'మర్యాద రామన్న' చిత్రం నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది. కానీ, అదే నాకు మైనస్ అయింది' అని నటుడు నాగినీడు అన్నారు. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు వెల్లడించారు. అలీ అడిగిన ప్రశ్నలకు కొంటె సమాధానాలు చెప్తూ అలరించారు.
'నాగినీడు.. ముందు ఏంటి? వెనక ఏంటి?' అని ఆలీ అడగ్గా '1760 అనుకుంటా. నేను మచిలీపట్నం నుంచి తిరిగొస్తుంటే కలవపాముల గ్రామంలో నన్ను ఆపి ఈ ఊరు శిథిలమైపోయిందని, బాగు చేయాలని నన్ను అడిగితే అక్కడ సెటిల్ అయిపోయా. కొంతకాలం తర్వాత వెళ్లిపోయా. మళ్లీ వచ్చా. మళ్లీ వెళ్లిపోయా, వచ్చా' అంటూ ఆలీని కన్ఫ్యూజ్ చేశారు. 'మీకు ఎంతమంది పిల్లలు' అనే ప్రశ్నకు 'నాకు రెండు మైనస్‌లు (కొడుకులు)' అని చమత్కరించారు.
'నా జీవితం ప్రసాద్ ల్యాబ్స్‌కు అంకితమైంది. నేను థియేటర్‌లో చూసిన తొలి చిత్రం 'పూల రంగడు' (అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కింది). చూసిన వెంటనే నటుడవ్వాలనే కోరిక కలిగింది. అదే సమయంలో రాజబాబుగారిని ఇమిటేట్ చేసేవాడ్ని. నేను నటించిన 'మర్యాద రామన్న' చిత్రం నన్ను ఓ స్థాయికి తీసుకెళ్లింది. కానీ, అదే మైనస్ అయింది. అవకాశం కోసం ఏ దర్శకుడినైనా సంప్రదిస్తే 'నాగినీడుగారు.. మీరు మాత్రమే న్యాయం చేయగలరు అనే పాత్ర ఉంటే మీకు ఇస్తాం. మా సినిమాలో అలాంటి క్యారెక్టర్ లేదు. మిమ్మల్ని సాధారణ పాత్రల్లో ఊహించుకోలేం కదా' అనేవారు. ఇవన్నీ ఎందుకు నాకు డబ్బొస్తే చాలు అని మనుసులో అనుకునేవాడ్ని' అని తన సినీ కెరీర్ గురించి చెప్పారు.