Ali tho saradaga latest promo: లంచ్ బ్రేక్‌లో వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చేశానని నటి ఐశ్వర్య చెప్పారు. 'ఆలీతో సరదాగా' టాక్ షోకు వచ్చిన ఆమె.. తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈమె ప్రముఖ నటి లక్ష్మి కుమార్తె. తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఐశ్వర్య.. గుర్తింపు కూడా తెచ్చుకుంది.
తనను యాక్టింగ్‌వైపు వెళ్లొద్దని, కుటుంబం పేరు, అమ్మ పేరు చెడగొట్టొద్దని బంధువులు అన్నారనే ప్రశ్నకు ఐశ్వర్య సమాధానమిచ్చారు. తను అసలు ఇండస్ట్రీలోకి నటిగా వస్తానని అనుకోలేదని చెప్పారు.
సినిమా కెరీర్లో ఎంతమందిని కొట్టుంటారు అని అలీ అడగ్గా.. 'ఒకడిని మాత్రం కొడదామని అనుకున్నా కానీ ఎందుకులే చచ్చిపోతాడని ఓ డైరెక్టర్‌ను వదిలేశా' అని ఐశ్వర్య చెప్పారు. ఆ తర్వాత అన్ని మరిచిపోయి అతడిని మంచిగా పలకరిస్తే, తన గురించి చెత్తచెత్తగా మాట్లాడాడని.. అతడిని ఎందుకు వదిలేశానా అని అప్పుడు అనిపించిందని ఆమె గతంలో జరిగిన విషయాన్ని వెల్లడించారు. అందరూ డైరెక్టర్లు తనకు గురువులని, ఆ ఒక్క డైరెక్టర్ తప్పని ఐశ్వర్య చెప్పారు.