బ్యాడ్మింటన్ అంటే గుర్తొచ్చేవి చైనా, థాయ్‌ల్యాండ్, జపాన్. క్రమేపి వాటి ఆధిపత్యం తగ్గింది. భారత్ ప్రపంచ అగ్రగామిగా ఎదిగింది. అందుకు కారణం సింధు, సైనా, శ్రీకాంత్, కశ్యప్, ప్రణయ్ వంటి షట్లర్ల విజయాలే. కాకలుతీరిన మహా యోధులను మట్టికరిపించి మనోళ్లు ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, సూపర్ సిరీసులు, గ్రాండ్‌ప్రిలు కైవసం చేసుకున్న మధుర క్షణాలు మనందరికీ గుర్తే. 2019 మాత్రం ఒక చేదుగుర్తుగా మిగిలింది. ఎందుకో అంతర్జాతీయ వేదికలపై ఈసారి మన రాకెట్లు తుస్సుమన్నాయ్..
సింధుకు పల్లేర్లపై నడక
మెగాటోర్నీలంటే శివంగిలా చెలరేగే షట్లర్ పీవీ సింధు. తనదైన దూకుడుతో ప్రత్యర్థిని మట్టికరిపిస్తుంది. 2019లో మాత్రం కేవలం 2 పతకాలు సాధించింది. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను సాధించి తానో గొప్ప క్రీడాకారిణి అని నిరూపించుకుంది. ప్రిక్వార్టర్స్‌లో బీవెన్ ఝాంగ్, క్వార్టర్స్‌లో తైజు ఇంగ్, సెమీస్‌లో చెన్ యూఫీ, ఫైనల్లో నొజొమి ఒకుహరను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది స్వర్ణం ముద్దాడింది.
ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో అకానె యమగూచితో తలపడి రజతానికి పరిమితమైంది. ఆ తర్వాత మరే టోర్నీలోనూ రాణించలేదు. ఎన్నడూ లేనిది చాలా పోటీల్లో తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లోనూ అదే బాటలో సాగి అందరికీ షాకిచ్చింది. ఎనిమిది సూపర్ సిరీసుల్లో రెండో రౌండ్‌లోపే వెనుదిరిగింది. 2019లో 47 మ్యాచులాడిన సింధు 30 గెలిచి 17 ఓడింది. ఆమె విజయాల శాతం 63గా ఉన్నప్పటికీ పతకాలు గెలిస్తేనే కదా అసలు మజా. ప్రస్తుతం ఆమె 6వ ర్యాంకులో ఉంది.
నెహ్వాల్‌కు నయ్
భారత్‌కు ఒలింపిక్స్‌లో తొలి పతకం అందజేసిన కీర్తి.. సైనా నెహ్వాల్ సొంతం. తన తెలివితేటలతో ప్రత్యర్థిని ఓడించే ఆమె 2019లో గెలిచింది ఒకే ఒక్క స్వర్ణపతకం. ఇండోనేషియా మాస్టర్స్ ఫైనల్లో కరోలినా మారిన్ గాయంతో తప్పుకోవడంతో విజేతగా నిలిచింది. ఆల్‌ఇంగ్లాండ్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మూడో రౌండ్లో వెనుదిరిగింది. వీటిని మినహాయిస్తే చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. రెండేళ్లుగా ఆమె ఆటలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. విజయాల శాతం తగ్గింది. ఈ ఏడాది 33 మ్యాచులు ఆడగా 18 గెలిచి 15 ఓడింది. పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో కొన్ని సిరీస్‌లు ఆడలేదు. ప్రస్తుతం సైనా 11వ ర్యాంకులో ఉంది.