తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ అనుబంధాల కొనసాగింపే 'యమలీల..ఆ తరువాత' - ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల

వెండితెరపై ఓ కథకు శుభం కార్డు పడింది. పాతికేళ్ల తర్వాత ఆ కథ పునఃప్రారంభమైంది.. అదే 'యమలీల.. ఆ తరువాత'. ఈ నెల 21(సోమవారం) నుంచి 'ఈటీవీ'లో రాత్రి 8గంటలకు ప్రేక్షకుల్ని అలరించబోతోంది.

New daily serial 'Yamaleela.. Aa Tarvata' to premiere from september 21 on ETV
ఆ అనుబంధాల కొనసాగింపే 'యమలీల..ఆ తరువాత'

By

Published : Sep 20, 2020, 7:32 AM IST

'వేశా.. మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా.. నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా..' ఇలా పాతికేళ్ల కిందట తల్లీకొడుకుల అనుబంధాన్ని ఒక అందమైన కథలో గొప్పగా ఆవిష్కరించిన చిత్రం 'యమలీల'. ఆ చిత్రానికి కొనసాగింపుగా 'యమలీల.. ఆ తరువాత' ధారావాహిక రూపొందింది. సినిమాలో తల్లీకొడుకులుగా నటించిన అలీ, మంజు భార్గవి ఇందులోనూ అదే పాత్రల్ని పోషించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. సురేశ్​ దర్శకుడు. ఈ సందర్భంగా అలీ, మంజు భార్గవి చెప్పిన ప్రత్యేక విశేషాలివి..

నమ్మబుద్ధి కావడం లేదు

"మా 'యమలీల' విడుదలై 25 యేళ్లు అయ్యిందంటే నమ్మబుద్ధి కాలేదు. నాలుగైదేళ్ల కిందటే ఆ సినిమా చేసినట్టుగా ఉంటుంది. సరిగ్గా పాతికేళ్ల మైలురాయి అందుకోగానే అప్పుడే 'ఈటీవీ' బృందం ఈ ధారావాహిక ఆలోచనతో నన్ను సంప్రదించింది. 'యమలీల.. ఆ తరువాత' అంటూ కథ చెప్పగానే కనెక్ట్‌ అయిపోయా. బుల్లితెర కోసమే అయినా పెద్ద తెర కోసం చేసినట్టుగానే చిత్రీకరణ జరిగింది. అప్పట్లో అనుకోకుండానే నాకు 'యమలీల'లో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు ఎలాంటి అనుభూతికి గురవుతూ నటించానో, 'యమలీల.. ఆ తరువాత' చేస్తున్నప్పుడూ అంతే! నేను ధారావాహికలో నటించడం ఇదే తొలిసారి. కుటుంబం మొత్తాన్ని థియేటర్‌కి తీసుకొచ్చిన చిత్రం 'యమలీల'. ఇప్పుడు బుల్లితెర ద్వారా వాళ్లందరికీ ఈ కథా చేరువ కానుంది" అని అలీ అన్నారు.

సినిమాతో పోలిస్తే టెలివిజన్‌ కోసం నటించడం చాలా కష్టం. సినిమాకు స్క్రిప్టు ముందే ఇచ్చేస్తారు. మనం సిద్ధమై సెట్‌కి వెళ్లి నటించాలి. టెలివిజన్‌ విషయంలో భావోద్వేగాలు, టైమింగ్‌ మీద వెళ్లిపోవాలి. ఒక పక్క చిత్రీకరణ, మరోపక్క డబ్బింగ్‌ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాణం ఓ కొత్త అనుభవం. 21 ఏళ్ల టీవీ ప్రయాణం నాది. ఈటీవీతోనే 15 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నా. నేను చేసిన తొలి షో 'డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌'తో చాలా మంది డ్యాన్స్‌ మాస్టర్లు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 'అలీ 369', 'అలీతో జాలీగా', 'అలీతో సరదాగా', 'అలీ టాకీస్‌'... ఇలా చాలా ప్రదర్శనల్ని నిర్వహించా" అని ఈటీవీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అలీ.

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

'యమలీల... ఆ తరువాత'కు ముందు ఎన్నో సీరియల్స్​లో నటించినా తన సినీప్రయాణంలో ఇదే ప్రత్యేకమని అంటున్నారు నటి మంజు భార్గవి. దీని గురించి ఆమె మాటల్లో.. "నేనెన్ని ధారావాహికల్లో నటించినా.. వాటిలో ఇదే ప్రత్యేకం. ఇది మేం చేసిన కథే. 25 యేళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ ధారావాహికలో అదే నటులే భాగం కావడం అరుదైన విషయం. కథ రీత్యా 'యమలీల' ఒకెత్తైతే, ఈ ధారావాహిక మరో ఎత్తు. 'యమలీల' చేసేటప్పుడు నా పాత్ర, కథ గురించి చెప్పి ఎస్వీ కృష్ణారెడ్డి 'ఇది మీరే చేయాలి, మరొకర్ని ఊహించలేను' అని చెప్పారు. అప్పట్లో నేను ఎక్కువ సినిమాలు చేసేదాన్ని కాదు. ఎస్వీ కృష్ణారెడ్డి అలా చెప్పడం వల్ల అందులో నటించేందుకు ఒప్పుకొన్నా. దీనికి ఏమాత్రం తగ్గని విధంగా ఈ ధారావాహిక రూపొందింది. మానవ అనుబంధాలే ప్రధానంగా సాగుతుంది. 'శంకరాభరణం', 'యమలీల' చేస్తున్నప్పుడు నటిగా ఎలాంటి అనుభూతి చెందానో, ఈ ధారావాహికలో నటిస్తున్నప్పుడూ అంతే. కొన్ని కథలు, పాత్రలు నటుల్ని అప్రయత్నంగా వాటిలో లీనమయ్యేలా చేస్తాయి. 'యమలీల.. ఆ తరువాత' చేస్తున్నప్పుడు భావోద్వేగాలు పండించాల్సిన సన్నివేశాల్లో గ్లిజరిన్‌ లేకుండానే కన్నీళ్లు కార్చేదాన్ని" అని తెలిపారు.

"ఎక్కువగా సినిమాలు, ధారావాహికలు చేయకపోవడానికి కారణం నాకు ఆసక్తి లేకపోవడమే. చిన్నప్పట్నుంచి మా అమ్మ నన్ను నటన వైపు ప్రోత్సహించారు. నాకు మాత్రం డ్యాన్స్‌పైనే దృష్టి ఉండేది. అమ్మ ప్రోద్బలంతోనే నేను గొప్ప చిత్రాల్లో నటించాను కదా అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి మరో కారణం ఏంటంటే... నేను ముక్కు సూటి మనిషిని. అలా ఉంటే పరిశ్రమలో పనికి రారు. నా డ్యాన్స్‌, నా ప్రదర్శనలు, నా విద్యార్థులు, నా తరగతులు... ఇదే నా ప్రపంచం ప్రస్తుతం. బెంగళూరులో మా ఇంటి పరిసరాల్లో ఉన్నవాళ్లకు కూడా నేను అక్కడ ఉన్నట్టు తెలియదు" అని మంజు భార్గవి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details