ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళగా దేశం గర్వపడేలా చేసింది పీవీ సింధు. యావత్ భారతావని ఆమెపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రజలతో పాటు పలు దిగ్గజ సంస్థలు సింధుకు శుభాకాంక్షలు తెలిపాయి. అయితే.. అదే సమయంలో తన పేరు, ఇమేజ్ను ఎలాంటి అనుమతులు లేకుండా మార్కెటింగ్ కోసం వినియోగించటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది సింధు. అలాంటి 20 బ్రాండ్లపై కేసు నమోదు చేసి, పరువు నష్టం కింద ప్రతి కంపెనీపై రూ.5 కోట్ల మేర దావా వేయాలని భావిస్తోంది సింధుకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలు చూసే బేస్‌లైన్ వెంచర్స్.
ఆయా బ్రాండ్లు సింధు పేరును వినియోగించటంలో తప్పు ఏమిటనే విషయాన్ని బేస్‌లైన్ వెంచర్స్ టాలెంట్, పార్ట్నర్షిప్స్ డైరెక్టర్ యశ్వంత్ బియ్యాలా వెల్లడించారు.
" ఈ బ్రాండ్లు పీవీ సింధు పేరును, ఫొటోలను వారి పోస్టుల్లో వినియోగించటం.. క్రీడాకారుల ప్రైవసీని ఉల్లఘించటమే. మరోవైపు.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) నిబంధనలనూ ఉల్లంఘించారని స్పష్టంగా తెలుస్తోంది. టోర్నమెంట్ సమయంలో ప్రకటనలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైన జులై 13 నుంచి ఆగస్టు 10న ముగిసే వరకు కనీసం స్పాన్సర్లు సైతం ఆటగాళ్ల గురించి పోస్ట్ చేసేందుకు అవకాశం లేదు. కేవలం ఐఓసీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు మాత్రమే ఆటగాళ్ల గురించి ప్రకటనలు చేసేందుకు వీలుంది."