అతని పాట వింటే మౌనంగా ఉన్న మనసులో కూడా ప్రేమ చిగురిస్తుంది. ఆమె గొంతు నిత్యం మనల్ని బుల్లితెరపై పలకరిస్తూనే ఉంటుంది. మాట, పాటలతో ప్రారంభమైన వీరి గాత్ర ప్రయాణం.. సంగీతంలో ఒక్కటైంది. నిత్యం తన గొంతుతో ప్రేక్షకులను అలరించే ఈ రాగాల జంట సింగర్ విజయ్ ప్రకాష్(Vijay Prakash), మహతి(Mahati).. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ సంగీత ప్రయాణంతో పాటు వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు.
గ్రామీ అవార్డు ఫంక్షన్స్‌లో..
'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రంలోని 'జయహో' సాంగ్‌తో తనకు మంచి గుర్తింపు లభించిందని అన్నారు సింగర్ విజయ్ ప్రకాష్. ఈ పాటకు రెండు ఆస్కార్ అవార్డులు రావడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. అయితే ఈ పాట కోసం గ్రామీ అవార్డ్ ఫంక్షన్లో సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్‌తో కలిసి స్టేజ్‌పై పాట పాడడం మరచిపోలేని జ్ఞాపకమని తెలిపారు.
ఆ పాటతో కాశీలో హారతి
తాను పాడిన 'ఓమ్ శివోహం' పాటకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని అన్నారు గాయకుడు విజయ్ ప్రకాష్. ఈ పాటను కాశీలోని శివునికి హారతి ఇచ్చే ముందు ప్లే చేస్తున్నారని తెలుసుకొని ఆనంద పడినట్లు తెలిపారు. అయితే ఈ పాట పాడగలనని నమ్మకం తనకు లేకపోయినా.. సంగీత దర్శకుడు ఇళయరాజా నమ్మి పాట పాడించారని వెల్లడించారు. కానీ, ఇప్పుడా పాటతో తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ఈటీవీలో ప్రసారమైన 'సూపర్ మస్తీ' అనే కార్యక్రమంలో ఈ పాటకు దాదాపుగా 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయని గుర్తుచేశారు విజయ్ ప్రకాష్.
విజయ్ ప్రకాష్ 'డే'
అమెరికాలోని నార్త్ కరొలినా రాష్ట్రానికి చెందిన ఓ నగరంలో మే 12న విజయ్ ప్రకాష్ రోజుగా ప్రకటించారట. 2019లో ఏర్పాటు చేసి ఓ మ్యూజికల్ కన్సర్ట్‌లో అక్కడి మేయర్ పాల్గొన్నారట. విజయ్ ప్రకాష్ పాడిన పాటలకు అక్కడి ప్రజలు సంతోషంగా ఉండడం చూసి.. ఆ రోజును 'విజయ్ ప్రకాష్ డే'గా ప్రకటించారట.
ఇదీ చూడండి..విదేశాల్లో విజయ్ ఆ పాట పాడితే ఏం జరిగిందో తెలుసా?