తెలంగాణ

telangana

ETV Bharat / sitara

SP Balu: బ్రహ్మ, మురారీ.. బాలు 'స్వరార్చితం'

నీతో భాషణం సంగీత సాహిత్య సమలంకృతం. నీ పాట ప్రేక్షక వీక్షకుల పూర్వజన్మ సుకృతం. సప్తస్వరాల 'ధ్యాన సుబ్రహ్మణ్యం', 'ప్రాణ సుబ్రహ్మణ్యం', 'గాన సుబ్రహ్మణ్యం'.. ఏ పాటయినా అలవోకగా ఆలపించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. నీగళం సుస్వర భాస్వరం. మధుర స్వరమేళనం. అలసిన మనసుల లాలనం. వసంతాలలో ఊయలలూపిన స్వరం. విలక్షణ గళం. బుడతలకు భాషోజ్వలనం.

Singer SP Balu birthday story
ఎస్పీ బాలు

By

Published : Jun 4, 2021, 8:00 AM IST

ధన్యోస్మి. ధన్యోస్మి. స్వర విన్యాసం మోహనం. వైవిధ్య గళ సమ్మోహనం. సంగీత ఆరాధనం. నీ గళం రాగదీపకం. మేఘ మల్హరం. శిశిరాలు తరిమిన నిత్యగాన వసంతం. యువ స్వరాలకు వరాల దీవెన. ఇష్ట దైవానికి అర్చన. ఎవరు పాడారు భూపాలం? నీవు భువిని మేల్కొల్పే భూపాల రాగం. మనసును రంగుతో నింపేదే రాగమట. ప్రభాతమూ అరుణమే. సంధ్యవేళ సంజకెంజాయమే. నీవో స్వరాగం. సురాగం. నీవు ఆలపిస్తే రాగ సరాగం. రాగాల పరపరాగం. రాగ విషయ జ్ఞాన ధారణం. శబ్దాల స్థాయీ స్వగతం. మెదడు భాషా సంగతుల పదకోశం.

పాటకు నీవుచేసిన పట్టాభిషేకమే 'పాడుతా-తీయగా'. స్వరాభిషేకమే నీవు చేసిన ఆరాధనోత్సవం. వాద్యాలన్నీ నీకు స్వరనైవేద్యాలయ్యాయి. స్వరగాత్రాలన్నీ అహోరాత్రాలు నిన్ను తలచి మైమరచాయి. సంగీత, సాహిత్య సామరస్యం నీ విజయ రహస్యం. పాత్రధారణ, గాత్రధారణ.

గాయకుడా.. స్వరాలతో సయ్యాటల సంగీత నాయకుడా! మునివేళ్లు తంత్రులను మీటినట్లు.. మహతీనాదాలు ధ్వనించినట్లు, శ్వాసను ఉగ్గబట్టి పదాలతో ఆడుకున్నావు. భాషా శాస్త్రం నేర్చావా? సొగసైన ఉచ్ఛారణ.. నీ పలుకు, నీ బడి లేకపోతే.. నీపలుకుబడి లేకపోతే బాలగంధర్వుల సంగతేమిటి? బుడతల భవిష్యత్తేమిటి తెలుగు బాలూ.. తెనిగించే బాలు. వెలిగించే బాలు. ఇలవేల్పునకు నీభక్తి పాట మంత్రపుష్పం. దైవాలే మెచ్చే సమ్మోహన గళం.

ఎస్పీ బాలు

ఎస్పీబాలుడా! గళానికి వార్ధక్యం ఉంటుందా? నీ గానానికి ప్రాణప్రతిష్ఠుడా! స్వరజ్ఞాన విశిష్టుడా!! ఎంత ఎదిగినా.. అంతే ఒదిగావు. ఓ తెలుగు బాలూ.. వెలుగు బాలూ.

నీవో సప్తస్వర సంవాదం. సంగీత సంగతుల విజ్ఞాన సర్వస్వం. కళ్లముందు ప్రవహించే జ్ఞాపకాల హారం. నీవు నిన్నప్రత్యక్ష దైవం. నేడు పాటల జాబిల్లివి. మేఘాల తేరులో విహరిస్తూ వెన్నెల ఆకాశంలో.. నీలాల నింగిలో దేవతలకు నీ పాట వినిపించాలా? ‘నిన్ను తలచాం. నీగానంతో మైమరచాం’. నీవు నిత్యం మా వద్దే ఉండిపోవాలనుకున్నాం. విన్నపాలు వినవలెనంటూ వేడుకున్నా కరుణించలేదు తిరువేంకట ప్రభువు. మేం కోరుకున్న గాన యోగం చేజారిపోయింది.

నీవు నిత్య ప్రత్యక్ష నాదబ్రహ్మగా భావించాం. నాద శరీరాపరా..నీ శరీరం నీదీ.. నాదీ కాదు. స్వరబ్రహ్మలెక్కడో ఉండి భూమాతకు మంత్రోపదేశం చేశారట. నీ గళ మాధుర్యం, నీ పద లాలిత్యం, వసంత ఊయలలూపే నీగానం వింటే నీ ఇలవేల్పులు తిరిగి మళ్లీ మా దగ్గరికి పంపిస్తారంటివా నిన్ను.

మరుజన్మ ఉంటే మళ్లీ బాలసుబ్రహ్మణ్యంగానే పుడతావా? సరే! ఇంద్రుడో-చంద్రుడో ఒప్పుకుంటే చూద్దాం. లాలి పరమానందానికి జో అచ్చుతానంద. ఆనందడోలికల్లో చేర్చి మళ్లీ వింటాడట. నీనోట లాలిపాట ముకుంద.. రామగోవింద. నీకు బాలుగాంధర్వుడే కావాలా? నీ నిష్క్రమణతో దిగంతాలు దిగులుపడ్డాయి. నీవు దాటివెళ్లిన దిక్కులన్నీ దిగ్భ్రమలో ఉన్నాయి.

ఎస్పీ బాలు

మరి పంచభూతాలు ఎలా స్పందించాయంటే...

అగ్ని నిన్ను దహించలేనన్నది.

నీరూ కన్నీరై మిగిలింది.

ఆయువు ఇవ్వలేని వాయువూ దు:ఖించింది.

ఆకాశం పొగిలి పొగిలి ఏడ్చింది

ప్రియపుత్రుడవో.. గాన గంధర్వుడవో

'జననీ జన్మ భుమిశ్చ...స్వర్గాదపీ గరీయసీ'..

పుడమి మాత్రం అమ్మలా నీ శిరస్సు నిమిరింది

ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది.

'లాలీ జో లాలీ జో ఊరుకో పాపాయి'.

నీ పాట ఎంతో హాయి

'రామా..లాలీ..మేఘ శ్యామ లాలీ'..

అదిగో కోవెల నుంచి పల్లవిస్తున్న పాట

'ఓ మురారీ..'బాలు'మురారీ'..

'బ్రహ్మ ,మురారీ 'బాలు' స్వరార్చిత పుష్పం'

నీది అమరస్వరం. నీది అజరామర గళం.

ABOUT THE AUTHOR

...view details