కెప్టెన్ ఎంపికలో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లో కొన్నిరోజుల నుంచి బీబీ హోటల్ టాస్క్ నడుస్తోంది. సీక్రెట్ టాస్క్‌లో విజయం సాధించడం కోసం కాజల్ డబ్బులను రవి దొంగిలించాడు. కాజల్(bigg boss kajal) డబ్బులు కనిపించకపోవడంపై ఇంటిసభ్యుల మధ్య చర్చ జరిగింది. రూమ్ సర్వీస్ బాయ్ రవినే తన డబ్బులు దొంగిలించి ఉంటాడని కాజల్ చెప్పింది.
ఆమె మాటలతో హోటల్ మేనేజర్ అనీ మాస్టర్ ఏకీభవించలేదు. దీంతో తన డబ్బులు వెనక్కి వచ్చేవరకూ ఒక్క రూపాయి కూడా టిప్పు ఇవ్వనని కాజల్ తేల్చిచెప్పింది. డబ్బులు చెల్లించకపోతే ఎలాంటి సేవలు అందించమని రవి గట్టిగా చెప్పేశాడు. కాగా, ఎంత సర్వీసు చేస్తున్నా ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదని అనీ మాస్టర్ వాపోయింది. "నువ్వు కాజల్ డబ్బులు దొంగిలించడం నేను గమనించాను" అని రవితో షణ్ముఖ్ చెప్పాడు. దీంతో రవి.. అలాంటిది ఏమీ లేదని సమాధానమిచ్చాడు.
ఇప్పుడు సన్నీ టైమ్ వచ్చింది..!
ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా సన్నీని అనీ మాస్టర్ జైలులో వేసిన సంగతి తెలిసిందే. "మాకూ టైం వస్తుంది మాస్టర్" అని సన్నీ ఆరోజు అనీ మాస్టర్‌తో సవాలు విసిరాడు. అన్నట్లుగానే ఇప్పుడు సన్నీ.. అనీ మాస్టర్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. మొదటిసారి ఫైవ్‌స్టార్ హోటల్‌కు వచ్చిన అతిథిగా సన్నీ.. హోటల్ మేనేజర్‌గా ఉన్న అనీ మాస్టర్‌కు చుక్కలు చూపించాడు. సన్నీకి కావాల్సిన అన్ని సేవలు చేసి.. టిప్పు ఇవ్వండి అంటూ అనీ మాస్టర్ బతిమిలాడుకుంది. అలాగే, సిరి డాన్ కుమార్తె పాత్రలో జీవించింది. షణ్ముఖ్(bigg boss shanu) చేత ఎక్కువ సేవలు చేయించుకుంది.
"ఈ టాస్క్ తర్వాత నీ పరిస్థితి ఏంటో చూసుకో" అని షణ్ముఖ్ అనగా.. "నువ్వు నన్ను ఏం చేయలేవ్" అని కౌంటర్ ఇచ్చింది సిరి. కాజల్ డబ్బులు రవి కొట్టేయడం వల్ల.. ఎలాగైనా డబ్బులు దక్కించుకోవాలనుకున్న కాజల్.. అనీ మాస్టర్ సొమ్ము కాజేసింది. ఈ క్రమంలోనే కాజల్ తాగే నీటిలో రవి కారం కలిపాడు. అతను కావాలనే అలా చేశాడని కాజల్ పసిగట్టింది. దీంతో రవికి సీక్రెట్ ఇచ్చారన్న విషయం షణ్ముఖ్, కాజల్ కనిపెట్టేశారు.