తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నాలుగు గంటలు నిలబడ్డా.. కానీ వెళ్లిపోమన్నారు!'

Alitho saradaga episode: 'ఆలీతో సరదాగా' తాజా ఎపిసోడ్​లో హీరోయిన్ కృతిశెట్టి, దర్శకుడు కల్యాణ్​కృష్ణ సందడి చేశారు. పలు సరదా సంగతుల్ని వెల్లడించారు.

krithi shetty kalyan krishna
కల్యాణ్​కృష్ణ-కృతిశెట్టి

By

Published : Jan 19, 2022, 12:10 PM IST

Krithi shetty ali tho saradaga: కల్యాణ్ కృష్ణ.. మన్మథుడు (నాగార్జున)కు నేటివ్‌ టచ్‌ ఇచ్చి సోగ్గాడిగా మార్చిన క్రేజీ డైరెక్టర్‌. కృతి శెట్టి.. 'ఉప్పెన'తో సునామీలాంటి సూపర్‌హిట్‌ అందుకొని కెరీర్‌లో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్న బబ్లీ హీరోయిన్‌. వీరిద్దరూ కలిసి ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చేశారు. మరి కల్యాణ్‌ కృష్ణ.. కృతి శెట్టి చెప్పిన ఆ సరదా సంగతులేంటో తెలుసుకుందామా..!

మీది పొలిటికల్‌ ఫ్యామిలీ కదా.. సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాలనిపించింది?

కల్యాణ్‌ కృష్ణ: నేనే ముందుగా సినిమాల్లోకి వచ్చాను. ఆ తర్వాత అన్న (కురసాల కన్నబాబు) రాజకీయాల్లోకి వెళ్లారు. చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూసినప్పుడు నటుడిని అవ్వాలనుకున్నాను. కాలేజ్‌కు వచ్చేసరికి నటుడు కాదు.. దర్శకుడిని అవ్వాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో చెబితే చదువు పూర్తి చేశాక వెళ్లమన్నారు. దీంతో పీజీ చేసి సినిమాల్లోకి వచ్చాను.

దర్శకుల్లో మీకు స్ఫూర్తి ఎవరు?

కల్యాణ్‌ కృష్ణ: కృష్ణవంశీ గారి సినిమాలంటే చాలా ఇష్టం. 'గులాబీ', 'నిన్నే పెళ్లాడతా', 'సింధూరం' చాలా ఇష్టం. ఈవీవీ సత్యనారాయణ, మణిరత్నం గారి సినిమాలన్నా ఇష్టమే.

డైరెక్టర్ కల్యాణ్​కృష్ణ

మొదటిసారే.. పెద్ద హీరో(నాగార్జున)తో అవకాశం ఎలా వచ్చింది?

కల్యాణ్‌ కృష్ణ: అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొన్నాళ్లు పనిచేశా. మొదట నాగార్జున గారికి 25, 35, 45 ఏళ్ల వయసున్న మూడు పాత్రలతో కూడిన ఓ కథ చెప్పాను. అది ఆయనకు బాగా నచ్చింది. మూడు పాత్రల్లో రెండు తను, 25 ఏళ్ల వయసు పాత్రలో నాగ చైతన్య చేస్తే బాగుంటుందని అనుకున్నాం. అదే సమయంలో 'సోగ్గాడే చిన్ని నాయనా' కథకు చర్చలు జరుగుతున్నాయి. దానికి మొదట నేను దర్శకుడిని కాదు.. ఆ కథ బేసిక్‌ లైన్‌ 'అష్టా చమ్మా', 'ఉయ్యాల జంపాల' సినిమాల నిర్మాత రామ్మోహన్‌ రావు గారిది. ఆ సినిమా కోసం చాలా మంది దర్శకులు పని చేశారు. కానీ వర్కవుట్‌ కాలేదు. రామ్మోహన్‌రావుతో నాకు పరిచయం ఏర్పడటంతో ఆ కథకు నన్ను దర్శకుడిగా ఎంపిక చేశారు. నాగార్జున గారు అనుమతి ఇవ్వడంతో స్క్రిప్టు మొత్తం నేనే సిద్ధం చేసి ఆయనకు చెప్పా. కథ నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది.

ఏ ఊరి మీది?

కృతి శెట్టి: కర్ణాటకలోని ఉడిపి పక్కన ఓ గ్రామం. కానీ, ముంబయిలో పుట్టి పెరిగాను.

'ఉప్పెన' అవకాశం ఎలా వచ్చింది?

కృతి శెట్టి: నేను చాలా ఇంట్రావర్ట్‌. సినీరంగంలో ఇలా ఉంటే కుదరదని నా తల్లిదండ్రులు యాక్టింగ్‌ స్కూల్‌లో చేర్పించారు. ఆ తర్వాత ప్రకటనల్లో నటించడం ప్రారంభించా. ఆ సెట్‌ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. ఓ ప్రకటన షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు నన్ను ఒకరు సినిమాకు రిఫర్‌ చేశారు. కథ వినగానే ఓకే చెప్పేశా. ఇక్కడి ప్రజల ప్రేమాభిమానం చూసి ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నా.

తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు?

కృతి శెట్టి: మొదట్లో నాకు తెలుగు రాదు. 'ఉప్పెన' షూటింగ్‌ సమయంలో చిత్రయూనిట్‌లో అందరూ తెలుగులో మాట్లాడేవారు. నేను తెలుగమ్మాయిని అనుకొని కొంతమంది నా దగ్గరకొచ్చి తెలుగులో మాట్లాడేవాళ్లు. ఎంతో అభిమానంతో మాట్లాడుతున్న వాళ్లను చూసి నేనూ తెలుగు నేర్చుకోవాలనుకున్నా. తెలుగు సినిమా చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించా.

ఉప్పెన సినిమాలో కృతిశెట్టి

రెండో సినిమా నానితో ‘శ్యామ్‌ సింగరాయ్‌’, మూడో సినిమా ‘బంగార్రాజు’. నాగచైతన్యతో నటించడం ఎలా ఉంది?

కృతి శెట్టి: డిసెంబర్‌లో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ విడుదలైంది. ఈ నెలలో ‘బంగార్రాజు’ విడుదల.. చాలా సంతోషంగా ఉంది. నాగచైతన్యతో నటించడం చాలా బాగుంది. బయటి వ్యక్తులు నన్ను చూసి సైలెంట్‌గా ఉంటాను అనుకుంటారు. కానీ, కల్యాణ్‌ కృష్ణ గారి దగ్గర చాలా అల్లరి చేశా. ఇంట్లో చాలా బబ్లీగా ఉంటాను. సెట్‌లోనూ అంతే కంఫర్ట్‌గా చూసుకున్నారు.

‘ఉప్పెన’ హిట్‌ అయిన తర్వాత టాలీవుడ్‌లో ఓ పెద్ద హీరో మీకు గిఫ్ట్‌తోపాటు ఒక లేఖ పంపించారట. ఎవరు?

కృతి శెట్టి: చిరంజీవి గారు. 'ఉప్పెన' ప్రీ-రిలీజ్‌లో నా గురించి ఆయన మాట్లాడారు. అదే నాకు పెద్ద గిఫ్ట్‌లా అనిపించింది. మళ్లీ ఆయనే స్వయంగా లేఖ రాసి, గిప్ట్‌ పంపించడం చాలా గొప్ప విషయం.

‘బంగార్రాజు’ ఎలా వచ్చింది?

కల్యాణ్‌ కృష్ణ: ‘సోగ్గాడే చిన్ని నాయన’ కంటే నెక్ట్స్‌ లెవల్‌లో ఈ సినిమా ఉంటుంది. సినిమా షూటింగ్‌ ఎప్పుడు పూర్తి చేసినా సంక్రాంతి పండగకే విడుదల చేయాలని ముందే నిర్ణయించుకున్నాం. ఇది సంక్రాంతి సినిమా.. సంక్రాంతికే తీసుకురావాలనుకున్నాం. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ఇది సీక్వెల్‌. నాగచైనత్య, కృతి శెట్టి, మరో రెండు మూడు పాత్రలు కొత్తగా వస్తాయి.

బంగార్రాజు మూవీ

‘నేల టికెట్టు’ ఎందుకు నిరాశపర్చింది?

కల్యాణ్‌ కృష్ణ: చేయాల్సిన దాని కంటే ఎక్కువ వేగంగా చేశాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌, కరెక్షన్‌ చేసుకునే సమయం దొరకలేదు. నాకిష్టమైన కథ. చాలా మంది బాగుందనే చెప్పారు. రిలీజ్‌ డేట్‌ పెట్టుకొని పరుగులు పెట్టాం. ‘చుట్టు జనం.. మధ్యలో మనం’ అనేది సినిమా బేసిక్‌ లైన్‌. దాన్నే నేను సరిగ్గా చూపించలేకపోయా. అందుకే మిస్‌ఫైర్‌ అయింది.

‘నేల టికెట్టు’ తర్వాత ఎందుకు గ్యాప్‌ తీసుకున్నారు?

కల్యాణ్‌ కృష్ణ: కొంతకాలం స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నా. ఆ తర్వాత మా రెండో అన్నయ్య కన్నుమూయడంతో కొన్నాళ్లు కుటుంబానికి సమయం కేటాయించా. కొవిడ్‌ వల్ల ఇంకొంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు బంగార్రాజు చేశా. ఒక్క కట్‌ కూడా లేకుండా సెన్సార్‌ పూర్తయింది.

‘బంగార్రాజు’లో మీ పాత్ర ఏంటి?

కృతి శెట్టి: ఇందులో నేను సర్పంచ్‌ నాగలక్ష్మిగా నటించాను. మంచిగా ఉంటేనే సర్పంచ్‌ నాగలక్ష్మి, తేడాలొస్తే సింహం నాగలక్ష్మి అయిపోతా.

‘ఉప్పెన’ పెద్ద హిట్‌ కదా.. ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో రెండో హీరోయిన్‌గా ఎందుకు చేశావ్‌?

కృతి శెట్టి: రెండో హీరోయిన్‌ అనే ఆలోచన రాలేదు. ‘ఉప్పెన’ తర్వాత నా వద్దకు వచ్చిన కొన్ని స్క్రిప్ట్‌లు ‘ఉప్పెన’లో నా పాత్రలాగే ఉండేవి. నటిగా భిన్నమైన పాత్రలు చేస్తేనే నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నాది భిన్నమైన పాత్ర, హీరో నాని మంచి నటుడు. ఆయనతో కలిసి పనిచేస్తే.. నటనలో అనుభవం పెరుగుతుందని ఒప్పుకొన్నా.

కృతిశెట్టి

తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరోతో నటించాలని ఉంది?

కృతి శెట్టి: నాకు రామ్‌ చరణ్‌ గారంటే చాలా ఇష్టం. తెలుగులో నేను చూసిన తొలి చిత్రం ‘రంగస్థలం’. హిందీలోనూ ఆయన డబ్బింగ్‌ సినిమాలు చూశాను. ‘రంగస్థలం’లో ఆయన నాకు చాలా బాగా నచ్చారు. ఆయనతో కలిసి పనిచేయాలనే కోరిక ఉంది.

ఎన్ని భాషలు మాట్లాడగలరు?

కృతి శెట్టి: తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తుళు.. కన్నడ అర్థమవుతుంది. ఇప్పుడు తమిళం నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం రామ్‌-లింగుస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘వారియర్‌’లో నటిస్తున్నా.

ఏ హీరోని డైరెక్ట్‌ చేయాలనుకుంటున్నారు?

కల్యాణ్‌ కృష్ణ: చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనతో సినిమా చేయాలనే ఆశ ఉంది. నాకే కాదు, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్న వారందరికీ ఆయన సినిమాకు దర్శకత్వం వహించాలనే కల ఉంటుంది.

కాలేజ్‌లో మిమ్మల్ని అమ్మాయిలు చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అనేవారట?

కల్యాణ్‌ కృష్ణ: నేను కాలేజ్‌లో చదువుకున్న రోజుల్లో చాలా చిన్నగా ఉండేవాడిని. అందుకే చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అనేవారు. ఇప్పటికీ నా గురించి అలాగే మాట్లాడుకుంటారు.

థియేటర్‌లో ఓ సినిమా చూసి.. బయటకు వచ్చాక పార్కింగ్‌ దగ్గర గొడవపడ్డారట ఏంటా కథ!

కల్యాణ్‌ కృష్ణ: ‘గులాబీ’ చిత్రం సెకండ్‌ షో చూసి బయటకొచ్చినప్పుడు థియేటర్‌ సిబ్బందిలో ఒకరు పార్కింగ్‌ టికెట్‌ గురించి నాతో గొడవ పడ్డాడు. ‘టికెట్‌ ఎక్కడో పోయింది.. డబ్బులు తీసుకొని వదిలేయ్‌’ అని చెప్పినా విన్లేదు. ‘టికెట్‌ చూపించండి.. లేదంటే కదలడానికి వీల్లేదు’ అన్నాడు. ‘గులాబీ’ చిత్రం సెకండాఫ్‌ ఫైటింగ్‌, వయలెన్స్‌ మెదడులోనే తిరుగుతూనే ఉంది.. ఆ ప్రభావంతో అతడిని కొట్టేశాను. ఆ తర్వాత థియేటర్‌ స్టాఫ్‌ అంతా వచ్చి అతడిదే తప్పని చెప్పి పంపించారు.

నాగార్జున గారు మీపై కొప్పడ్డారట?

కల్యాణ్‌ కృష్ణ: ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో జరిగింది. అది నా తప్పు కాదు, ఇద్దరు ముగ్గురు తప్పుల్ని కవర్‌ చేసే ప్రయత్నం చేశా. దీంతో ‘వాళ్ల తప్పుల్ని ఎన్ని రోజులు కవర్‌ చేస్తావ్‌. దీని వల్ల సినిమా ఆలస్యమవుతుంది’ అని సీరియస్‌ అయ్యారు.

నాగలక్ష్మి పాత్రకు కృతినే ఎందుకు ఎంచుకున్నారు?

కల్యాణ్‌ కృష్ణ: ‘ఉప్పెన’ విడుదలకు ముందే కృతిని సంప్రదించాం. ఆ చిత్రం షూటింగ్‌ జరుపుకొంటున్న సమయంలోనే కృతి స్టిల్స్‌ చూసి ఈ పాత్రకు ఆమె సరిపోతుందని భావించాం. ‘ఉప్పెన’ రిజల్ట్‌ చూసి ఆమె వద్దకు వెళ్లలేదు. ఆ చిత్రం హిట్‌ కావడంతో మాకు కలిసొచ్చింది.

బంగార్రాజు కథ చెప్పగానే నాగార్జున గారు ఏమన్నారు?

కల్యాణ్‌ కృష్ణ: ఇది ‘సోగ్గాడే..’ పాత్ర కొనసాగింపే. మనవడు పాత్ర వాళ్ల కుటుంబం నుంచి వస్తే బాగుంటుందనుకున్నాం. ఆ సినిమా ఎక్కడ ఆగిపోయిందో.. అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. నాగార్జున గారికి లైన్‌ చెప్పగానే ‘ఫర్‌ఫెక్ట్‌ సీక్వెల్‌ అవుతుంది.. చేద్దాం’ అన్నారు. సీక్వెల్‌పై ప్రేక్షకులకు ఉండే అంచనాలను అందుకుంటూనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం.

ఓ చోట నాలుగు గంటలపాటు నిలబడి లైట్‌ స్విచ్‌ ఆన్‌.. స్విచ్‌ ఆఫ్‌ చేస్తూ ఉండిపోయారట?

కల్యాణ్‌ కృష్ణ: ఓ సినిమాకు అప్రెంటీస్‌గా పనిచేశా. షూటింగ్‌ పూర్తయింది. డబ్బింగ్‌కు రావొద్దన్నారు. అయినా, నాకు వెళ్లాలనిపించి ప్రసాద్‌ ల్యాబ్‌లో డోర్‌ బయట నిల్చున్నా. ఎవరు అడిగినా డబ్బింగ్‌ వర్క్‌ చూద్దామని వచ్చా అని చెప్పేవాడిని. వారంపాటు అలాగే నిల్చున్నాను. ఓ రోజు ఆ చిత్ర నిర్మాత వచ్చి ‘వారం రోజుల నుంచి ఇక్కడే నిల్చుంటున్నావ్‌. లోపలికి ఎందుకు రావట్లేదు?’ అని అడిగారు. దీంతో ఆయన పక్కనే ఉన్న అసోసియేట్‌ డైరెక్టర్‌ నన్ను లోపలికి తీసుకెళ్లారు. డబ్బింగ్‌ సమయంలో లైట్‌ ఆన్‌.. ఆఫ్‌ చేసే పని అప్పగించారు. నాలుగు గంటలపాటు నిలబడే ఆ పని చేశా. ఆ తర్వాత పక్కనే ఒక కుర్చీ ఉంటే దానిపై కూర్చొని పని చేసుకుంటున్నా. వెంటనే వాళ్లు వచ్చి ఎందుకు కూర్చున్నావని అడిగారు. కాళ్లు నొప్పి పుడుతున్నాయ్‌.. అందుకే కూర్చునే లైట్‌ ఆన్‌.. ఆఫ్ చేస్తున్నాను అని చెప్పా. ఈ మాత్రం ఓపిక లేనివాడు ఇండస్ట్రీలో ఉండటం కష్టం. మాకు అవసరం లేదు వెళ్లిపో అన్నారు. ఇప్పటికీ వాళ్లు నాతో మాట్లాడుతుంటారు.

థర్డ్‌ ఫ్లోర్‌ నుంచి పైపు పట్టుకొని దిగావంటా ఏంటా కథ?

కల్యాణ్‌ కృష్ణ: అమలాపురంలో నేను స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలో జరిగింది. ఓ సారి మా కజిన్‌ పెళ్లి కోసం అక్కడికి వెళ్లాం. వాళ్లున్న మూడో ఫ్లోర్‌ చాలా పెద్దగా ఉండేది క్లబ్‌ హౌజ్‌, లైబ్రరీ చాలా ఉండేవి. నేను అక్కడే ఆడుకొని బాత్రూమ్‌కు వెళ్లాను. అప్పుడు వాచ్‌మెన్‌ వచ్చి బయటి నుంచి డోర్‌ పెట్టి వెళ్లిపోయాడు. ఎంత పిలిచినా ఎవరూ పలకలేదు. దీంతో ధైర్యం తెచ్చుకొని వెంటిలేటర్‌ అద్దాలు తొలగించి పైపులైను పట్టుకొని కిందకి దిగడానికి ప్రయత్నిస్తుంటే.. కింద ఉన్నవాళ్లు చూసి పడిపోతావ్‌ అని అరిచారు. విషయం తెలుసుకొని మావాళ్లు వచ్చి పైకెక్కు అని అరిచారు. ఏం చేయాలో అర్థంకాక 20 నిమిషాలు అలాగే ఉండిపోయా. ఆ తర్వాత రెండో ఫ్లోర్‌ బాత్రూమ్‌ వెంటిలేటర్‌ అద్దాలు తొలగించి దిగేశా. ఆ పని చేసినందుకు ఇంట్లోవాళ్లు వారం రోజులు తిట్టారు. నేను చాలా అల్లరి పిల్లాడిని అనే ముద్ర ఉంది.

చిన్నప్పుడు రన్నింగ్‌ రేసులో పరిగెత్తమంటే.. ర్యాంప్‌ వాక్‌ చేశారట?

కృతి శెట్టి: మా నాన్న, అమ్మ ఇద్దరూ అథ్లెట్లు (రన్నింగ్‌). నేను యూకేజీలో ఉన్నప్పుడు స్కూల్‌లో రన్నింగ్‌ రేస్‌ పెడితే ‘మేం రన్నర్స్‌ కదా.. మా కూతురు కూడా బాగా రన్నింగ్‌ చేస్తుంది’ అనుకొని వచ్చారు. నేనేమో.. రన్నింగ్‌ చేయకుండా అందరికీ హాయ్‌ చెబుతూ.. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లా. అది చూసి మా తల్లిదండ్రులు ఇదేంటి ఇలా చేస్తుందని బిత్తరపోయారు.

విజయ్‌ సేతుపతికి హీరోయిన్‌గా కృతిని సూచిస్తే.. ఆయన చేయనున్నారట తెలుసా?

కృతి శెట్టి: సినిమా షూటింగ్‌ సమయంలో ఆయన నాకిచ్చిన సలహాలు, మాట్లాడే విధానం అచ్చం మా నాన్నలా అనిపించింది. తొలిసారి కలిసినప్పుడు క్యూట్‌గా బేబీలా ఉన్నావన్నారు. నన్ను అలా చూశారు కదా.. అందుకే వద్దని ఉండొచ్చు.

నెక్ట్స్‌ ఏంటి?

కల్యాణ్‌ కృష్ణ: ఇంకా ఫిక్స్‌ అవ్వలేదు.

కృతి శెట్టి: ఇంద్రగంటి మోహన్‌-సుధీర్‌ బాబు కాంబినేషన్‌లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్‌-లింగుస్వామి కాంబినేషన్‌లో ‘వారియర్‌’, నితిన్‌ గారితో ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలో నటిస్తున్నాను.

ABOUT THE AUTHOR

...view details