Balayya rajamouli cinema: సినిమా తీసేటప్పుడు తాను హీరో కష్టసుఖాల గురించి ఆలోచించనని అగ్ర దర్శకుడు రాజమౌళి(Rajamouli) అన్నారు. ఒకవేళ బాలకృష్ణతో సినిమా చేస్తుంటే తన వ్యవహారశైలి వల్ల ఆయనకు ఏమైనా కోపం వస్తుందేమోనన్న భయంతోనే సినిమా చేయడానికి ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'(Unstoppable With NBK). ఈ షోకు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విచ్చేసి సందడి చేశారు.
"ఇప్పటివరకూ మన కాంబినేషన్ పడలేదు. నా అభిమానులు మిమ్మల్ని 'బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు' అని అడిగితే 'బాలకృష్ణను నేను హ్యాండిల్ చేయలేను' అన్నారట ఎందుకు?" అని బాలయ్య ప్రశ్నించగా.. "భయంతోనే అలా అన్నాను. చిన్న వాళ్ల దగ్గరి నుంచి పెద్ద వాళ్ల వరకూ మీరు అందరికీ గౌరవం ఇస్తారు. చాలా పద్ధతిగా ఉంటారు. నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు. నాకు ఎవరైనా 'గుడ్ మార్నింగ్' చెబితే చిరాకు. షాట్ పెట్టుకుని పక్కన హీరో ఎండలో నిలబడ్డాడా? వానలో నిలబడ్డాడా? అన్నది చూడను. నా ఫ్రేమ్ రెడీ అయ్యే వరకూ హీరో కష్ట సుఖాలు ఆలోచించలేను. ఒక వేళ మిమ్మల్ని డైరెక్ట్ చేయాల్సి వస్తే, మీకేమైనా కోపం వస్తుందేమోనని భయం. నాకు అదే టెన్షన్" అని రాజమౌళి సమాధానం ఇచ్చారు.
వెంటనే అందుకున్న బాలకృష్ణ "నేను ఒకసారి క్యారావ్యాన్‌లోని నుంచి బయటకు వస్తే, ఆ రోజు షూటింగ్ అయ్యే వరకూ లోపలకి వెళ్లను గొడుగు పట్టనివ్వను" అని బాలయ్య చెప్పుకొచ్చారు.