తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గుర్రం కాళ్ల కింద పడ్డా.. తొక్కి పడేసింది: నటి మహేశ్వరి

Alitho saradaga latest episode: 90ల్లో హీరోయిన్​గా యూత్​ను అలరించిన హీరోయిన్ మహేశ్వరి.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సందడి చేశారు. సరదా సంగతులు చెప్పారు.

alitho saradaga maheshwari
మహేశ్వరి

By

Published : Jan 27, 2022, 10:46 AM IST

Alitho saradaga maheswari: మహేశ్వరి.. ఇరవై ఏళ్ల క్రితం తెలుగు తెరపై ఆమె ఒక సెన్సేషన్‌. ప్రేక్షకులతో నేటికీ ఆమెది విడదీయలేని రిలేషన్‌. ఈ గులాబీ బొమ్మ.. ఆరేళ్లలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 35 చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె, ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విషయాలను పంచుకున్నారు.

మహేశ్వరి.. ప్రస్తుతం ఏం చేస్తున్నారు?

మహేశ్వరి: ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా. అప్పుడప్పుడు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేస్తుంటా. ఈ మధ్యే జంతువుల పరిరక్షణపై దృష్టి సారించా. అక్కినేని అమల గారే నాకు స్ఫూర్తి. ఆమెలా చేయాలని కోరిక. ఆమె స్థాయిలో కాకపోయినా నా వంతు చిన్న ప్రయత్నం చేస్తున్నాను.

నటి మహేశ్వరి

చివరగా మీరు నటించిన చిత్రమేది?ఆ తర్వాత ఎందుకు నటనను కొనసాగించలేదు?

మహేశ్వరి: 'మా అన్నయ్య' చివరి సినిమా. ఆ తర్వాత కావాలని నటనకు దూరం కాలేదు. మంచి పాత్రలు వస్తే చేద్దాం.. లేదంటే ఇంట్లో కూర్చుద్దామనుకున్నా. ఏదో ఒకటి చేయాలని, బాగోలేని పాత్రల్లో నటించి.. ప్రేక్షకులకు మనపై ఉన్న మర్యాద, క్రేజ్‌ ఎందుకు పోగొట్టుకోవడమని నటించట్లేదు. మంచి పాత్రలొస్తే కచ్చితంగా నటిస్తాను.

మీ తొలి సినిమా (అమ్మాయి కాపురం)లో అవకాశమెలా వచ్చింది?

మహేశ్వరి: భారతీరాజా గారి దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం 'కరుత్తమ్మ'లో నటించాను. అందులో నా వాన పాట ముత్యాల సుబ్బయ్య గారికి, టి. కృష్ణ గారి మొదటి అబ్బాయి ప్రేమ్‌కు బాగా నచ్చినట్లు ఉంది. పట్టుబట్టి నన్ను 'అమ్మాయి కాపురం'కు ఎంపిక చేసుకున్నారు. తొలి రోజే పెళ్లి చూపులు సీన్‌. అప్పుడు దర్శకుడు ముత్యాల సుబ్బయ్యగారు నన్ను చూసి 'ఇంత సన్నగా కనిపిస్తోంది.. ఇంత పెద్ద పాత్ర చేయగలదా?' అన్నారు సందేహంగా. కానీ నన్నే కొనసాగించడం వల్ల సినిమా పూర్తి చేశాం. ఆ సినిమాకుగాను నాకు నంది అవార్డు దక్కింది.

మీ సొంతూరు ఏది?

మహేశ్వరి: పుట్టి.. పెరిగింది చెన్నైలోనే. నాన్నది తిరుపతి. అమ్మది శివకాశీ. మా తెలుగు భాష అంత బాగుండేది కాదు. ఇక్కడ సెటిలయ్యాక మాట్లాడటం నేర్చుకున్నాం.

శ్రీదేవికి మీకున్న రిలేషన్‌పై చాలా మందిలో కన్ఫ్యూజన్‌ ఉంది. అసలు మీరు శ్రీదేవికి ఏమవుతారు?

మహేశ్వరి: శ్రీదేవి.. మా అమ్మకు చెల్లెలు. నాకు చిన్నమ్మ. చిన్నప్పట్నుంచి ఆమెను అక్క అని పిలవడం అలవాటైపోయింది. ఆమె మరణించినా.. ఇప్పటికీ ఆమె విదేశాల్లో ఎక్కడో షూటింగ్‌లోనో, షోలో ఉన్నట్టే అనిపిస్తోంది. ఆమె లేదన్న విషయాన్ని నమ్మబుద్ది కావట్లేదు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చేవారు. అందరి వద్దా మర్యాదగా ఉండాలని చెబుతూ ఉండేవారు.

శ్రీదేవి- మహేశ్వరి

భారతీరాజా గారే మిమ్మల్ని హీరోయిన్‌ను చేస్తానని చెప్పారట?

మహేశ్వరి: అవును. అప్పుడు నేను 12వ తరగతి చదువుతున్నా. సన్నగా.. కాకికి రెండు జడలు వేసినట్లు ఉండేదాన్ని. ఓసారి మా ఇంట్లో శుభకార్యం ఉంటే భారతీరాజా గారు వచ్చారు. నన్ను చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. అక్క (శ్రీదేవి) వద్దన్నారు. ఆ తర్వాత భారతీరాజా గారు మళ్లీ అడిగారట. అదే సమయంలో నేను కాలేజ్‌లో చేరా. అక్కడ మా ప్రొఫెసర్‌ నన్ను చాలా హింసించేది. ఆమె నుంచి తప్పించుకోవడానికి సినిమాల్లో నటిస్తానని ఇంట్లోవాళ్లని ఒప్పించా. అలా 'కరుత్తమ్మ' పూర్తి చేశా. దానికి పారితోషికంగా ఒక బంగారు నాణెం, రూ.5వేలు ఇచ్చారు.

'కరుత్తమ్మ' చేస్తున్నప్పుడే 'ఖైదీ ఇన్‌స్పెక్టర్‌' షూటింగ్‌ జరిగింది. ముందు నటించింది ఈ సినిమాలోనే. ఇందులో సుమన్‌ హీరో.. రంభ హీరోయిన్‌. నేను మరో హీరోయిన్‌గా నటించా. ఆ తర్వాత నటించిన ‘అమ్మాయి కాపురం’ చిత్రమే ముందుగా విడుదలైంది. అనంతరం ‘గులాబి’ చేశా. ఆ చిత్రం హిట్‌ అవుతుందో లేదో కానీ, నాకు మంచి పేరొస్తుందని నమ్మాను. డబ్బింగ్‌ కూడా కృష్ణవంశీ, ఆర్జీవీ గారు చెప్పమనడంతోనే చెప్పా. అనుకున్నట్లే మంచి క్రేజ్‌ వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు కృష్ణవంశీకి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన ఒక ట్రెండ్‌ సృష్టించారు.

మేఘాలలో తేలిపోమ్మన్నది.. పాట షూటింగ్‌లో పెద్ద ఇష్యూ జరిగిందట?

మహేశ్వరి: చాలా పెద్ద ఇష్యూ జరిగింది. నాకేమో బైకు మీద వెళ్లడం అలవాటు లేదు. ఆ పాటలోనేమో బైక్‌పై స్పీడుగా వెళ్లాలి. అరకు వ్యాలీలో చక్రి స్పీడ్‌గా వెళ్తుంటే ఎదురుగా ఒక వ్యాన్‌ వచ్చే సీనుంది. ఆ టైంలో మా బైక్‌ స్కిడ్‌ కావడంతో లోయలో పడిపోయాం. అక్కడ ఒక చెట్టు అడ్డురావడంతో దాన్ని పట్టుకొని పైకొచ్చాం. అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాం.

ఇండస్ట్రీలో ఆప్త మిత్రులెవరున్నారు?

మహేశ్వరి: మీనా, సంగీత. వారిద్దరు చాలా మంచి మిత్రులు. వారిద్దరూ టచ్‌లో ఉంటారు. మీనా.. చాలా సాఫ్ట్‌ పర్సన్‌. సంగీత.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు.

మీనా - మహేశ్వరి- సంగీత

వాళ్లతో మీకు ఎలా పరిచయం?

మహేశ్వరి: నటి మంజుల గారి ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంటే అక్కడ సంగీతను కలిశాను. మీనాని సినిమా ఫంక్షన్‌లో కలిశా. మీనాతో కలిసి రెండు సినిమాలు చేశా. తమిళ్‌లో ‘నామ్‌ ఇరువర్‌ నమ్మక్‌ ఇరువర్‌’, తెలుగులో ‘వెలుగునీడలు’.

మీ జనరేషన్‌ వాళ్లు మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తున్నారు.. మరి మీరు?

మహేశ్వరి: కచ్చితంగా.. రీ-ఎంట్రీ ఇస్తా. అయితే, నాకున్న క్రేజ్‌ను ఏ మాత్రం మార్చకుండా ఉండే పాత్రలు వస్తేనే చేస్తా.

భారతీరాజా గారు.. మీరు శ్రీదేవి అక్క కుమార్తె అని అవకాశం ఇచ్చారా? మీలో ప్రతిభ ఉందని ఇచ్చారా?

మహేశ్వరి: అక్కని చూసే అవకాశమిచ్చారు. నేను చాలా సాధారణంగా ఉండే మనిషిని. నాకు తెలిసి శ్రీదేవి అక్క బిడ్డని కదా అని రిస్క్‌ చేసి అవకాశమిచ్చారు. శ్రీదేవి గారికి శ్రీలత అని మరో సోదరి ఉన్నారు. చిన్నప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు.

మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదుర్చిందా? మీ వారేం చేస్తుంటారు?

మహేశ్వరి: పెద్దలు కుదిర్చిన వివాహమే. మా వారిది గుంటూరు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే పేమెంట్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు.

నటి మహేశ్వరి

మధ్యలో టీవీలో కూడా నటించినట్లున్నారు?

మహేశ్వరి: ‘మై నేమ్‌ ఈజ్‌ మంగతాయరు’ అనే సీరియల్‌లో రెండేళ్లు నటించా. సినిమాలకు దూరమయ్యాక చెన్నైలో బ్యాడ్మింటన్‌ ఆడటం మొదలుపెట్టా. కొంతమంది సీరియల్స్‌లో నటిస్తారా అని అడిగారు కానీ, నో చెప్పా. ఓ సారి హీరో సురేశ్‌ కాల్‌ చేసి సీరియల్‌లో నటిస్తారా అని అడిగారు. అప్పుడూ నో చెప్పా. అయితే, ముందు కథ వినండి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అన్నారు. అది కామెడీ జోనర్‌. నాకు కామెడీ చేయాలన్న కోరిక ఉండేది. అలా ఆ సీరియల్‌లో నటించా. ఆ సీరియల్‌కు కథ రాసింది సురేశ్‌ గారి భార్యే.

ఓ పెద్దాయన నీకు రూ.50వేలు బాకీ ఉన్నారట?

మహేశ్వరి: ఆయన ఎవరో కాదు రామ్‌ గోపాల్‌వర్మ గారు. ‘దెయ్యం’ షూటింగ్‌ మేడ్చల్‌లో ఆర్జీవీ గారి ఫామ్‌హౌజ్‌లో రెండు నెలలపాటు జరిగింది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు షూటింగ్‌. ఆ ఇల్లేమో మెయిన్‌ రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో లోపల ఉంది. ఆ లొకేషన్‌ చాలా భయకరంగా ఉండేది. ఒక రోజు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో స్మశానం సెట్‌లో షూటింగ్‌ జరుగుతుంది. రాము గారు వచ్చి ‘ఎవరైనా ఒంటరిగా మెయిన్‌రోడ్డు వరకు వెళ్లి వస్తారా? రూ. 50వేలు ఇస్తా’ అన్నారు. నేను ఒప్పుకొని వెళ్లొచ్చాను. కానీ, డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటికీ ఎదురైనప్పుడు ఆ డబ్బు అడుగుతుంటా.

షూటింగ్‌ టైంలో మీరు రిజర్వ్‌డ్‌గా ఉండేవారట. అది చూసి ఈ అమ్మాయికి చాలా పొగరు అనుకునేవారట?

మహేశ్వరి: అవును. చాలా మంది నా ముఖానే చెప్పారు. ‘మీకు చాలా పొగరమ్మా’ అనేవారు. ఎవరితోనూ మాట్లాడొద్దు అని కాదు.. నాకు కాస్త సిగ్గు ఎక్కువ. అందుకే, షూటింగ్‌ టైంలో నటించడం, బ్రేక్‌ ఇవ్వగానే పుస్తకం చదువుకోవడం.. అంతే నా పని. అది చూసి చాలా మంది శ్రీదేవి కుటుంబం నుంచి వచ్చిందని పొగరు అనుకున్నారు.

మీకు తోబుట్టువులున్నారా?

మహేశ్వరి: నాకు కార్తీక్‌ అని ఒక సోదరుడున్నాడు. కన్‌స్ట్రక్షన్‌ రంగంలో ఉన్నాడు. ప్రస్తుతం తమిళ సినిమా 'డైనోసర్‌'లో హీరో. తను ఇంజినీరింగ్‌ చేసి.. లండన్‌లో ఎంబీఏ చేసి వచ్చాడు. సినిమాలపై ఆసక్తితో గౌతమ్‌ మేనన్‌కు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. 'ఏ మాయ చేశావే' చిత్రంలో తను నటించాల్సింది. మొదట కార్తీక్‌, త్రిషతో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కానీ, కొన్ని కారణాల అది కుదర్లేదు. దీంతో ఆ సినిమాలో నాగచైతన్య, సమంత నటించారు. అప్పుడు తను సినిమాలు మానేసి వ్యాపారం చూసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలో నటిస్తున్నాడు.

ఏదో సినిమాలో గుర్రంపై నుంచి పడిపోయారట?

మహేశ్వరి: ‘వీరుడు’ అనే సినిమా. వినోద్‌ కుమార్‌ హీరో. ఒక పాట షూటింగ్‌ కోసం మహాబలేశ్వరానికి తీసుకెళ్లారు. అదంతా కొండ ప్రాంతమే. పెళ్లి గెటప్‌లో నేను గుర్రంపై ఎక్కి ముందు కూర్చున్నా. వినోద్‌ కుమార్‌ వెనకాల కూర్చున్నారు. గుర్రం అదుపుతప్పి పరుగెత్తడంతో.. ఇద్దరం కింద పడిపోయాం. ఆయన కాస్త దూరంలో పడిపోతే.. నేను గుర్రం కాళ్ల కింద పడ్డా. ఆ గుర్రం నన్ను తొక్కి తొక్కి పెట్టింది. దీంతో ఒక కాలులో కండరం దెబ్బతింది.

శ్రీదేవి గారు.. మీ ఫ్యాషన్‌ డిజైన్లు నచ్చి.. తన కోసం కూడా డిజైన్‌ చేయమన్నారట?

మహేశ్వరి: ఆమెను చూసే డిజైనింగ్‌ నేర్చుకున్నా. ఆమెలో లేని టాలెంట్‌ అంటూ లేదు. ఇంటికి డిజైనర్లు వచ్చినప్పుడు తనే కాగితంపై డిజైన్లు స్కెచ్‌ గీసి ఇచ్చేది. అది చూసి నాకూ డిజైనింగ్‌పై ఆసక్తి పెరిగింది. ఓసారి నా డ్రెస్సులు చూసి నాకోసం డిజైన్‌ చేస్తావా అని శ్రీదేవి అక్క అడిగారు. దాంట్లో ఏముందని చేసిచ్చా. అలా మూడు యాడ్స్‌కు, పలు కార్యక్రమాలకు ఆమె దుస్తులు నేనే డిజైన్‌ చేసిచ్చాను. శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీకి కూడా డిజైన్‌ చేశా.

మీతో కలిసి నటించిన వడ్డే నవీన్‌, చక్రి (జేడీ చక్రవర్తి)తో ఎలా ఉండేది?

మహేశ్వరి: వడ్డే నవీన్‌తో ‘పెళ్లి’.. ‘మా బాలాజీ’ చిత్రాల్లో నటించా. ఆయన చాలా మంచి వ్యక్తి. ‘గులాబి’లో చక్రితో కలిసి తొలిసారి నటించా. కొంత టెన్షన్‌ ఉండేది. అయితే, ఈ చిత్రంలో మేమిద్దరం పోటీ పడి నటించాం. వారిద్దరితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉండేది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details