌డౌన్‌లో పూర్తిగా ఇంటికి పరిమితమయ్యా. ట్రైనర్‌తో మాట్లాడుతూ కసరత్తులు చేస్తున్నా. స్నేహితులతో పెద్దగా మాట్లాడింది లేదు. ఉదయాన్నే లేవడం.. అకాడమీకి వెళ్లడం చిన్నప్పట్నుంచి అలవాటు. ఇప్పుడు ఆలస్యంగా నిద్ర లేస్తున్నా. ఉదయం 9.30 లేదా 10 గంటలకు మంచం దిగుతున్నా. అల్పాహారం తర్వాత కాసేపు సాధన చేస్తా. కొద్దిసేపు పడుకుంటా. మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్లీ పడుకుంటా. సాయంత్రం కొద్దిసేపు సాధన సాగిస్తా. అనంతరం అమ్మతో కలిసి వంటింట్లో బిజీ. వంట చేయడమంటే నాకు చాలా ఇష్టం. లాక్‌డౌన్ సమయంలో ఘుమఘుమలాడే బిర్యానీ చేయడం నేర్చుకున్నా. కేక్, కుకీస్, ఉల్లి పకోడి చేస్తున్నా. బొమ్మలు గీస్తున్నా. తీరిక సమయంలో అక్క కుమారుడితో కలిసి ఆడుకుంటా. సినిమాలూ చూస్తున్నా. ఇన్ని రోజుల విరామం నాకెప్పుడూ దొరకలేదు. ప్రతి క్షణాన్నీ కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నా.
మాస్కులతో ఆడలేం