తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'16 పేజీల డైలాగ్​.. సింగిల్​ టేక్​లో చెప్పేసింది' - alitho saradaga news

ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో బుల్లితెర జోడీ జాకీ, హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి జీవితంలో జరిగిన కొన్ని విశేషాలను పంచుకున్నారు.

alitho saradaga interview with Jackey and Haritha
'16 పేజీల డైలాగ్​.. సింగిల్​ టేక్​లో చెప్పేసింది'

By

Published : Jan 15, 2021, 10:33 AM IST

'మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' అనే మాట వీళ్ల కోసమే పుట్టిందనుకుంటా. పర్సనల్‌గానే కాదు ప్రొఫెషనల్‌గా కూడా వారిద్దరి ప్రపంచం ఒక్కటే. ఏన్నో ఏళ్లుగా ఈ జంట తమదైన శైలిలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. వారే జాకీ(జానకి రామ్‌), హరిత. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.

జానకిరామ్‌ జాకీగా ఎప్పుడు మారారు?

జాకీ:కాకినాడలో నేను మెక్లైన్‌ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు హెప్సిబా అనే టీచర్‌ షార్ట్‌కట్‌లో నా పేరును అలా పిలిచేవారు.

చిత్ర పరిశ్రమలో మీ ప్రస్థానం ఎలా మొదలైంది?

జాకీ:ముందు కెమెరామెన్‌గా జాయిన్‌ అయ్యాను. అ తర్వాత మా గురువుగారు సత్యారెడ్డి నటుడిగా అవకాశమిచ్చారు. అంతకంటే ముందు నా మిత్రుడు డైరెక్టర్‌ విజయ్‌భాస్కర్‌ 'ప్రార్థన' అనే చిత్రంలో అవకాశమిచ్చారు. అది చూశాక సత్యారెడ్డి 'దొంగలున్నారు' అనే చిత్రంలో నన్ను హీరోగా పెట్టారు. ఆయనే నాకు హార్స్‌ రైడింగ్‌, డ్యాన్స్‌ వంటి వాటిల్లో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత సీరియల్స్‌లోకి వచ్చాను. ఇక్కడ బాగా సక్సెస్‌ అయ్యాను.

మీ కుటుంబం గురించి..

జాకీ:నాన్న 20 ఏళ్ల క్రితం, అమ్మ మూడేళ్ల క్రితం మరణించారు. నాకు ఒక అన్న, తమ్ముడు ఉన్నారు. ఇద్దరికి కాకినాడలోనే సొంత వ్యాపారం ఉంది. నేను ఈ రంగంలోకి రావడానికి ముఖ్య కారణం మా మావయ్య రఘురామ్‌.

శాంతి..హరితగా ఎలా మారింది?

హరిత:చిన్నప్పడు చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని. ఇది చూసి మా అమ్మ నాకు పేరు మారిస్తేనైనా ఉత్సాహంగా ఉంటానని అనుకుంది. ఆ ఉద్దేశంతోనే హరితగా పేరు మార్చింది. ఆ తర్వాత తమిళ్‌లో 'నందవనం' అనే సీరియల్‌లో నటించాను. అది హిట్టయింది. అప్పుడు స్క్రీన్‌పై హరిత అనే పేరే వేశారు.

మీరు హీరోయిన్‌గా నటించిన సినిమా?

హరిత:అల్లు ఆర్ట్స్‌ నిర్మించిన 'డబ్బు భలే జబ్బు'అనే చిత్రంలో హీరోయిన్‌గా చేశాను. ఆ తర్వాత తమిళ్‌, ఒడియా, కన్నడ చిత్రాల్లో నటించాను. తెలుగులో సోదరి పాత్రలో 'చినరాయుడు', 'ప్రెసిడెంటుగారి పెళ్లాం', 'దొంగా-పోలీస్‌' సహా 20 చిత్రాల్లో నటించాను. అటు నుంచి సీరియల్స్‌లో నటిస్తూ సక్సెస్‌ చూశాను.

మీకు ఏ రంగంలో సంతృప్తి అనిపించింది?

ఇద్దరూ:టీవీ పరిశ్రమలోనే బాగా సంతృప్తిగా అనిపించింది.

పిల్లలు ఎంతమంది?

హరిత:ఇద్దరు పిల్లలు. బాబు ఇంటర్మీడియట్‌ సెకండియర్‌, పాప ఎనిమిదో తరగతి చదువుతోంది.

మీ అమ్మగారు సినిమాల్లో నటించారనుకుంటా?

హరిత:అవును. మా సొంతూరు గుడివాడ. అన్నయ్య ముందు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ అంతా చెన్నైకు మారింది. అప్పటి నుంచి అమ్మ కూడా చిన్నపాత్రల్లో నటించడం మొదలుపెట్టింది. కె.విశ్వనాథ్‌గారు, విజయబాపినీడు గారి సినిమాల్లో మంచి పాత్రలు చేసింది. చెల్లి, నేను నటించడం మొదలుపెట్టాక మమ్మల్ని చూసుకుంటూ ఉండేది.

రన్నింగ్‌ ట్రైన్‌పై జంప్‌ చేసుకుంటూ వెళ్లేవారంటా?

జాకీ:అవును. అప్పట్లో రైల్వేస్టేషన్‌ పక్కనే మా ఇల్లు. డీజిల్‌తో నడిచే గూడ్స్‌రైళ్లు ఎక్కువగా తిరుగుతుండేవి. సినిమాల ప్రభావం నాపై బాగా ఉండటం వల్ల కాకినాడ నుంచి సామర్లకోట నడిచే ట్రైన్‌ బోగిలపై అటు ఇటూ దూకుతూ తిరిగేవాడిని. మా పనిమనిషి చూసి నాన్నకు చెబితే, ఇంటికెళ్లగానే ఆయన నన్ను బెల్టుతో ఇరగదీశారు. మాది ఉమ్మడి కుటుంబం సుమారు 35మంది దాకా ఒకే ఇంట్లో ఉండేవాళ్లం.

జాకీలో హరితకు నచ్చిన, నచ్చని అంశాలేంటి?

హరిత:నచ్చిన విషయమైతే నాపట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. నాకు ఏ సమయానికి ఏం కావాలో చూసుకుంటారు. నాకు మరో అమ్మలా జాకీ ఉంటారు. ఇక నచ్చని విషయాలకు వస్తే నన్ను ఎక్కడికి తీసుకెళ్లారు. ఒక సినిమా అని, షికారని ఏమీ ఉండదు.

హరిత గురించి జాకీ అభిప్రాయం?

జాకీ:వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటుంది. ఎప్పుడూ శక్తిమేరకు నటించాలని అనుకుంటుంది. మొదట్లో ఆమె మాతో షూటింగ్‌ చేసేటప్పుడు నటుడు మహర్షి డైరెక్టర్‌ వాసును ఇలా అడిగారు. 'ఏం సార్‌ చెన్నై నుంచి తీసుకొచ్చారు. అంత బాగా నటిస్తుందా అని' దానికి ఆయన స్పందిస్తూ షూట్‌లో నువ్వే చూస్తావుగా అన్నారు. ఆయన అన్నట్టుగానే 16పేజీల డైలాగ్‌ను ఒకే టేక్‌లో చెప్పేసింది. ఆ సీన్‌లో ఆమెతో పాటు చేస్తున్న నాకు మైండ్‌ బ్లాక్‌ అయిపోయి నా డైలాగ్స్‌ మర్చిపోయాను. అంత జ్ఞాపకశక్తి తనది. గాసిప్స్‌ గురించి అస్సలు పట్టించుకోదు. పెద్దలంటే చాలా గౌరవంగా ఉంటుంది. ఎవ్వరి గురించి ఆరాలు తియ్యదు. ఇక నచ్చని విషయం అంటే కొన్ని విషయాల్లో మొండి పట్టు పడుతుంది.

ముందు ప్రపోజ్‌ చేసిందెవరు?

జాకీ:ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలుసు. అయినా నటిస్తూ ఉండేవాళ్లం. మీ ఇంట్లో సంబంధాలు ఏవైనా చూస్తున్నారా! అంటూ సరదాగా ప్రశ్నించుకునేవాళ్లం.

హరిత:అయితే ఇంట్లో పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకోవాలని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాం. ఇద్దరి పెద్దవాళ్లు సరేననడం వల్ల వివాహాం చేసుకున్నాం. వారిని ఎదిరించి పెళ్లి చేసుకోవటం గురించి ఎప్పుడూ మేం మాట్లాడుకోలేదు.

రవళి మీకంటే ముందే నటనలోకి వచ్చిందా?

హరిత:లేదు. నేను నటన వృత్తిలోకి వచ్చిన రెండేళ్లకు రవళి నటించడం ప్రారంభించింది. తను చాలా చురుకుగా ఉండేది. 1996లో 'పెళ్లిసందడి' చిత్రంలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

జాకీ, హరితల మొదటి పరిచయం ఎక్కడ?

హరిత:ఈటీవీలో 'సంఘర్షణ' సీరియల్‌లో ఇద్దరం కలిసి నటించాం. అప్పుడు చెన్నై నుంచి షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ ఫిల్మ్‌సిటీకి వచ్చేవాళ్లం. అప్పట్లో నేను చాలా డైటింగ్‌ చేసేదాన్ని. ఆ క్రమంలోనే సెట్‌లో ఒక ఫుడ్‌ ఐటమ్‌ తిన్నప్పుడు అస్వస్థతకు గురయ్యాను. నేను బాగా నీరసించి ఉన్న పరిస్థితి చూసి జాకీ కొబ్బరి నీళ్లు పంపించారు. అప్పుడే అనిపించింది ఒక మనిషిని అర్థం చేసుకునే తత్వం ఆయనలో ఉందని. ఆ తర్వాత ఇద్దరం కలిసి దూరదర్శన్‌లో 'వైదేహి' అనే సీరియల్‌లో కూడా నటించాం.

జాకీ:అప్పుడు అవుట్‌డోర్‌ షూటింగ్‌కు కాకినాడ వెళ్లాం. మా కజిన్స్‌ ఇళ్లల్లోనే షూటింగ్‌ జరుగుతూ ఉండేది. మా వాళ్లంతా తనని చాలా అప్యాయంగా చూసుకునేవారు. ఆ తర్వాత తనను మా ఇంటికి తీసుకెళ్లి మా అమ్మకు పరిచయం చేశా.

జాకీ భవిష్యత్‌ ప్రణాళికలు?

జాకీ:'అక్షరం'అనే చిత్రాన్ని రచించి, నిర్మించాను. జాతీయ అవార్డు ఎంపికలకు కూడా పంపాను. ప్రస్తుతమున్న విద్యావ్యవస్థలో ఉన్న లోపాలు, పిల్లలను చదివించుకోవడంలో తల్లిదండ్రులు పడుతున్న కష్టాలపై ఈ చిత్రాన్ని తీశాను. ఓటీటీ వేదికపై త్వరలో విడుదల కావచ్చు. అలాగే 'పరదా' అనే మరో సినిమాను కూడా తెరకెక్కించే పనిలో ఉన్నాను. 'అక్షరం' అనే సినిమాలో 'అ' నుంచి 'ఱ' వరకూ అర్థాలు తెలుపుతూ ఒక మంచి సాంగ్‌ ఉంది.

గొడవలు పడితేనే ప్రేమ ఉన్నట్టా?

జాకీ,హరిత:కచ్చితంగా ప్రేమ ఉన్న చోటే మన అనుకునే చనువు ఉంటుంది. అప్పుడు ఎవరు ఎవర్ని పట్టించుకోకపోయినా గొడవపడి మరీ మన పట్ల శ్రద్ధ వహించేలా చూస్తాం.

తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తుపై?

జాకీ,హరిత:వారికి నచ్చింది చేసే స్వేచ్ఛనిస్తాం. ఫలానా రంగంలోనే స్థిరపడాలని మాత్రం బలవంతం చెయ్యం. మంచి విద్యను అందిస్తున్నాం.

ఇద్దరి పిల్లల్లో ఎవరు బాగా చురుకు?

హరిత:పాప తెలివిగా ఉన్నట్టు నటిస్తుంది. కానీ బాబే తెలివైన వాడు. అతనికి కుల, మత భేదాలంటే అస్సలు పడవు. ఎక్కడైనా చెప్పాల్సివస్తే 'నేనొక ఇండియన్‌' అని చెబుతాడు.

శోభన్‌బాబుగారి అబ్బాయంటూ పిలిచేవారంట కదా?

జాకీ:అవును. కొంచెం నాలో శోభన్‌బాబు గారి పోలికలు ఉండేవి. ముఖ్యంగా సత్యారెడ్డి గారైతే నన్ను చాలా బాగా చూసుకునేవారు. బాగా ప్రోత్సహించేవారు.

అమ్మ మీ దగ్గరే ఉంటున్నారా?

హరిత:అమ్మ ఎప్పుడూ వేరుగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. మా ముగ్గురిలో ఎవరి దగ్గరా ఉండదు. నా జీవితంలో అమ్మ సగం, జాకీ సగం ఉంటారు. ఎప్పటికీ అమ్మను మరువలేను(కొంచెం ఎమోషనల్‌ అయ్యారు). జాకీ నా పుట్టింటిని మరిపించేంత బాగా చూసుకుంటారు. అన్ని విషయాల్లోనూ తోడుంటారు.

మద్రాసులో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయా?

జాకీ:ఆర్థిక ఇబ్బందులు పడిన దాఖలాలు పెద్దగా ఏమీ లేవు. ఎందుకంటే ఆర్థికంగా కొంచెం ఉన్నతమైన కుటుంబం నుంచే వచ్చాం. అయితే ఇంట్లోవాళ్లు వద్దన్న పనిలో ఉన్నాను. కచ్చితంగా విజయం సాధించాలనే తపన ఉండేది. మా మామయ్య రఘురామ్‌ నన్నెప్పుడూ ప్రోత్సహిస్తూ, అమ్మనాన్నలకు నచ్చజెప్పేవారు.

హరిత బాగా పాటలు పాడుతుందటా?

హరిత:అంత బాగా ఏంకాదు. కొంచెం ప్రాక్టీసు చేస్తాను. మా ఆయనకు వినిపించాలని.. అంతే

టీవీ అర్టిస్టులు సినిమాల్లో రాణించగలరా?

జాకీ:అస్సలు ఆ సమస్యే లేదు. కచ్చితంగా రాణించగలరు. దివంగత నటుడు సుశాంత్, ప్రకాష్‌రాజ్‌, షారుక్‌ఖాన్‌ వంటి వారు బాగా రాణించిన వారే కదా! టీవీ సీరియల్లో రోజుకు 10, 12 సీన్లు ఉంటాయి. ఎక్స్‌ప్రెషన్‌ ఎప్పుడూ మారుతూ ఉండాలి. హరిత ప్రకాష్‌రాజ్‌తో పోటాపోటీగా నటించేది. అయినా టీవీ రంగంలో ఇంత బిజీగా ఉన్నప్పుడు కొత్తగా సినిమాల వైపు చూడాల్సిన అవసరం లేదు.

ABOUT THE AUTHOR

...view details