యూకే బర్మింగ్‌హామ్ వేదికగా ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ పాల్గొననున్నారు. గతంలో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌ను కేవలం ఇద్దరు భారతీయులు మాత్రమే గెలుపొందారు. వారిలో ఒకరు ప్రకాశ్ పదుకొణె(1980) కాగా, మరొకరు పుల్లెల గోపీచంద్ (2001).
ఇటీవల స్విస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన పీవీ సింధు.. మారిన్ చేతిలో పరాజయం పాలైంది. 2018లో ఆల్ ఇంగ్లాండ్ టోర్న సెమీ ఫైనల్లో ఇంటిముఖం పట్టిన ఈ ఐదో సీడ్ ప్లేయర్.. ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. ఒలింపిక్ రజత పతక విజేత అయిన సింధు.. టోర్నీ ఫెవరేట్లలో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సింధు తన తొలి గేమ్‌లో మలేషియా క్రీడాకారిణి సోనియా చెయ్‌తో తలపడనుంది.
మరో సింగిల్స్ షట్లర్ సైనా నెహ్వాల్.. రెండేళ్లుగా ఫామ్‌లేమితో తంటాలు పడుతోంది. ఈ సారైనా ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. 2015లో ఈ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సైనా.. తన తొలి మ్యాచ్‌లో మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో పోటీకి దిగనుంది.
మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్, నంబర్ వన్ షట్లర్ కరోలినా మారిన్ గాయం కారణంగా ఈ టోర్నీలో ఆడట్లేదు. టోక్యో ఒలింపిక్స్‌కు ఇది ఓపెన్ అర్హత టోర్నీ కాకపోవడం వల్ల ఇందులో చైనీస్, కొరియన్, తైవాన్ షట్లర్లు కూడా పాల్గొనడం లేదు.
పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్ వన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్.. స్విస్ ఓపెన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. కిదాంబి తన ప్రారంభ రౌండ్లో ఇండోనేషియా ఆటగాడు టోమీ సుగియార్టోతో తలపడనున్నాడు.