'వన్: నేనొక్కడినే' మూవీలో దర్శకుడు సుకుమార్‌కు 'యు ఆర్ మై లవ్' పాట రాయడానికి తనకు 29 రోజులు పట్టిందని, అదే సుకుమార్-దేవిశ్రీ కాంబోలో వచ్చిన 'రంగస్థలం'లో ఒక్కో పాట కేవలం 30 నిమిషాల్లో రాసేశానని ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. అలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన సందడి చేశారు. ఆ చిత్రంలోని ఆరు పాటలు కూడా కాగితంపై కలం పెట్టి రాయలేదని ఈ సందర్భంగా వివరించారు. తాను పాటలు రాయడం మొదలు పెట్టిన తర్వాత ఏడాది పాటు ఊరికి వెళ్లలేదని, అప్పుడు తన తండ్రి 'ఏం చేస్తున్నావు' అని అడిగితే 'సినిమాలకు పాటలు రాస్తున్నా' అని చెప్పానన్నారు. అది విన్న తన తండ్రి 'చిరంజీవిగారు ఇతర హీరోలు వాళ్లు రాసుకుంటారు కదా, నువ్వెందుకు రాయడం' అని అన్నారని నవ్వుతూ చెప్పారు.
సింగిల్ టేక్ సింగర్ అని ప్రశంసించిన సంగీత దర్శకుడు ఎవరు? అన్న ప్రశ్నకు చంద్రబోస్ సమాధానం ఇస్తూ.. "కొమరం పులి' మూవీ కోసం అన్నీ పాటలు నేనే రాశా. అందులో 'పవర్‌స్టార్'(pawan kalyan) అంటూ సాగే గీతాన్ని ఓ గాయకుడు పాడుతున్నాడు. ఆయనకు తెలుగు పదాలు ఉచ్ఛరించడం సరిగా రాకపోతే పక్క నుంచి నేను చెబుతున్నా. అది చూసి రెహమాన్‌గారు. 'మీరు పాడతారా' అని అడిగారు. ఐదు నిమిషాల్లో ట్రాక్ పాడేశా. అది విని 'సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌ల్లా.. మీరు సింగిల్ టేక్ సింగర్' అని మెచ్చుకున్నారు" అంటూ ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు చంద్రబోస్. తొలిసారి పాటలు రాయడానికి వెళ్తే 'ఎందుకొస్తారయ్యా' అని చంద్రబోస్‌ను అన్నది ఎవరు? ఆయనకు తొలి అవకాశం ఎలా వచ్చింది? అలీ మీద రాసిన పాట ఏంటి? దర్శకుడు రాఘవేంద్రరావుకు ఎలాంటి పాటలంటే ఇష్టం? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే వచ్చే సోమవారం వరకూ వేచి చూడాల్సిందే! అప్పటివరకూ ఈ ప్రోమో చూసేయండి!