ఎందరో కథానాయికలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్.ప్రతి ఏడాది ఎంతో మంది నూతన హీరోయిన్లుగా తెలుగు సినిమాల్లో నటించి తమ ప్రతిభను చాటుకుంటున్నారు.కానీ నాయికా ప్రాధాన్యంతో కూడిన కథలకి కేరాఫ్‌గా నిలుస్తూ, నటనపరంగానూ శభాష్ అనిపించుకొనేవాళ్లని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. వారిలో ఛార్మి ఒకరు.
కమర్షియల్ నటిగానే కాకుండా... మంచి నటనతోనూ గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ఛార్మి. నేడు 32వ వసంతంలోకి అడుగుపైడుతున్న సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
పంజాబీ బొమ్మ...
ముంబయిలో పుట్టి పెరిగిన పంజాబీ పడుచు ఛార్మి. మే 17, 1987న సిక్కు కుటుంబంలో ఆమె జన్మించింది. కార్మెలైట్ కాన్వెంట్ హైస్కూల్‌లో చదువుకొంది. పాఠశాల విద్య చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు అందుకొంది ఛార్మి. తెలుగు తెరపై తొలినాళ్లల్లో పాల బుగ్గలతో, కాస్త బొద్దుగా దర్శనమిచ్చిందీ ముద్దుగుమ్మ.
కృష్ణవంశీ కళారూపం...
‘నీ తోడు కావాలి’ ఛార్మి తొలి చిత్రం. ఆ తర్వాత తమిళం, మలయాళం నుంచి అవకాశాలు అందుకొంది. 2003లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘శ్రీ ఆంజనేయం’లో నటించడం ఛార్మి కెరీర్‌కే ఓ పెద్ద మలుపు. ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసినా ఛార్మికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘గౌరి’, ‘చంటి’, ‘మాస్’, ‘చక్రం’, 'మంత్ర', ‘అనుకోకుండా ఒకరోజు’, ‘పొలికల్ రౌడీ’, ‘అల్లరి పిడుగు’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘లక్ష్మి’, ‘స్టైల్’, ‘పౌర్ణమి’, ‘చిన్నోడు’, ‘రాఖి’, ‘లవకుశ’, ‘మంత్ర’, ‘సుందరకాండ’, ‘భలే దొంగలు’, ‘మైఖైల్ మదనకామరాజు’... ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో పలువురు అగ్ర కథానాయకులతో కలిసి ఆడిపాడింది. దక్షిణాదిలోని నాలుగు భాషల్లో నటించి ఛార్మి పేరు తెచ్చుకొంది.