హీరో అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చాడు. చులకనగా చూసిన వారితోనే శభాష్ అనిపించుకున్నాడు. రెండో సినిమానే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించి దర్శకుడిగా సత్తా చాటాడు. ఆయనెవరో కాదు 'సాహో' దర్శకుడు సుజిత్(Sujeeth). 'ఈటీవీ ప్లస్'లో ప్రతి శనివారం ప్రసారయ్యే 'నీకు మాత్రమే చెప్తా' కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోకు సుజిత్‌తోపాటు నటుడు అడివి శేష్(Adivi Sesh) హాజరై సందడి చేశారు. ఆ విశేషాలివీ..
మీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యం?
సుజిత్:అదేంటంటే.. హీరో అవుదామని చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టా. ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆడిషన్స్‌కు వెళ్లేవాణ్ని. అక్కడ నన్ను చూసినవాళ్లంతా 'ఏదో ఉంది కానీ ఏం లేదు' అనేవారు (నవ్వులు). అలా అన్న వాళ్లకు నేనేంటో చూపించాలని సీరియస్‌గా దర్శకత్వం వైపు అడుగేశా. నేను బ్యాడ్ యాక్టర్‌ని, గుడ్ డైరెక్టర్ని అని స్వీయ దర్శకత్వంలో (లఘు చిత్రాలు) నటించినప్పుడు తెలిసింది.
రెండో చిత్రాన్నే (సాహో) పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు కదా. ఎలాంటి ఒత్తిడి ఉండేది?
సుజిత్:నా తొలి చిత్రం 'రన్ రాజా రన్' సినిమాకు ముందు నుంచే ప్రభాస్‌తో పరిచయం ఉంది. నేను తీసిన 'ప్రేమ ఇష్క్ కాదల్' అనే లఘుచిత్రం ప్రభాస్‌కు బాగా నచ్చడం వల్ల నన్ను ప్రోత్సహించారు. 'రన్ రాజా' చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నాకు పరిచయమవడానికి ఓ రకంగా ప్రభాసే కారణం. అలా అని ఆయనతో సినిమా చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. 'రన్ రాజా రన్' విడుదలయ్యాక ఓ సారి ప్రభాస్‌ను కలిసినపుడు 'సినిమా చాలా బాగుంది.. మనం ఓ చిత్రం చేద్దాం' అని అన్నారు. ఆ సమయంలో ఓకే అనేశాను. కానీ, సీరియస్‌గా తీసుకోలేదు. నేను మాటిచ్చిన కొంతకాలానికి ప్రభాస్ కొత్త కథల కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తమిళ దర్శకులు కొందరు తమ స్క్రిప్టుల్ని ప్రభాస్ బృందానికి వినిపించేవారు. దాన్ని నేను తెలుగులోకి అనువదించేవాణ్ని. అంతా పూర్తయ్యాక 'చెత్తలా ఉంది కదా. ప్రభాస్ గారంటే ఎలా ఉండాలన్నా?' అని నేను అనగానే 'చెప్పడం కాదురా రాయాలి. మొన్న పార్టీలో చెప్పావుగా సినిమా చేస్తానని' అని అందులోని ఒకరు సమాధానమిచ్చారు. అవును కదా అనుకుంటూ నా దగ్గర ఉన్న ఓ పాయింట్‌ను నిర్మాతలకు చెప్పి, ఆ తర్వాత ప్రభాస్‌కు వినిపించాను. ప్రభాస్ అన్న వినగానే ఓకే చేయడం వల్ల ఆశ్చర్యపోయాను. 'బాహుబలి' తర్వాతే 'సాహో' షూటింగ్ మొదలుపెట్టినా నాకెలాంటి ఒత్తిడీ అనిపించలేదు. ఎప్పుడూ భయపడలేదు. ఈ సినిమా తెరకెక్కించే క్రమంలో సాంకేతికంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ ప్రపంచంలో నన్ను నాకంటే ఎక్కువగా ఎవరైనా నమ్ముతారు అంటే అది ప్రభాస్ అన్నే. ఇప్పుడు ఫోన్ చేసి 'అన్నా.. నా దగ్గర కథ ఉంది సినిమా చేస్తారా?' అంటే చేస్తాడాయన. ఎందుకంటే ఆయన నన్ను నమ్ముతున్నాడు. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. నేను కలిసిన ది బెస్ట్ పర్సన్ జాబితాలో ప్రభాస్ అన్న టాప్‌లో ఉంటాడు.
అడివి శేష్, సుజిత్.. మీ ఇద్దరూ ఎప్పుడు కలుసుకున్నారు?