తెలంగాణ

telangana

'ప్రతి ఒక్కరూ డబ్బుకు విలువ ఇవ్వాలి.. నాపై ఆ విమర్శలు నిజమే'

By

Published : Nov 30, 2021, 10:56 AM IST

Updated : Nov 30, 2021, 12:00 PM IST

ప్రతి ఒక్కరూ డబ్బుకు విలువ ఇవ్వాలని, అలాంటప్పుడే కష్ట సమయంలో సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాదని అన్నారు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (Alitho Saradaga Brahmanandam). 'అలీతో సరదాగా' షోకు విచ్చేసిన ఆయన సందర్భంగా అనేక విశేషాలను పంచుకున్నారు.

alitho saradaga
బ్రహ్మానందం

Alitho Saradaga Brahmanandam: 1254 సినిమాలు.. 422మంది దర్శకులతో అనుబంధం.. వందల పురస్కారాలు..తెలుగు సినిమాకే గర్వకారణంగా నిలిచిన లెజండరీ కమెడియన్‌.. బ్రహ్మానందం. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. "డబ్బుకు చాలా విలువ ఇస్తారట?!" అని అలీ అడిగిన ప్రశ్నకు వివరంగా సమాధానమిచ్చారు బ్రహ్మానందం.

" ఫిల్మ్‌ ఇండస్ట్రీ వాళ్లేకాకుండా, ప్రతి ఒక్కరూ డబ్బుకు విలువ ఇవ్వాలి. 'భార్యామూల మిదం గృహం/కృషి మూలమిదం ధాన్యం/ ధనమూలమిదం జగత్' అన్నారు. అన్నింటికీ డబ్బే. చాలా మందికి డబ్బు విలువ తెలియదని నేను అనను. దాని విలువ తెలుసుకోవటానికి ప్రయత్నం చేయరు. ఇటీవల కరోనా వచ్చింది. చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరు సాయం చేస్తారా? అని ఎదురు చూశారు. ఇదంతా ఎందుకు? నాకు తెలిసి రోజుకు రూ.1,250కన్నా తక్కవకు పనిచేసే టెక్నీషియన్‌ ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అందులో రూ.100 పక్కన పెట్టి వచ్చిన దాంతో సంతృప్తి పడితే, ఏ కష్టకాలం వచ్చినా, ఏ బాధ మనకు వచ్చినా, సాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాదు. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లను మనం చూశాం. రాజనాల, కాంతారావు, సావిత్రలాంటి మహా నటులు కోట్లాది రూపాయలు సంపాదించారు. చివరికి ఏమీలేని స్థితికి వెళ్లిపోతున్నారు. పెద్దవాళ్ల నుంచి ఏం నేర్చుకోవాలో కాదు. ఏం నేర్చుకోకూడదో అది నేర్చుకోవాలి. అందుకే డబ్బుకు విలువ ఇస్తా. ధనాన్ని నువ్వు ప్రేమిస్తే, అది నిన్ను ప్రేమిస్తుంది."

- బ్రహ్మానందం, హాస్యనటుడు

ఇక తక్కువ గంటలే పనిచేస్తారు అన్న మాటల పై స్పష్టతనిచ్చారు (brahmanandam comedy) బ్రహ్మానందం. "ఎప్పుడంటే అప్పుడు నిద్రలేచి స్నానాలు చేసి, రెడీ అయిపోయేవాళ్లం. అందుకే చాలా మంది 'బ్రహ్మానందం 9గంటలకు వస్తాడండీ. ఆరు గంటల తర్వాత వెళ్లిపోతాడండీ. మధ్యాహ్నం 1గంట నుంచి 2 గంటల వరకూ పనిచేయడండీ' అంటారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. 35ఏళ్ల పాటు రోజుకు మూడు, నాలుగు షిఫ్ట్‌లు పనిచేశా. రోజూ మూడు రాష్ట్రాల్లో చేసేవాడిని. తిని, తినక తిప్పలు పడి, తిన్నది అరగక వాంతులు అయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కొన్నా. ఇంతకాలం శరీరం కష్టపడిన తర్వాత దానికి కూడా విశ్రాంతినివ్వాలి కదా! డబ్బులు వస్తున్నాయి కదాని షూటింగ్‌లు చేయకూడదు. భగవంతుడు ప్రాణంతో పాటు శరీరం కూడా ఇచ్చాడు. దాన్ని కాపాడుకోవాలి. అందుకే 'నేను ఈ సమయానికి వస్తా. ఇప్పటివరకే పనిచేస్తా. ఇష్టమైతే పెట్టుకోండి. లేకపోతే లేదు' అని నన్ను నేను తగ్గించుకున్నా." అని వివరించారు బ్రహ్మానందం.

ఇదీ చూడండి:వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా: బ్రహ్మానందం

Last Updated : Nov 30, 2021, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details