తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"హిట్​ 2' చేయకపోవడానికి కారణమదే!' - విశ్వక్​ సేన్ ఆలీతో సరదాగా

హీరో నాని నిర్మాణంలో రూపొందుతోన్న 'హిట్​ 2' సినిమాను వదులుకోవడానికి ప్రధానకారణం 'పాగల్​' సినిమా అని అంటున్నారు యువ కథానాయకుడు విశ్వక్​సేన్. 'పాగల్​' షూటింగ్​ నేపథ్యంలో 'హిట్​ 2'కు డేట్లు కేటాయించలేక పోవడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు.. ఆలీతో సరదాగా కార్యక్రమంలో వెల్లడించారు. వీటితో పాటు తన వ్యక్తిగత జీవితంలోని విశేషాలు, సినిమా కబుర్లను పంచుకున్నారు విశ్వక్​సేన్​.

Vishwak Sen reveals exact reason behind leaving HIT 2
"హిట్​ 2' చేయకపోవడానికి కారణమదే!'

By

Published : May 6, 2021, 12:06 PM IST

Updated : May 6, 2021, 1:03 PM IST

'వెళ్లిపోమాకే' అంటూ చిత్రసీమలో కథానాయకుడిగా అడుగుపెట్టి 'ఈ నగరానికి ఏమైంది?' అంటూ ఆకట్టుకుని సందడి చేసిన యువ హీరో విశ్వక్‌సేన్‌. 'ఫలక్‌నుమా దాస్‌'తో మాస్‌ ఆడియన్స్‌కు దగ్గరై హైదరాబాద్‌ పొగరును చూపించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ 'హిట్‌: ది ఫస్ట్ కేస్‌'లో విక్రమ్‌ రుద్రరాజుగా మెప్పించారు. ఇలా వరుస చిత్రాలతో అలరిస్తున్న విశ్వక్‌ ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్‌ చెప్పిన విశేషాలు..

విశ్వక్‌సేన్‌ నీ పేరు కాదు. అసలు పేరేంటి?

విశ్వక్‌సేన్‌:దినేశ్‌

విశ్వక్​సేన్

మరి విశ్వక్‌సేన్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది?

విశ్వక్‌సేన్‌:జాతకాల ప్రకారం అలా పెట్టుకోవాల్సి వచ్చింది. 'విశ్వక్‌సేన పేరు పెట్టుకుంటే జీవితాంతం కష్టపడతావు. కానీ, పేరైతే రాదు' అని నాన్న అన్నారు. చాలా మందికి వెండితెర పేర్లు వేరుగా ఉంటాయి. కొత్త పేరు పెట్టుకుంటే సరదాగా ఉంటుంది కదా అని విశ్వక్‌సేన పెట్టుకున్నా. అయితే, విశ్వక్‌సేన బాగోలేదని, విశ్వక్‌సేన్‌గా మార్చుకున్నా. 'విశ్వక్‌సేన్‌ అంటే బెంగాలీ పేరు అనుకుంటారు' అని నాన్న అన్నారు. చాలామంది నా ముఖం చూసి ఉత్తరాదివాడు అనుకుంటారు. నేను హైదారాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పుట్టా. సికింద్రాబాద్‌లో రెండేళ్లు ఉన్నాం. పదహారేళ్లు వచ్చే వరకూ దిల్‌సుఖ్‌నగర్‌లోనే. ఆ తర్వాత ముంబయిలో రెండేళ్లు ఉన్నా. 19 ఏళ్లు వచ్చేసరికి రోజూ నేను ఫిల్మ్‌నగర్‌కి వస్తూ పోతూ ఉండేవాడిని. నా బాధ చూసి తట్టుకోలేక మా కుటుంబం అంతా ఫిల్మ్‌నగర్‌కు వచ్చేసింది.

మీ నాన్న ఏం చేస్తుంటారు?

విశ్వక్‌సేన్‌:కరాటే గ్రాండ్‌ మాస్టర్‌. ప్రస్తుతం మార్షల్‌ ఆర్ట్స్ స్టేట్ డైరెక్టర్‌. ( మధ్యలో ఆలీ అందుకుని.. నువ్వు కూడా మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నావా) నా చిన్నప్పుడు 2, 3 సార్లు వెళ్లాను. చిన్నప్పుడు కండలు గట్టిపడిపోతే ఎత్తు పెరగనేమోనని నాన్న నమ్మకం అందుకే, ఎత్తు పెరిగేంత వరకూ జిమ్నాస్టిక్స్‌, డ్యాన్స్ నేర్చుకోమని చెప్పారు. నాకు 15ఏళ్లు వచ్చే సరికి రోజూ ఉదయం జిమ్నాస్టిక్స్, సాయంత్రం డ్యాన్స్.

బాలీవుడ్‌లో టైగర్‌ ష్రాఫ్‌. టాలీవుడ్‌లో ఈ విశ్వక్‌సేన్‌ నిజమేనా?

విశ్వక్‌సేన్‌:లేదు. టైగర్‌ష్రాఫ్‌ అంత రావాలంటే సమయం పడుతుంది. మెల్లగా తయారవుతా.

నీ నామకరణం మీ నాన్నే చేశారా?

విశ్వక్‌సేన్‌:నాలుగేళ్ల క్రితం నాన్నే కొత్త పేరు పెట్టారు. నా చిన్నతనంలో ఆశీర్వదించిన వ్యక్తి (ఆలీ) మీరే. బూత్‌బంగ్లాలో ఓ టెలీఫిల్మ్‌ షూటింగ్‌ జరుగుతోంది. నాన్న నాకు షూటింగ్‌ చూపిద్దామనో లేక చైల్డ్ రోల్‌ ఏమైనా ఉంటే వేయిద్దామనో అక్కడి తీసుకొచ్చారు. అప్పుడు నేను దూరంగా ఉంటే నన్ను పిలిచి బుగ్గలు గిల్లి, 'బాగున్నాడు సినిమాల్లో ట్రై చేయమనండి' అని మేరే నాన్నకు చెప్పారు.

'ఫ‌ల‌క్‌నుమాదాస్‌‌' సినిమాకు ప్రేరణ ఎవరైనా ఉన్నారా?

విశ్వక్‌సేన్‌: కృష్ణవంశీ నాకు ప్రేరణ. 'అంతఃపురం', 'సిటీ ఆఫ్‌ గాడ్స్' నాకు ఇష్టమైన చిత్రాలు. 7వ తరగతిలోనే దర్శకత్వం చేయాలనే ఆలోచన వచ్చింది. వేసవిలో స్విమ్మింగ్‌, డ్యాన్స్ క్లాసులకు జాయిన్‌ చేస్తారు. నేను మా నాన్నని అడిగి మల్టీమీడియా కోర్సులో చేరా. 8వ తరగతి చదువుతున్నప్పుడే ఫిల్మ్ ఎడిటింగ్‌ నేర్చుకున్నా. రోజూ సాయంత్రం నాలుగున్నర వరకూ స్కూల్‌. అప్పట్లో సినిమా సీడీలు అద్దెకు దొరుకుతుండేవి. వాటిని తీసుకొచ్చి చూసి, నా సిస్టమ్‌లో కాపీ చేసుకొనేవాడిని. వాటిలో బాగున్న సన్నివేశాలు ఉంచేసి, మిగతావి డిలీట్‌ చేసేవాడిని. అప్పుడే దర్శకత్వం చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ, ముందు హీరోగా చేసి, ఆ తర్వాత దర్శకత్వం చేయాలని అనుకున్నా. అంటే 10 ఏళ్లు హీరోగా చేసి ఆ తర్వాత దర్శకత్వం చేయాలనే ఆలోచనతో వచ్చా. 'వెళ్లిపోమాకే' సినిమా చేసేటప్పుడు నా పేరు దినేశ్‌. ఈ సినిమా విడుదల కావడానికి ఏడాదికి పైగా పట్టింది.

విశ్వక్​సేన్

'ఫ‌ల‌క్‌నుమాదాస్‌' చిత్రానికి నిర్మాణ - దర్శకత్వం చేయడానికి కారణం ఏమిటి?

విశ్వక్‌సేన్‌:'వెళ్లిపోమాకే' చిత్రానికి నాకు పెద్దగా పేరు, కానీ సినిమా అవకాశాలు వచ్చేంతగా ఏమీ జరగలేదు. చిత్రంలో కళ్లద్దాలు ధరించి ఓ ఎడ్డోడి పాత్ర పోషించా. ఈ సినిమా చేసిన తర్వాత కూడా నాకెవరైనా మంచి పాత్రలు ఇస్తే చేయలేడేమో? అనిపించింది. అలాంటి సమయంలో నలుగురి హీరోల్లో ఒకరిగా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం ఓ ఆఫీసులో 5 నెలల పాటు ఉన్నా. మొదటి రెండు నెలల్లో నేను మెయిన్‌లీడ్‌ హీరో. ఈ సినిమాకు అప్పుడు వారానికొక ఆడిషన్ చేసేవారు. రెండు నెలల తర్వాత సెకండ్ హీరో. నాలుగో నెలలో మూడో హీరో. ఇక ఐదో నెలలో నాలుగో హీరోగా మారిపోయా. అలా ఆరో నెల వచ్చే సరికి ఆ సినిమాలో నాకు వేషమే లేకుండా పోయింది. అప్పుడు చాలా ఏడ్చేశా. అప్పటి వరకూ నేను పడ్డ కష్టం చూసి ఇంట్లో వాళ్లు.. 'ఎవడో నీకు అవకాశం ఇచ్చేది ఏంది? నిన్ను పెట్టి సినిమా తీస్తా' అని మా నాన్న అన్నారు. నా అదృష్టం ఏమంటే ఆ పదిరోజుల్లోనే మలయాళంలో విడుదలైన 'అంగమలై డైరీస్‌' సినిమా చూశా. ఇది నాన్నకు చూపించి రీమేక్‌ చేద్దామన్నా. 'ఇదేం సినిమా'రా అని ఆయన అన్నారు. నీకు కొత్తగా ఓ కొత్త కథ చెబుతానని 'ఫలక్‌నుమా దాస్‌' చెప్పా. ఆ తర్వాత సినిమాకు సంబంధించి కేరళకు వెళ్లి 48 గంటల్లో రైట్స్ సంపాదించాం. తర్వాత సినిమా ప్రీ-పొడ్రక్షన్‌ మొదలైంది. 16 వందల మందిని ఆడిషన్స్ చేసి 40 మంది కొత్త వాళ్లతో రెండు నెలల్లో సినిమా మొదలు పెట్టేద్దామనుకున్నా.

అప్పుడే రామానాయుడు స్టూడియోలో ఏదో పని ఉండి అక్కడికి వెళ్లా. అక్కడ నాకొక స్నేహితుడు ఉన్నాడు. 'ఇప్పుడు నీ పని పక్కన పెట్టు. తరుణ్‌ భాస్కర్‌ సినిమాలో మెయిన్‌ లీడ్‌ ఇంకా ఓకే కాలేదు. వెళ్లి ఆడిషన్‌ ఇవ్వచ్చుకదా' అన్నాడు. అప్పటికే నేను మూడు నెలల నుంచి ఆడిషన్స్‌కు వెళ్లలేదు. వెళ్తే ఏదో ఒక చిన్న రోల్‌ ఇస్తారు. హీరో రోల్స్‌కి ఫిక్స్ అయి ఉంటారులే అనుకున్నా. కొత్తవాడిని తీసుకొచ్చి మనల్ని మెయిన్‌ లీడ్‌లో పెట్టి సినిమా ఎవరు తీస్తారనుకున్నా. అతను నా ఫోటోను తీసి వెంటనే తరుణ్‌ భాస్కర్‌కు పంపిస్తే 'అరె.. ఈ అబ్బాయి కోసం నేను రెండు నెలల నుంచి వెతుకుతున్నా.. పిలువు' అన్నాడు. 'ఫలక్‌నుమాదాస్‌ సినిమా తీస్తున్నావంట కదా' అన్నారు. 'అవును నేనే నిర్మాతని. మీరు సినిమా ఛాన్స్ ఇస్తే నా సినిమా ఆపేస్తా' అని అన్నాను. వెంటనే తరుణ్‌ పది నిమిషాల్లో కథ చెప్పేసి, చేతిలో స్టోరీ పెట్టాడు. అలా స్టోరీ పట్టుకొని షాక్‌తో ఇంటికెళ్లా. తర్వాత కథ మొత్తం చదివా. ఆ సినిమానే 'ఈ నగరానికి ఏమైంది'. అయితే మళ్లీ నిరాశే. వారం తర్వాత ఈ సినిమాలో నేను లేను. నాకు ఏదీ సక్రమంగా రాదు. అలా వస్తే నేనే షాక్‌ అవుతా. అలా ఉండగానే ఫోన్‌ వచ్చింది. 'సారీ మీరు సెలక్ట్‌ కాలేదు. కారణాలు ఏంటి అనేది అడగొద్దని' అని చెప్పారు. మళ్లీ బాధపడ్డా. కానీ, మూడో రోజూ నాకు.. ఎవరో అమ్మాయి నా గురించి మెయిల్‌ పెట్టింది. 'వీడు నా సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు మత్తు మందు ఇచ్చి, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాలాంటి పరిస్థితి ఏ హీరోయిన్‌కీ రావద్దు. వీడిని మీ సినిమాలో పెట్టుకుంటే మీ ఇష్టం. నేను చెప్పిన తర్వాత మీరు వాడిని సినిమాలో పెట్టుకుంటే మీడియా ముందుకెళ్లి ఏం చేయాలో నాకు తెలుసు' దాని సారాంశం. ఆ బాధ కాస్త నాకు భయంగా మారింది.

సినిమా అవకాశం ఈరోజు కాకపోతే రెండురోజులకో, పదిరోజులకో సంపాదించుకుంటా. దీనివల్ల వారం రోజుల పాటు నాకు నిద్ర రాలేదు. తరుణ్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి ఆ మెయిల్ చేసిన అమ్మాయి ఎవరో చెప్పండి. నేను నిజం తేల్చుకుంటా అనగానే.. అతను నన్ను నమ్మాడు. 'నాక్కూడా ఎందుకో డౌట్‌ వస్తోంది విశ్వక్‌. మెయిల్ పంపిస్తున్నా చూడు' అని మెయిల్ చేశాడు. ఆ మెయిల్‌ పంపించిన అమ్మాయి అసలు ఆ మెయిలే పంపలేదు. 2, 3 సంవత్సరాల క్రితం ఏదో మ్యూజిక్‌ కాన్సెప్ట్ అప్పుడు జరిగిన గొడవలో ఓ ఫ్రెండ్‌ని నేను కొట్టా. ఇదంతా అతనే చేశాడు. అతను బాగా చదువుకున్నవాడు. తర్వాత వాడి తప్పును వాడే ఒప్పుకునేలా చేసి అప్పటికప్పుడు సురేశ్​ బా​బుగారి దగ్గరకు తీసుకెళ్లి విషయం చెప్పించాం. తర్వాత ఆయన ఓకే చేసి తరుణ్‌ భాస్కర్‌ దగ్గరకు పంపాడు. వెంటనే తరుణ్ నన్ను కౌగిలించుకొన్నారు. తరుణ్‌ నా మీద నమ్మకం పెట్టుకొని మెయిల్ పంపించడం వల్ల అసలు విషయం బయటపడింది. లేకపోతే ఆ మచ్చ నాకు అలానే ఉండిపోయేది. నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది తరుణ్‌ భాస్కర్‌కే.

ప్రేక్షకులకు మీ మీద ఉన్న మచ్చని అలా తుడిపేశావ్‌ అన్నమాట?

విశ్వక్‌సేన్‌:అసలు ఈ విషయం బయట ఎవరికీ పెద్దగా తెలియదు. ఏ మనిషి గురించి అయినా విన్నది నమ్మొద్దు. ఎవరి మీదైనా సరే ఊరికే నిందలు వేయకూడదు. మీరు చూస్తే తప్ప నమ్మకండి. ఇలా నమ్మడం వల్ల కొన్ని జీవితాలే నాశనమైపోతాయి.

17 ఏళ్ల వయసులోనే ముంబయి వెళ్లి స్టార్‌ హీరో దగ్గర యాక్టింగ్‌ నేర్చుకున్నావట. ఎవరా హీరో?

విశ్వక్‌సేన్‌:అనుపమ్ ఖేర్‌. ఆయనకు ఫిల్మ్ స్కూల్‌ ఉంది. ఆడిషన్స్ చేసి తీసుకుంటారు. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా. కేవలం పరీక్షలు రాయడానికే మాత్రమే హైదరాబాద్‌ వచ్చేవాడిని. అనుపమ్‌ ఖేర్‌ ఆరు నెలల క్రమంలో మూడు టాస్క్‌లు ఇచ్చారు. ఓ సాంగ్‌ ఇచ్చి దీన్ని డైలాగ్‌లా చెప్పమంటారు. అలా చెప్పిన వాళ్లకి వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. అలా రెండు సార్లు టాస్క్ గెలిచి ఆ డబ్బును నేను తీసుకున్నా.

హీరోగా అయినా సెకండ్‌ హీరోగా అయినా ఎన్ని సినిమాలు చేశారు?

విశ్వక్‌సేన్‌:నాలుగు సినిమాలు చేశా. మొదటి సినిమా కేవలం 12 లక్షల్లో నిర్మించాను. అది థియేటర్లో విడుదల చేసేందుకు తీయలేదు. తర్వాత ఆ సినిమాని దిల్‌రాజు తీసుకొని థియేటర్లో విడుదల చేశారు. ఇంకా 'ఫలక్‌నుమా దాస్‌', 'ఈ నగరానికి ఏమైంది' రెండు విజయవంతమైన చిత్రాలే.

మీకు జాతకాలు, పంచాంగం అంటే బాగా ఆసక్తి అనుకుంటా?

విశ్వక్‌సేన్‌:నాన్న కరాటేతో పాటు జెమ్స్ స్టోన్స్ ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసేవారు.

మీరు సంచిలో పంచాంగం పెట్టుకొని ముహూర్తాలు చూసి అమ్మాయిలకి లవ్‌ లెటర్స్ ఇస్తుంటావట నిజమేనా?

విశ్వక్‌సేన్‌:పంచాంగం చూసుకోకుండానే నేరుగా వెళ్లి ఇచ్చేవాడిని. నిజాయితీగా ఒక్కరికే ఇచ్చాను. అది 8వ తరగతి చదువుతున్నప్పుడు. పదో తరగతి అమ్మాయికి లవ్‌ లెటర్‌ ఇచ్చాను. అంతా సినిమాల్లో జరిగినట్టే. చాక్లెట్‌ తీసుకెళ్లి దాని వెనుక ఐ లవ్‌ యు అని రాసి, స్టేజీ వెనుకాలకు పిలిచి ఇచ్చా. మూడు రోజుల తర్వాత సమాధానం వచ్చింది. ఎవరి నుంచి అంటే, అమ్మాయి వల్ల అమ్మ దగ్గర నుంచి. వెంటనే ప్రిన్సిపల్‌ రూమ్‌కి పిలిచారు. సారీ చెప్పి వచ్చేశా.

ప్రస్తుతం'పాగల్‌'చిత్రం చేస్తున్నారు. ఇది ఎంతమందిని పాగల్‌ చేస్తుంది?

విశ్వక్‌సేన్‌:1600 మంది అమ్మాయిల్ని. సినిమాలో మాత్రమేనండీ.

ఇది మీ స్టోరీయేనా లేక కల్పితమా? లేదా ఏ సినిమాలో నుంచైనా తీసుకున్న అంశమా!

విశ్వక్‌సేన్‌:లేదు ఇదొక సరికొత్త కథ. ఈ కథలో హీరో చాలా మంచి వాడు. ఇంత మంచివాడు బయట ఉన్నాడా అని అనిపిస్తుంది.

'హిట్‌' అనే సినిమా తీశారా?

విశ్వక్‌సేన్‌:అవును. లాక్‌డౌన్‌కి ముందు విడుదలైన సినిమా ఇదే. లాక్‌డౌన్‌కి ముందు 'పాగల్‌' సినిమా చేయాలి. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడే 'హిట్‌' కథ విన్నాను. కథ నచ్చింది. ఇక 'పాగల్‌' కొంచెం పెద్ద సినిమా. ఎక్కువ ప్రదేశాల్లో షూటింగ్‌ చేయాలి. 'హిట్ 2' సినిమా పొగరుతో వదులుకోలేదు. కేవలం 'పాగల్‌' సినిమా కోసమే వదులుకున్నా. నేను పొగరు చూపించని ప్రదేశం ఏదైనా ఉందంటే అది సినిమా సెట్లోనే. నేను పొగరుతో ఉంటే నాతో ఎవరైనా వస్తారా? నాతో కలిసి పనిచేస్తే.. వాళ్లు నా కుటుంబ సభ్యులైపోతారు.

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో షూటింగ్‌ చేయడానికి పెద్ద స్కెచ్ వేసి..సీక్రెట్‌గా వెళ్లి షూటింగ్‌ చేసుకొని వచ్చారట.

విశ్వక్‌సేన్‌:సీక్రెట్‌గా 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో జరిగింది. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ లోపల ఇప్పటి వరకు ఎవరూ కెమెరా పెట్టలేదు. 30 ఏళ్ల కిందట నాగేశ్వరరావుగారి సినిమా చేశారట. నాకు ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ యూనియన్ లీడర్స్ సపోర్టు ఉంది. ఉదయం 10, 11 గంటలకే షూటింగ్ ఆపేశా. 12 తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. అప్పటికి విశ్వక్‌సేన్‌ అంటే ఎవరో వాళ్లకు తెలియదు. నేను కూడా జూనియర్‌ ఆర్టిస్టులతో కలిసిపోయా. హైదరాబాద్‌ కోసమే ఆ సినిమా తీశా. వందేళ్ల తర్వాత 'ఫలక్‌నుమా దాస్‌' చూసి హైదరాబాద్‌ వాడి పొగరు ఎలా ఉంటుందో తెలియాలనే సినిమా తీశా.

ఎవరో మీతో గొడవ పడ్డారని మీ అక్కయ్యే వాళ్లను ఇరగొట్టేసిందట?

విశ్వక్‌సేన్‌:అది రామానాయుడు స్టూడియో. అదే నా గురించి చెడుగా మెయిల్‌ పెట్టాడని చెప్పానే అతనిపైనే. సురేష్‌బాబును కలిసి బయటకు వస్తున్నాం. సినిమా స్టైల్‌లో కారు వచ్చి ఆగింది. కారు దిగి వచ్చి అతనితో గొడవపడింది. అక్క అంటే భయం, గౌరవం. ఏ విషయమైనా మేం నలుగురం కలిసే నిర్ణయం తీసుకుంటాం.

నీపైనా చిత్రసీమలో ఓ రకమైన టాక్‌ నడిస్తోంది. నీకు పొగరు ఎక్కువ అని.. అందువల్లే సినిమాలు మిస్‌ అయ్యావని విన్నాం?

విశ్వక్‌సేన్‌:కొత్తగా ఒక యాక్టర్‌ సెట్లోకి వస్తే భయపడుతుంటారు. పది నిమిషాల తర్వాత 'అన్నా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను సారీ' అని చెబుతుంటారు. ప్రతిసారి కొత్త యాక్టర్‌ పరిచయం అయిన తర్వాత నాకు వినిపించే మాట ఇది. ఇలా ఎందుకు బయటకు వస్తుందో నాకు తెలియదు. 'ఫలక్‌నుమా దాస్‌' చిత్రం తీసిన సమయంలో కొన్ని గొడవలు జరిగాయి. కొంతమంది కావాలని పోస్టర్లు చింపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికి ధన్యవాదాలు చెబుతూ.."హైదరాబాద్‌లో ఏమో జరుగుతుంది. వచ్చిన తర్వాత అందరికి సమాధానం చెబుతా" అని హిందీలో ఓ చిన్న డైలాగ్‌ వాడాను. తర్వాత ఫోన్‌ను పక్కన పెట్టేశా. ఒక గంట తర్వాత చూస్తే ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోపై అల్లకల్లోలం.

జనరల్‌గా వార్నింగ్‌ ఇచ్చావా? లేదా ఎవరినైనా ఉద్దేశించి అన్నావా?

విశ్వక్‌సేన్‌:అందరూ ఓ పదం వాడారు. ఇప్పటి వరకు నా నోట వెంట ఆ పదం రాలేదు. అందరూ మాట్లాడుకునేది. ఓ హాట్‌ టాపిక్‌లా తయారు చేశారు. విజయ్‌ దేవరకొండను కామెంట్‌ చేశానని అనుకున్నారు. నేను ప్రమాణంగా చెబుతున్నా. ఇప్పటి వరకు నేను ఎక్కడా చెప్పలేదు. ఈ షో ద్వారా ఎక్కువ మందికి చేరవవుతుందని, నేను వారందరికి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని చెబుతున్నా. నేను చెప్పిన దాన్ని వేరేలా కలిపివేశారు. విజయ్‌ దేవరకొండ గురించి, కానీ వాళ్ల అభిమానుల గురించి ఏమీ మాట్లాడలేదు. నా పోస్టర్‌ చిరిగిపోయింది ఎవరూ చూడలేదు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో 30 సెకన్ల పాటు మాట్లాడింది చూపించారు. కానీ, అంతకు ముందు రెండు నిమిషాలు మాట్లాడిన దాని గురించి ఎవరూ చూడలేదు. కానీ దీనిపై సమాధానం చెప్పలేక అలసిపోయా. తర్వాత రోజు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా. కానీ ఎవరికీ అది ఇంట్రస్టింగ్‌గా లేదు. అంతకు ముందే నా సినిమా ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడుతూ..'మొన్న ఒకర్ని లేపాము. మళ్లీ వీడిని లేపితే.. నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తాడు. వీడిని తొక్కి ఉంచండి' అని ఓ నిర్మాత అన్నారు. ఆ మాట వినుకుంటూ ఫంక్షన్‌కి వచ్చా. నాలో ఎనర్జీ చచ్చిపోయింది. నా ఫేస్‌ ఎవరి తెలియదు. నా గురించి వచ్చిన రెండువేల మంది తిరిగి వెనక్కి ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తోంది. స్వయంకృషితో వచ్చినా తొక్కేస్తారా? అని భయంతో స్టేజీ మీద మాట్లాడిన మాటలు అవి. ఇప్పటికీ నేను అదే చెబుతా.. నాకెవ్వడూ సినిమా ఇవ్వకుండా. ఏమీ చేయని పరిస్థితి వస్తే.. నాకు ఇప్పటికీ దమ్ముంది. నాకు నేనుగా నిలబడతా. ఆ దమ్ము నాకుంది.

చిత్రసీమలో నీకు ఏ హీరో ఆదర్శం?

విశ్వక్‌సేన్‌:ఎన్టీఆర్‌. ఆయన నటించిన 'సింహాద్రి' సినిమా. తెలుగు భాష మీద పట్టున్న నటుడు. ప్రతి డైలాగ్​ను పలకగలిగిన నటుడు. నిజాయతీగల నటుడు. యాక్టింగ్‌ సినిమాలైనా, కమర్షియల్ చిత్రాలైనా ఆయనకు ఆయనే సాటి.

'ఫలక్‌నుమా దాస్​'చిత్రంలో సన్నివేశాలు.. మీ నిజ జీవితంలో జరిగాయా?

విశ్వక్‌సేన్‌:పోలీస్‌స్టేషన్‌కు రెండుమూడు సార్లు వెళ్లాను. అవి కాలేజీ గొడవలు. ఓసారి కాలేజీ వేడుక జరుగుతోంది. ఆ గొడవ వల్ల ఆ వేడుక ఆగిపోయింది. జైల్లో పెట్టలేదు. కానీ వార్నింగ్‌ ఇచ్చి పంపారు.

విశ్వక్​సేన్

పెళ్లెప్పుడు? ఆ అమ్మాయినే చేసుకుంటున్నావు కదా?

విశ్వక్‌సేన్‌:నాకు 25 ఏళ్లు‌. సరైన సంబంధం దొరికితే చేసుకోవడానికి ఇప్పుడైనా రెడీగా ఉన్నా.

'పాగల్‌' ఎప్పుడొస్తుంది? ప్రతినాయకుడి పాత్రలో నటిస్తారా?

విశ్వక్‌సేన్‌:అందరి సినిమాలు విడుదలైనప్పుడే. నలుగురితో నారాయణ. ఎప్పుడొచ్చినా హిట్‌ కొడతాను. ఓ కొత్త హీరో అయినా సరే, ప్రతినాయకుడిగా నా పాత్ర బాగుంటే చాలు నటిస్తా.

మీ చిన్నప్పటి తీపి గుర్తులు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? మీ ఇంట్లో ఎవరికైనా కోపం వస్తే ఫోన్లు పగులుతాయట?

విశ్వక్‌సేన్‌:మా అమ్మ చిన్నప్పుడు ఇక్కడే వాత పెట్టింది. అప్పుడు నేను చేసే పనులు కూడా అలా ఉండేవి. ఇంట్లోని మట్టి హుండి పగులగొట్టి అందులో కొన్ని డబ్బులును జేబులో పెట్టుకొని అమ్మకు దొరికిపోయా. అప్పుడే నాలుగైదు అట్లు నా తొడలపై వేసింది. కోపం వస్తే సెల్‌ఫోన్స్ పగలగొట్టేస్తా. కానీ మళ్లీ బాధేస్తుంది.

ఇంటర్‌లోనే ప్రిన్సిపల్ మార్చేచేశావట? అంత పెద్ద రౌడీవా?

విశ్వక్‌సేన్‌:రౌడీ అని కాదు. మా ప్రిన్నిపల్ '3 ఇడియట్స్'లో బొమన్‌ ఇరానీ లాంటి వారు. నేను ఇంటర్‌లో ఏంపీసీలో చేరిన ఒక రోజు తర్వాత ఎంఈసీకి వెళ్దామనుకున్నా. మా అమ్మానాన్నలు కాలేజీ వచ్చారు. మేం రౌండింగ్‌ వెళ్లే వచ్చే వరకూ అమ్మానాన్నలను అలాగే నిలబెట్టారు. ఆ తర్వాత ఎంఈసీ గ్రూప్‌లో చేరా. నాకు నచ్చిన అమ్మాయి పక్కన కాకుండా వేరే ముందు బెంచ్‌కి మార్చారు. దాంతో మరుసటి రోజే కాలేజీ బయట సగం మంది విద్వార్థులతో ప్రిన్సిపల్ మార్చాలని డిమాండ్‌ చేశా. ఆయన్ను వేరో చోటికి బదిలీ చేశారు.

ఇదీ చూడండి:వలస కార్మికులకు సాయంగా సన్నీలియోన్​

Last Updated : May 6, 2021, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details