నిరంతరం వినోదాన్ని పంచుతూ ఇంటిల్లిపాదిని అలరించే బుల్లితెర చిన్నబోతుంది. ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు 24 గంటలు శ్రమిస్తున్నా... పాలకులెవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంవత్సరాల నుంచి పోరాడుతున్నా.... ధారావాహికలా తమపోరు కొనసాగుతుందే తప్ప ప్రయోజం లేదని తెలుగు టెలివిజన్ సంఘాలు వాపోతున్నాయి. తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఆవిర్భవించి 50 ఏళ్లవుతున్న వేడుక వేదికగానే తమ గళం గట్టిగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14న నివేదన సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఎదుర్కొంటోన్న సవాళ్లు, కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించబోతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 14న అన్నిరకాల చిత్రీకరణలకు సెలవు ప్రకటించినట్లు టెలివిజన్ సంఘాలు స్పష్టం చేశాయి.
కష్టంగా ఉంటోంది..
49 ఏళ్ల కిందట... దూరదర్శన్‌లో కేవలం 16 మందితో ప్రారంభమైన తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది. నిత్యం రకరకాల వినోద, విజ్ఞాన కార్యక్రమాలతోపాటు రియాల్టీ షోలు, ధారావాహికలను అందిస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తుంది. కృష్ణానగర్, వెంకటగిరి, మధురానగర్ సహా చట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగురాష్ట్రాల నుంచి వచ్చి అద్దె ఇళ్లల్లో నివసిస్తూ అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతిభ చాటుకుంటున్నారు. తెరవెనక రేయింబవళ్లు కష్టపడుతున్న శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదని పలువురు కార్మికులు వాపోతున్నారు. సరైన భద్రత లేకపోవడం, అంతంతమాత్రంగానే వచ్చే జీతం డబ్బులతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టంగా మారుతోందని ఆందోళన చెందుతున్నారు.