Alitho saradaga sampath raj: విలన్ పాత్రలకు అతడి నటన రెఫరెన్స్‌లాంటిది. గంభీరమైన కంఠంతో, ఆరు అడుగుల కటౌట్‌తో, ఆరు భాషల్లో వందకుపైగా చిత్రాల్లో విలన్, సహాయక పాత్రల్లో నటించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంటున్నారు. ఆయనే సంపత్ రాజ్. ఎన్నో పాత్రలకు జీవం పోస్తున్న ఈ విలక్షణ నటుడు 'ఈటీవీ'లో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..
మీరు పుట్టి పెరిగింది ఎక్కడ?
సంపత్ రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పుట్టాను. మా అమ్మగారిది తమిళనాడులోని శ్రీరంగం. మా నాన్న రామస్వామి శ్రీనివాస్. ఆయనది నెల్లూరే. కానీ, ఆర్మీలో పనిచేస్తుండటం వల్ల తరుచూ బదిలీలయ్యేవి. అలా దేశం మొత్తం తిరిగి.. ఆఖరుకు బెంగళూరులో స్థిరపడ్డాం. మా నాన్న తెలుగు పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. మా తల్లిదండ్రులకు ఏడెనిమిది భాషల్లో పట్టు ఉంది. నేనూ ఐదారు భాషలు మాట్లాడగలను.
ఏడుగురు సంతానంలో నేను చిన్నవాడిని. 'మాకు పేర్లెందుకు పెట్టావ్..? సండే, మండే, ట్యూస్‌డే అని పెడితే సరిపోయేది' అని మా అమ్మతో అనేవాడిని. అప్పుడు నా పేరు సండే అయ్యేది. అందుకే, నాకు స్కూల్, కాలేజీ చదువులు నచ్చలేదు. పెద్దన్నయ్య గల్ఫ్‌లో ఉన్నాడు. ఒక అన్న లండన్‌లో, ఇంకో అన్న ఇక్కడే ఉన్నాడు. అక్కలకు వివాహాలయ్యాయి.. అందరూ సంతోషంగా ఉన్నారు. మా కుటుంబంలో నేను ఒక్కడినే నటుడిని.
మిమ్మల్ని 'మిర్చి' సంపత్ అంటేనే అందరూ గుర్తుపడుతుంటారు. ఆ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
సంపత్ రాజ్: బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'దమ్ము' నా తొలి చిత్రం. ఆ తర్వాత పవన్ కల్యాణ్ 'పంజా'లో నటించా. మూడో చిత్రం 'మిర్చి'. కొరటాల శివ కథ చెప్పగానే ఒప్పేసుకున్నా. నా తొలి రోజు షూటింగ్‌లో ప్రభాస్‌ను ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్తూ ఒక డైలాగ్ చెప్పా. దానికి సెట్‌లో అందరూ క్లాప్స్ కొట్టారు. మంచి పాత్ర అవుతుందని అనుకున్నాను. కానీ, అంత పేరు వస్తుందని అనుకోలేదు.
నిజానికి మా అమ్మకు సినిమాలంటే ఇష్టం ఉండదు. చదువు రాని వాడు, పనికిరానివాడు సినిమాల్లోకి వెళ్తారని భావించేవారు. ఆ భయంతో నాకు సినిమాలపై ఇష్టం ఉన్నా చెప్పలేదు. ఓ సారి నేషనల్ స్కూల్‌లో డ్రామాకు దరఖాస్తు చేస్తే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. కానీ, దాన్ని మా అమ్మ చింపేసింది. అప్పుడు మా నాన్న 'నువ్వు ఇలాగే అమ్మకి భయపడుతూ ఉంటే వెళ్లలేవు. ఇంట్లో నుంచి పారిపో' అని అన్నారు.
తమిళ్‌లో ‘సరోజా’ చిత్రంలో నేను నటించాను. ఆ చిత్రం ప్రివ్యూ షోకు మా అమ్మను తీసుకెళ్లా. సినిమా చూశాక.. దర్శకుడు వెంకట్ ప్రభు వచ్చి ఎలా ఉందని అమ్మని అడిగారు. మా అమ్మ ఏమీ స్పందించకుండా తల ఊపింది. తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చే సమయానికి అమ్మగారు లేరు. ఉండి ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండేది.
32 ఏళ్లకు మీ కెరీర్ స్టార్ట్ అయింది.. దానికి ముందు ఏం చేశారు?
సంపత్ రాజ్: నాకు ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ ఉండేది. ఇప్పుడూ ఉంది. కానీ, దాంట్లో నాకు భాగస్వామ్యం లేదు. సినిమాల్లోకి రాకముందు 12ఏళ్లు అందులోనే పనిచేశా. కన్నడలో ఒక చిన్న సినిమాకు ఆడిషన్స్ నిర్వహిస్తుంటే మా స్నేహితుడు వెళ్లి ఫెయిలయ్యాడు. అయితే, వాళ్లు ఇచ్చిన పాత్ర నాకు బాగా సూట్ అవుతుందని నా స్నేహితుడు భావించాడట. అలా అందులో నటించా. ఆ సమయంలో నాకు విడాకులు అయ్యాయి. ఆ బాధలో కాస్త బక్కచిక్కిపోయి ఉన్నా. అదే ఆ సినిమాలో నాకు ప్లస్ అయ్యింది.
విడాకులు ఎందుకు తీసుకున్నారు?
సంపత్ రాజ్: మాది పెద్దలు కుదర్చిన వివాహమే. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను. అదే విడాకులకు కారణమని చెప్పొచ్చు. గొడవలు ఏం లేవు. కానీ, మా ఇద్దరి మధ్య సఖ్యత ఉండేది కాదు. దీంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. 20ఏళ్లకు ఉండే ఆలోచనలు.. 30ఏళ్లకు వచ్చేసరికి మారిపోతుంటాయి. అందుకే చిన్న వయసులో వివాహం చేసుకుంటే సమస్యలొస్తాయి. ఇదే విషయాన్ని నా కూతురికి చెబుతుంటా. ప్రస్తుతం నా కూతురు ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చదువుతోంది. మా విడాకులపై తను మొదట్లో బాధ పడింది. కానీ నేను వివరంగా నచ్చజెప్పా. ఇప్పుడు తను సంతోషంగానే ఉంది. విడాకుల తర్వాత నా కూతురు బాధ్యత నేనే తీసుకున్నా. తన స్కూల్‌లో జరిగే ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యేవాడిని. తనతో ఉండటం కోసం సెలవుల్లో షూటింగ్‌లకు వెళ్లేవాడిని కాదు.
నటి శరణ్య మీ మాజీ భార్య అట. నిజమేనా?
సంపత్ రాజ్: నిజం కాదు. మీడియాలో తప్పుగా ప్రచారమైంది. ఆ వార్త రాసిన వెబ్‌సైట్‌కు నేను లీగల్ నోటీసు కూడా పంపించా. నిజమేంటంటే.. శరణ్య కుటుంబం నాకు చాలా సన్నిహితంగా ఉంటుంది. ఓ సినిమాలో నేను, శరణ్య భార్యభర్తలుగా నటించాం. ఆ ఫొటో పెట్టి ఆమె.. నా మాజీ భార్య అని రాసుకొచ్చారు.
సాధారణంగా సినిమాల్లో లేడీస్‌తో ఐటెం సాంగ్ చేయిస్తారు. కానీ, మీ బాడీలో మంచి గ్రేస్ కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ తర్వాత మీతో ఐటెం సాంగ్ చేయిస్తారేమో..?
సంపత్ రాజ్: మీరు సిఫార్సు చేస్తే ఐటెం సాంగ్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. ఈ ప్రోగ్రాం చూశాక ఎవరైనా ఆ నిర్ణయం తీసుకుంటే నేను రెడీ.
ఏదైనా సినిమాలో డ్యాన్స్ చేశారా?
సంపత్ రాజ్: చేశా. ‘సరోజా’ సినిమాలో విలన్‌కు లవర్ ఉంటుంది. ఒక పాట కూడా ఉంది. 2008లో వచ్చిన ఆ పాట చాలా హిట్ అయింది. నేను.. సింగపూర్, మలేసియా, శ్రీలంక, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశానికి వెళ్లినా ఆ పాట ప్లే చేసేవారు. ఒక విలన్‌కు అంత హిట్ పాట ఉండటం ఏ నటుడికీ జరగలేదు.
మీ స్నేహితుడితో కలిసి కపుల్‌లాగా ఉన్నారట?
సంపత్ రాజ్: ‘సరోజా’ తర్వాత ‘గోవా’ అని ఓ సినిమా చేశా. దాంట్లో ఒక గే పాత్ర ఉంది. ‘ఆ పాత్ర ఎవరు చేస్తున్నారు?’ అని దర్శకుడు వెంకట్ ప్రభుని అడిగితే.. ‘నా మైండ్‌లో ఒకరు ఉన్నారు. అడిగితే ఒప్పుకోరేమో’ అన్నాడు. అదేంటి.. ‘నటుడు ఇలాంటి ఒక ఛాలెంజింగ్ పాత్రను కచ్చితంగా చేయాలి’ అన్నా. వెంటనే అది నువ్వే అని చెప్పి తను పారిపోయాడు. నేను పరిగెత్తి పట్టుకొని ఆ పాత్ర చేస్తానని చెప్పా. ఆ సినిమాలో నాకు గే భాగస్వామి ఉంటాడు. ఆ పాత్రలో అరవింద్ ఆకాశ్ అనే నటుడిని తీసుకున్నారు. దీంతో ‘ఆయన వద్దకు వెళ్లి.. మనం స్నేహితులం. నేరుగా కెమెరా ముందు నటించాలంటే కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. నువ్వు జిమ్ చేసి మా ఇంటికి రా’ అని చెప్పా. అలా తరచూ అతడు మా ఇంటికి వచ్చేవాడు. అతడికి టీ ఇచ్చేవాడిని.. బాల్కనీలో కూర్చొనేవాళ్లం. బెడ్‌పై పడుకొని టీవీ చూసేవాళ్లం. నిజంగా కపుల్‌లాగా ప్రవర్తించాం. అందుకే, ఆ సినిమాలో మా పాత్రలు బాగా పండాయి.
రియల్ లైఫ్‌లో సంపత్ విలనా? సాఫ్టా?
సంపత్ రాజ్: నేను సినిమాని ఒక పనిలా చూస్తా. ఒకరు ఇంజినీర్ అవ్వాలనుకుంటారు.. మరొకరు డాక్టర్ అవ్వాలనుకుంటారు. నేను నటుడిని అవ్వాలనుకున్నా. నా వ్యక్తిగత జీవితాన్ని, సినిమాలను అస్సలు కలపను. దాంట్లో నాకు స్పష్టత ఉంది. ఇక నేను ఎలాంటి వాడినని అడిగితే మంచివాడిననే చెబుతా. నాతో ఉన్నవాళ్లను అడిగితే నేనేంటో తెలుస్తుంది.
తర్వాతి సినిమాలో అవకాశం ఇవ్వకపోతే లొకేషన్‌కు వచ్చి కెమెరా ఎత్తుకెళ్తానని బెదిరించారట?
సంపత్ రాజ్: ఇప్పటికీ ఆ మాట మీదే నిలబడతా. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. సాధారణంగా నేను సినిమా కథ, నా పాత్ర గురించి తెలుసుకున్న తర్వాతే ఒకే చెబుతా. కానీ, 'S/o సత్యమూర్తి' సినిమా కోసం త్రివిక్రమ్ గారి నుంచి ఫోన్ రాగానే ఒప్పుకొన్నా. ఆ సినిమా చేస్తున్నప్పుడు 'ఇది చిన్న పాత్ర.. కానీ, భవిష్యత్తులో మీతో కనీసం 25 రోజులు కలిసి పనిచేసేలా పాత్ర రాస్తా' అని చెప్పారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశారు. కానీ, నా కోసం ఇప్పటివరకూ అలాంటి పాత్ర రాయలేదు. పాత్ర ఇస్తానని ఆయన సినిమా ఫంక్షన్‌లో బహిరంగంగా చెప్పారు. సినిమాలో అవకాశం ఇవ్వకపోతే కెమెరా ఎత్తుకెళ్తానని నేనూ బహిరంగగానే చెప్పా. ఇప్పుడాయన ఏదో సినిమా చేయబోతున్నారు. కచ్చితంగా అన్న పని చేస్తా. త్రివిక్రమ్‌ను ఎక్కడ కలవొచ్చు అని ఎఫ్3 షూటింగ్‌లో సునీల్‌ను అడిగా. ఆయన అడ్రస్ చెప్పారు. త్వరలోనే ఆయన వద్దకు వెళ్తా.
భవిష్యత్తులో సంపత్ నటుడిగా కాకుండా ఏం అవుదామనుకుంటున్నారు?
సంపత్ రాజ్: అలా ఏం అనుకోలేదు. చనిపోయే వరకూ.. అవకాశాలు వచ్చే వరకూ నటించొచ్చు. అయితే, నాకు ‘రూరల్ టూరిజం’పై ఒక ఆలోచన ఉంది. దాని గురించి నా స్నేహితులతో కలిసి ప్రణాళికలు రచిస్తున్నాం. మూడేళ్ల ప్రాజెక్ట్ అది.