ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లలో సినిమా టికెట్లను ఇకపై ఆ రాష్ట్ర ప్రభుత్వమే విక్రయించనుంది. సింగిల్ థియేటర్లలోనైనా, మల్టీప్లెక్స్‌లలో అయినా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు వెబ్ పోర్టల్ రూపొందించనుంది. రైల్వే ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ తరహాలో ఇది ఉంటుంది. ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దీన్ని నిర్వహించనుంది. ఆ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మనుంది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా టికెట్ల ధరలు అధికంగా ఉన్నాయని భావిస్తే నియంత్రణ చర్యలు చేపట్టాలే తప్ప ప్రభుత్వమే టికెట్లు విక్రయిస్తాననటం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Movie tickets: ప్రభుత్వం కీలక నిర్ణయం... సినిమా టికెట్ల కోసం ప్రత్యేక పోర్టల్! - andhra pradesh government
ఒకప్పుడు సినిమా చూడాలంటే టికెట్ కోసం క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. టికెట్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్/యాప్‌లు వచ్చిన తర్వాత ప్రేక్షకుడికి ఉపశమనం లభించింది. ఇప్పుడు సినిమా టికెట్ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. టికెట్ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మేందుకు వీలుగా ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ అభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ రూపకల్పన, దాని అమలుకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి దీనికి సహ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యదర్శి, ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ప్రతినిధి, ఏపీటీఎస్ ఎండీ, కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త కలెక్టర్లు (రెవెన్యూ) సభ్యులుగా ఉంటారు. ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆగస్టు 31న ఉత్తర్వులు జారీ చేశారు. అవి బుధవారం వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ల విక్రయాల విధానాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ వెబ్‌పోర్టల్ అభివృద్ధికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
TAGGED:
cinema