పుట్టి పెరిగింది కర్ణాటక. తెలియని భాషలో అడుగుపెట్టినా.. అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. మాట నుంచి చీరకట్టు వరకు అన్నీ నేర్చుకుంది. కన్నడలో మాట్లాడుతున్నా మధ్యలో తెలుగు పదాలే వచ్చేస్తాయ్! అంతలా తెలుగమ్మాయిలా మారిపోయింది. 'నా పేరు మీనాక్షి'లో కథానాయిక నవ్యస్వామి గురించే ఇదంతా! వసుంధరతో తను బోలెడు విశేషాలను పంచుకుంది..
పుట్టి, పెరిగింది మైసూరు. చదివిందేమో బెంగళూరు. నాన్న పుట్టస్వామి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, అమ్మ సరస్వతి గృహిణి, అన్న వినయ్ వ్యాపారం చేస్తున్నాడు. వదిన ఐశ్వర్య కూడా సీరియళ్లలో చేస్తుంది.
అలా మొదలైంది..తెలుగులోకొచ్చి ఎనిమిదేళ్లు. ఇంటర్ సెలవుల్లో టీవీ యాంకర్ కావాలన్న ప్రకటన చూసి ప్రయత్నిస్తే ఎంపికయ్యా. చదువుకీ ప్రాధాన్యం ఇవ్వాలన్న నాన్న మాటతో యాంకరింగ్ చేస్తూనే బీబీఎం పూర్తి చేశా. కన్నడంలో ఓ సినిమా కూడా చేశా. తర్వాత ధారావాహికలు. అలా.. కన్నడ, తమిళం.. తర్వాత తెలుగుకొచ్చా.
నిత్యం నేర్చుకుంటా..ఇక్కడ నా మొదటి సీరియల్ 'ఆహ్వానం'. తర్వాత 'నా పేరు మీనాక్షి'తో మంచి గుర్తింపొచ్చింది. చిన్నప్పటి నుంచి సినిమాలు, నటులు ఇష్టమే కానీ ఈ రంగంలోకి రావాలన్న ప్రత్యేక కోరికేమీ లేదు. స్కూలు, కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడమే తప్ప ప్రత్యేకంగా నటనని నేర్చుకోలేదు. ఓ తమిళ సీరియల్‌లో రాధికా శరత్ కుమార్‌తో కలిసి పని చేశా. దాంట్లో తండ్రి చనిపోయినపుడు ఏడ్చే సీన్ చూసి ప్రశంసించారు. ఆమె త్వరగా ఎవరినీ మెచ్చుకోరట. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకం. షూటింగులకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొంత మంది ఎంతో దూరం ప్రయాణించి మరీ వస్తారు కలవడానికి. చాలామంది మెసేజ్‌లూ పెడుతుంటారు. ఇవన్నీ చూసినపుడు చాలా ఆనందమేస్తుంది. అందుకే నన్ను నేను మెరుగుపరచుకుంటూ ఉంటా. నేను చేసిన సీన్లను చూసుకుని మార్చుకోవాల్సినవి నోట్ చేసుకుంటా. మా అమ్మ నా విమర్శకురాలు. మంచి సలహాలూ ఇస్తుంటుంది. అవన్నీ పాటిస్తా. ఆడవాళ్లు ఎక్కువగా నా డ్రెసింగ్ బాగుందంటారు. మాది మధ్యతరగతి కుటుంబం. ఫ్యాషన్, మేకప్‌ల గురించి ఇంతకు ముందు పెద్దగా తెలీదు. అందరినీ గమనిస్తూ మెరుగుపరచుకున్నా.