తొలి చిత్రం 'పెళ్లిచూపులు'తోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ చిత్రంతో జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్నాడు. డైరక్టర్‌గానే కాకుండా నటుడిగా, రచయితగానూ ప్రతిభ చూపుతున్నాడు. సినిమాతోపాటు వెబ్ సిరీస్, టెలివిజన్ షోలతోనూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. 'మీకు మాత్రమే చెప్తా' చిత్రంతో వెండితెరపై కనిపించి అలరించిన తరుణ్.. బుల్లితెరపై 'నీకు మాత్రమే చెప్తా' అంటూ సందడి చేయబోతున్నాడు. తన తోటి దర్శకులతో కలిసి చేసిన ఆ టాక్ షో.. ఈ నెల 14 నుంచి ప్రతి శనివారం రాత్రి 9గంటలకు ఈటీవీ ప్లస్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్‌తో ముచ్చటించింది 'ఈనాడు'.
- ఒక పక్క దర్శకత్వం, మరోపక్క నటన కొనసాగిస్తున్నారు. ఇప్పుడేమో 'నీకు మాత్రమే చెప్తా' అంటూ బుల్లితెరపై సందడికి సిద్ధమయ్యారు?
తొలినాళ్లలో పోస్టర్లు డిజైన్ చేశా. ఆ తర్వాత పెళ్లిళ్లకు ఫొటోలు తీసేవాడిని. అప్పట్లో నాకొక చిన్న ఆఫీస్ ఉండేది. దానికి అద్దె కట్టుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఎవరు ఏ అవకాశంతో నా దగ్గరికొచ్చినా ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటుంటా. శ్రీకాంత్, శరత్, ప్రభు వచ్చి... ఒక టెలివిజన్ షో చేయాలి, అందులో దర్శకుల అనుభవాల్ని పంచుకోవాలని చెప్పేసరికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. దర్శకులు వాళ్ల వ్యక్తిగత ప్రయాణాన్ని, అనుభవాల్ని పంచుకునే షో ఇది. చాలా మంది దర్శకులు వాళ్ల జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాల్ని, కొన్ని ఆసక్తికరమైన సంఘటనల్ని పంచుకున్నారు. ఎప్పుడూ బయటికి చెప్పని షాకింగ్ నిజాల్ని చెప్పారు.
- మీతోటి దర్శకులు వాళ్ల అనుభవాల్ని పంచుకున్నప్పుడు మీకు మీ ప్రయాణం గుర్తుకొచ్చిందా?
జేబులో వంద రూపాయలు ఉండేవి కాదు కానీ, రూ.100 కోట్ల సినిమాని ఊహించుకుంటూ, స్క్రిప్టులు పట్టుకుని పరిశ్రమలో తిరిగేవాణ్ని. వాళ్ల కష్టాలు చెబుతున్నప్పుడు నా జీవితం మరోసారి కళ్ల ముందు తిరిగింది. అనిల్ రావిపూడి, మారుతి... ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కో రకమైన కష్టాల్ని ఎదుర్కొన్నారు. 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్ మహా, నేను చాలా రోజులుగా కలిసి ప్రయాణం చేస్తున్నాం. అతడు నా షోలో పంచుకున్న విషయాలు నాకే షాకింగ్‌గా అనిపించాయి. పరిశ్రమలోకి రావాలనుకునేవాళ్లకు ఈ షో మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
- ఒక దర్శకుడిగా ఈ షోతో మీరు కొత్తగా నేర్చుకున్న విషయాలేమైనా ఉన్నాయా?