ప్రతిభ ఉండీ, రాగాలు నేర్చుకునే శక్తిలేక జీవనరాగంతో రాజీపడిన అనేక నవయువ స్వరాలను బాలు తట్టిలేపారు. సీహెచ్ రామోజీరావు నిర్మించిన ఈటీవీ 'పాడాలని ఉంది' ద్వారా బాల, యువ స్వరాలను వెలుగులోకి తీసుకొచ్చారు. తర్వాత ఆయన ఆశీస్సులతో ఇదే క్రమంలో 'స్వరాభిషేకం' కార్యక్రమం తీసుకొచ్చారు. గాయకులు బోయీలుగా పాటలు పల్లకీలో విహరించే అపురూప కార్యక్రమం. దక్షిణ భారత టెలివిజన్ చరిత్రలో సువర్ణాధ్యాయం స్వరాభిషేకం. ఆ కార్యక్రమం ఎంతో ఆహ్లాదంగా, అలసిన మనసులకు సంగీత లేపనంగా రూపుదిద్దుకుంది. తెలుగుసినిమా పాటతో ఎన్నెన్నో జన్మల రాగబంధం ఉన్న శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మార్గదర్శనంలో స్వరాభిషేకం ప్రేక్షకలోకాన్ని మైమరిపించింది. స్వరాభిషేకంలో మంత్రపుష్పాలలా జ్ఞాపకాల చర్చ చందన చర్చితమౌతుంటే అందరూ మంత్రముగ్ధులై ఆస్వాదిస్తుంటారు. అతడి మాటలకు ఎదలోతుల్లో జ్ఞాపకాలన్నీ పొరలు చీల్చుకుని కన్నీటి తెరలుగా ఉబికి ఉబికి వస్తాయి. సినీబంధువులంతా ఆ జ్ఞాపకాల చలమలోకి, ఆ అనుభవాల కాసారంలోకి తొంగి చూసుకుని తమను తాము ‘గుర్తించు’కుంటారు. కలకాలం గుర్తుంచుకుంటారు.
సంగీత వాద్య బృందంలో ఏఏ కళాకారుడు ఏఏ పరికరంతో సహకరిస్తున్నాడో జ్ఞాపకం ఉంచుకుంటారు బాలు. సంగీత, సాహిత్య సమలంకృతం. అంతరంగాలలోని మధుర స్మృతుల ఆవిష్కరణకు అవార్డులు ఇస్తే ప్రథమ పురస్కారం ఆయనకే దక్కుతుంది. బాల సుబ్రహ్మణ్యం మెదడు పెద్ద మెమొరీ కార్డు. వేలవేల గిగాబైట్ల జ్ఞాన భాండాగారం. అతడితో సంభాషించడం అంటే తెలుగు సినిమా కనీస ఐదున్నర దశాబ్దాలు తన జ్ఞాపకాలను, వ్యాపకాలను నెమరువేసుకోవటమే అయ్యింది. దశాబ్దాల సంగీతయాత్ర గురించి వివరించే సందర్భంలో.. ఆ మాటకచేరీలో, ఆ పాటకచేరీలో అతడి స్మృతిపథాన్ని తాకని మనిషి ఉండడు. తెలుగు తెలియని దర్శకులు, తెలుగు రాని గాయకులతో పాడించి నవ్యత పేరుతో మాతృభాషకు తీరని ద్రోహం చేస్తున్నారని బాలసుబ్రహ్మణ్యం బాధపడేవారు.