పాన్ ఇండియా హీరోలను చూశాం.. పాన్ ఇండియా డైరక్టర్లనూ చూశాం. కానీ భాషలతో సంబంధం లేకుండా ఒక రచయిత పాన్ ఇండియా స్థాయికి చేరుకోవచ్చని.. అంతేకాదు.. అక్కడ రాణించనూ వచ్చని నిరూపించిన రచయిత విజయేంద్రప్రసాద్. టాలీవుడ్, బాలీవుడ్ అని ఇండస్ట్రీలతో తేడా లేకుండా సినిమాలకు మంచిమంచి కథలు అందిస్తూ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్‌గా కొనసాగుతున్నారు. 'బాహుబలి'తో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన డైరక్టర్ రాజమౌళి తండ్రి, ఆ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' (Alitho Saradaga) కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత ఆలీ అడిగిన ప్రశ్నలకు ఆయన సరదాగా సమాధానాలిచ్చారు.
ఆలీ: 'భజరంగీ భాయిజాన్' సినిమాను 'పసివాడి ప్రాణం'తో పోల్చి చూశారు చాలామంది..!
విజయేంద్రప్రసాద్:'పసివాడి ప్రాణం' నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమా చూసేటప్పుడు 'భలే బాగుందే.. సినిమా నొక్కేద్దామా' అని నా స్నేహితులతో అన్నాను(నవ్వులు).
ఆలీ: రచయితగా సక్సెస్ అయ్యారా? డైరక్టర్‌గా సక్సెస్ అయ్యారా?
విజయేంద్రప్రసాద్:రైటర్‌గా సక్సెస్ అయ్యాను. కానీ.. డైరక్టర్‌గా సక్సెస్ కాలేకపోయాను.
ఆలీ: డైరక్టర్‌గా విజయవంతం కాలేకపోవడానికి కారణం..?
విజయేంద్రప్రసాద్:తెలిస్తే ఈపాటికి పెద్దహిట్లు తీసి ఉండేవాడిని(నవ్వులు).
ఆలీ: మీ దర్శకత్వంలో వేరేవాళ్ల కథలు తీశారా? మీరు రాసుకున్న కథతో తీశారా?
విజయేంద్రప్రసాద్:ఒక వ్యక్తి 'రాజన్న' సినిమా చూశాడు. సినిమా ఎలా ఉంది అని ఆయనను అడిగితే.. తెలుగులో ముందు వరుసలో ఉన్న డైరక్టర్లతో సమానంగా తీశారు అన్నాడు. మళ్లీ అదే వ్యక్తి 'శ్రీవల్లీ' చూశాడు. ఎలా ఉందని అడిగితే.. 'మీకు డైరక్షన్ రాదు' అని చెప్పారు.
ఆలీ: ఆయన ఇండస్ట్రీకి చెందిన వారేనా?
విజయేంద్రప్రసాద్:అవును, పెద్ద డైరక్టర్.. మా అబ్బాయి రాజమౌళి(నవ్వులు)
ఆలీ: సాధారణంగా స్క్రిప్టు రైటర్లు కథ రాయాలంటే గోవాకో.. థాయ్‌ల్యాండ్‌కో వెళుతుంటారు. కొంతమంది చెట్టు కింద కూర్చొని రాస్తారు. మరి మీరు ఎలా రాస్తారు?
విజయేంద్రప్రసాద్:నాలుగు గోడల మధ్య కూర్చొని రాస్తా. పేరుకు పెద్ద రచయిత అంటారు గానీ.. ఇంతవరకూ ఎవరూ ఎక్కడికీ తీసుకెళ్లలేదు(మళ్లీ నవ్వులు)
ఆలీ: మీ కథలో హీరోకు ఒక గతం ఉంటుంది. అది మీ సెంటిమెంటా..?లేకపోతే యాధృచ్ఛికంగా జరుగుతుందా?