దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఆమె ఓ స్వర శిఖరం. సంగీత ప్రియుల హృదయాలలో ఆమె పాటలు కలకాలం పదిలం. పాడే పాట ఏదైనా, పలికే భావం ఏదైనా సుస్పష్టమైన ఉచ్ఛారణతో, అత్యద్భుతమైన గాత్ర నైపుణ్యంతో అనేక భాషల్లో 20వేలకు పైగా పాటలపై తన గాత్ర సంతకాన్ని చేశారు. ఆమే లివింగ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ఆఫ్ పద్మభూషణ్ కె.ఎస్.చిత్ర. అలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.
ఎలా ఉన్నారమ్మా.. ఇప్పటివరకూ 25వేల పాటలకు పైగా పాడినందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు!
చిత్ర:చాలా బాగున్నానండీ. ఈ షోకు వస్తే మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారా? అని కాస్త భయంగా ఉంది. ఇక నేను ఇప్పటివరకూ.. 25వేలు అంటే కొంచెం పెద్ద సంఖ్య, 20వేలకు పైగా పాటలు పాడా. నా కెరీర్ మలయాళంలో మొదలైంది. ఆ తర్వాత భారతీయ భాషల్లో చాలావరకు పాడాను. లాటిన్, అరబిక్ భాషల్లో కూడా ఒకట్రెండు గీతాలు ఆలపించా. (మధ్యలో ఆలీ అందుకుని, రూ.100 నోటుపై పలు భారతీయ భాషలు ఉంటాయి. వాటి కన్నా ఎక్కువే పాడేశారు) అరబిక్‌లో చిన్న లైన్ మాత్రమే పాడా.
మీ కుటుంబ సభ్యులు ఎంతమంది?
చిత్ర:నా తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లే. ఇంట్లో కాస్త కఠినంగానే ఉండేవాళ్లు. నాకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. త్రివేండ్రంలో ఉంటారు. తమ్ముడు నైజీరియాలో పనిచేస్తున్నాడు.
మీ తల్లిదండ్రులు టీచర్లు. మరి సింగర్ అవ్వాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది?
చిత్ర:నేను మ్యూజిక్ మెయిన్‌గా తీసుకుని చదువుతున్నప్పుడు నేను కూడా టీచర్ అవ్వాలని అనుకున్నా. అందుకు నా తల్లిదండ్రులే స్ఫూర్తి. నాతో పాటు మ్యూజిక్ నేర్చుకుంటూ చదువుకున్న చాలా మంది మ్యూజిక్ కాలేజీలలో లెక్చరర్లుగా ఉన్నారు. నేను కూడా అలాగే ఒక పోస్టులో ఉంటానని అనుకున్నా. కానీ, మన తలరాత ఇక్కడకు రావాలని ఉంది. మా గురువుగారు కె.ఓమన్‌కుట్టి, వాళ్ల బద్రర్ ఎంజీ రాధాకృష్ణ కేరళలో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్. వాళ్లే నన్ను గాయనిగా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అంతవరకూ రికార్డింగ్స్ అన్నీ చెన్నైలో జరిగేవి. ఆ సమయంలో 'చిత్రాంజలి' అనే స్టూడియోను కేరళలో నిర్మించారు. అక్కడ రికార్డింగ్ చేద్దామని స్థానికంగా ఉన్న సింగర్స్‌ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. అది కూడా చాలామంది సింగర్స్‌తో కలిసి పాడా. ఆ తర్వాత జేసుదాసు గారితో పాటలు పాడటం వల్ల నా సినీ ప్రయాణం నెమ్మదిగా మొదలైంది. అప్పటి నుంచి సంగీత దర్శకులు నన్ను పిలవటం మొదలుపెట్టారు.
ఐదేళ్ల వయసులోనే మీ తమ్ముడికి మీరు జోల పాట పాడితే, ఒక సంగీత విద్వాంసుడు మిమ్మల్ని మెచ్చుకున్నారట!
చిత్ర:అయ్యో(నవ్వులు) ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు. నేను పాడిన పాట విని మా గురువుగారు ఓమన్‌కుట్టి మెచ్చుకున్నారు. మా ఇంటికి దగ్గరలో ఒక ఆలయం ఉంది. అక్కడ సంగీత కచేరి పెడితే ఓమన్‌కుట్టి గారు, రాధాకృష్ణ గారికి మా ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చారు. అప్పుడు మా తమ్ముడి కోసం పాడిన పాట విని మెచ్చుకున్నారు. ఎప్పటికైనా ఈ పాపకు నేనే సంగీతం నేర్పిస్తానని అన్నారట.
కె.ఎస్.చిత్ర అంటే పూర్తి పేరు ఏంటి?
చిత్ర:కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. కేరళలో నాన్న పేరుతో కలిపి పెట్టుకుంటారు. చిన్నప్పుడు నాన్న మాతో చాలా సరదాగా ఉండేవారు. అమ్మ మాత్రం కాస్త కఠినంగానే ఉండేవారు. ఆమె కూడా చాలా బాగా పాడతారు. అయితే, కేవలం ఇంట్లోనే పాడేవారు.
మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?
చిత్ర:పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే.. తెలిసిన వాళ్లు. నా భర్త విజయ శంకర్ సోదరి, నేనూ స్కూల్లో స్నేహితులం. ఆమె మంచి డ్యాన్సర్. స్కూల్లో పోటీలు జరిగితే రెండు కుటుంబాలు కలుస్తుండేవి. అలా పెళ్లి ప్రపోజల్ వచ్చింది. ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పని చేసేవారు. ఆ తర్వాత నాకోసం చెన్నై వచ్చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు, కన్నడ బెంగళూరుకు వెళ్లిపోవడం వల్ల అటూ ఇటూ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది.
ఈ మధ్యకాలంలో మీరు తెలుగు రాయటం, చదవటం నేర్చుకుంటున్నారట!
చిత్ర:ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నా. అసలు నాకు తెలుగు అక్షరాలు రాసి ఇచ్చింది బాలుగారు. ఇద్దరం కలిసి పాడేటప్పుడు చాలా సందేహాలకు సమాధానాలు చెప్పేవారు. ఆయనతో కలిసి పాడటం వల్లే నాకు తెలుగు వచ్చింది. నా కెరీర్ ఇంత గొప్పగా ఉండటానికి కారణమైన వాళ్లలో బాలుగారు, జేసుదాసుగారి పాత్ర ఎంతో ఉంది. ఆయన్ను దాసన్న అని పిలుస్తా. కేరళలో ఆయనకు తరంగణి అనే స్టూడియో ఉంది. అందులో సింగర్స్ బ్యాంకు ఉంది. కొత్త గాయనీ గాయకుల వాయిస్ రికార్డు చేసి పెడతారు. ఎవరైనా వచ్చి 'కొత్త సింగర్స్ కావాలి' అని అడిగితే, అప్పటికే రికార్డు చేసి ఉంచిన వాళ్ల పాటలు ప్లే చేసి వినిపిస్తారు.
'సింధు భైరవి'లో ఒక పాట పాడమని ఇళయరాజా అడిగితే పాడను అన్నారట నిజమేనా?
చిత్ర:అలా అనలేదండీ. 'నానురు సింధు' అనే పాట కోసం నన్ను పిలిచారు. ఆ పాట పాడాను కూడా. అది అయిపోయిన తర్వాత నేను త్రివేండ్రం వెళ్లిపోవాలి. ఎందుకంటే మరుసటి రోజు నాకు ఎం.ఎ మొదటి సంవత్సరం పరీక్షలు ఉన్నాయి. అయితే, రాజా సర్ వచ్చి, 'ఇంకొక పాట ఉంది పాడతారా' అని అడిగారు. పాటలకన్నా చదువు ముఖ్యమని మా అమ్మ చెప్పేవారు. దీంతో ఆయనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. 'ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అడుగుతున్నారు. పరీక్షలు తర్వాత రాయొచ్చులే' అని నాన్న చెప్పారు. దీంతో ఆ పాట పాడా. సినిమా విడుదలై మంచి పేరు వచ్చింది. జాతీయ అవార్డు కూడా తెచ్చి పెట్టింది. అసలు ఆ పాట సీనియర్ సింగర్స్ పాడాల్సింది. కానీ, రాజా సర్ నాకు అవకాశం ఇచ్చారు. తెలుగులో ఈ పాట పాడినప్పుడు నేను తప్పుగా పాడితే బాలుగారు సరిచేసేవారు.
ఇళయరాజా మీకు త్యాగరాజస్వామి ఫొటో ఇచ్చారట. దాని వెనుక కథ ఏంటి?
చిత్ర:మిగతవాళ్ల రికార్డింగ్స్ ఉంటే ముందే చెబుతారు. ఆ రోజు మలయాళ సంగీత దర్శకుడు శ్యామ్‌సర్ సినిమాకు నేను పాడాలి. నెల ముందే నా కాల్షీట్ తీసుకున్నారు. రాజాగారి సినిమాలకు మాత్రం రికార్డింగ్ రోజునే పిలుస్తారు. ఆ రోజు ఎవరు పాడతారన్న విషయాన్ని నిర్ణయిస్తారు. సడెన్‌గా రాజాసర్ మేనేజర్ పాట పాడాలని చెప్పారు. 'ఇంతకుముందే మరో పాట పాడటానికి ఒప్పుకొన్నా' అని ఆయనకు చెప్పాను. 'ఇదే విషయాన్ని రాజాసర్‌కు చెప్పండి' అని ఆయన అన్నారు. వెళ్లి జరిగింది చెప్పాను. 'సర్ ఆ పాట ఉదయం 11.30 గం.లకు అయిపోతుంది. మధ్యాహ్నం వచ్చేస్తా' అని రాజాసర్‌కు చెప్పాను. అయితే, అక్కడకు వెళ్లిన తర్వాత పాట మొదలు పెట్టగానే కరెంట్ పోయింది. సంగీతకళాకారులంతా బయటకు వచ్చేశారు. పాట పూర్తయ్యే సరికి 12.30 దాటిపోయింది. పైగా ఆరోజు బాలుసర్ రికార్డింగ్‌కు ముందే వచ్చేశారు. నా కోసం ఆయన వేచి చూస్తున్నారు. అప్పటికే రెండు, మూడుసార్లు అడిగారట. నేను రాగానే 'బాలుగారి లాంటి పెద్ద వ్యక్తి మీకోసం వేచి చూశారు. ఇది ఏమైనా బాగుందా..' అంటూ అనే సరికి నాకు కన్నీళ్లు ఆగలేదు. 'కోకిలా కోకో కోకిలా..' అంటూ సాగే ఆ పాటలో బాలుగారు ఏవో పదాలు చెబితే నేను నవ్వాలి. కానీ, రాజాసర్ అన్న మాట గుర్తుకు వచ్చి, నాకు ఏడుపు వచ్చేసింది. దాంతో పాడటం ఇంకొంత ఆలస్యమైంది. రికార్డింగ్ అయిన తర్వాత రాజాసర్ నా దగ్గరకు వచ్చి, 'ఇప్పటివరకూ నువ్వు ఏడవటం నేను చూడలేదు. ఇక నుంచి ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోవద్దు' అని ఆయన గదిలో ఉన్న త్యాగరాజస్వామి ఫొటో నాకు ఇచ్చారు. అదే నాకు పెద్ద దీవెన. అది నా పూజగదిలో ఉంది.
ఇదీ చదవండి:పిల్లల కోసమే అక్కడికి వెళ్తా..!
తెలుగు ప్రజలకు మీ పాటలంటే ఎంతో ఇష్టం. మరి మీకు ఎవరి పాటలంటే ఇష్టం?
చిత్ర:సుశీల, జానకిగార్ల పాటలంటే నాకు ప్రాణం. వాళ్ల పాటలు వినే నేను పెరిగా. వాళ్ల ప్రభావం నాపై ఎంతో ఉంది. అప్పుడప్పుడు వాళ్లిద్దరినీ అనుకరించడానికి ప్రయత్నిస్తుంటా.. కానీ నాకు రావడం లేదు. జానకిగారు నాకు అమ్మలాంటి వారు. చాలా క్లోజ్‌గా ఉంటారు. ఎక్కువ పాటలు వాణీ జయరామ్‌గారితో పాడా!
ఒకే రోజు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లతో పాటలు పాడాలంటే ఎలా మేనేజ్ చేసేవారు?
చిత్ర:నాకంటే బాలుగారు ఎక్కువ కష్టపడేవారు. ఆలస్యమవుతుందని తెలిస్తే ముందే ట్రాక్స్ తీస్తారు. కొందరు వేచి చూస్తారు. అప్పుడప్పుడు చాలా టెన్షన్ పడాల్సి వచ్చేది. ఒక్కోరోజు భోజనం చేసేందుకు సమయం కూడా ఉండేది కాదు. ఇక సంగీత దర్శకుల్లో.. చెప్పింది చెప్పినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టే వ్యక్తుల్లో ఇళయరాజా సర్ ఉంటారు. ఆయన చెప్పింది పాడితే సంతోషపడతారు. ఏఆర్ రెహమాన్ అందుకు పూర్తి భిన్నం. ఆయన చెప్పింది.. మనం ఇంకాస్త డెవలప్ చేసి పాడతానంటే ఓకే అంటారు. కీరవాణిగారు కూడా ఆయనకు కావాల్సినట్టే పాడమంటారు. అయితే, పాటను పూర్తిగా అర్థమయ్యేలా చెబుతారు. ఎక్కడ ఏ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలో వివరిస్తారు.
సాధారణంగా కొత్తవాళ్లు పాడటానికి కాస్త భయపడతారు. సీనియర్లు త్వరగా పాడేస్తారు. కానీ, 'తెలుసా.. మనసా' పాట కోసం నాలుగు రోజులు ప్రాక్టీస్ చేశారట!
చిత్ర:కీరవాణిగారు నాకు ఒక ట్రాక్ వినిపించారు. అందులో సింగర్ పాడిన వాయిస్‌లాగానే మీరు కూడా పాడాలి అని సూచించారు. అప్పటి వరకూ నేను ఎప్పుడూ ప్రయత్నించని స్టైల్ అది. ఆ పాటకు బాగా పేరొచ్చింది.