బాలనటి, హీరోయిన్, చెల్లెలి పాత్రలలో ఒదిగిపోయి కలకాలం గుర్తుండిపోయిన నటి.. దక్షిణాది భాషలలో 100కుపైగా చిత్రాల్లో నటించారు.. 'శ్రీవారికి ప్రేమలేఖ', 'నాలుగు స్తంభాలాట', 'ముద్దమందారం' లాంటి సినిమాలతో తెలుగు వారిని ఆకట్టుకున్న నటి సుధ అలియాస్ పూర్ణిమ. 'ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య'లో చిరంజీవితో నటించి మెప్పించారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విశేషాలు పంచుకున్నారిలా...!
సుధ పేరు పూర్ణిమగా ఎలా మారింది..? అసలు పేరేంటి..?
పూర్ణిమ: మలయాళంలో సుధగా పరిచయమయ్యాను. తెలుగులో పూర్ణిమగా మారిపోయా. అసలు పేరు పూర్ణిమనే. నాన్న కాకినాడలో పనిచేశారు. వృత్తిరీత్యా ఆయన చెన్నై వెళ్లడంతో అక్కడే పుట్టా.
‘రాణి రాణమ్మ’ నవ్వులు కొనసాగుతున్నాయా?
పూర్ణిమ: ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆ నవ్వులు కొనసాగుతున్నాయి. మా ఆయన బాగా చూసుకుంటారు. మాకు ఇద్దరు పిల్లలు. మా ఆయన అదాని సంస్థలో డీజీఏంగా చేస్తారు. ఇప్పుడు అందరం హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. ప్రస్తుతం 'రంగులరాట్నం' సీరియల్ చేస్తున్నా. చివరి చిత్రం తరువాత కొంత గ్యాప్ వచ్చింది.
యాక్టర్ కాకముందు సింగర్ అవుదామనుకున్నారా..?
పూర్ణిమ: అవును. కొన్ని ప్రదర్శనలు కూడా ఇచ్చా. పాటలంటే చాలా ఇష్టం. సినిమాల్లో అవకాశాలు రావడంతో పాటలు పాడటం ఆపేశాను. తమిళంలోనే పాటలు పాడాను. మౌనరాగంలోని పాటలు ఇష్టం. తెలుగులో శ్రీవారికి ప్రేమలేఖ చాలా నచ్చింది.
‘ముద్దమందారం’ అవకాశం ఎలా వచ్చింది..?
పూర్ణిమ: ముందు ‘సప్తపది’ చేయాల్సింది. ఆ పాత్రకు నృత్యం రావాలి. నాకు డ్యాన్సు రాదు. ఆ తర్వాత జంధ్యాల గారు పిలిచి మాట్లాడారు. ‘ముద్ద మందారం’ సినిమాకు ఆడిషన్స్ చేసి, అవకాశం ఇచ్చారు. అది పెద్ద హిట్. ఎప్పటికి గుర్తుండిపోయింది. తర్వాత ‘నాలుగు స్తంభాలాట’ చేశా.
జంధ్యాలతో ఎన్ని సినిమాలు చేశారు..?
పూర్ణిమ: ఐదు సినిమాలు చేశా. ముద్దమందారం. నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడిబొమ్మ, మల్లెపందిరి.
ఏ డైరెక్టర్‌తో ఎక్కువగా అనుకూలంగా ఉండేది..?
పూర్ణిమ: ఎక్కువగా కోడి రామకృష్ణతో అనుకూలంగా ఉండేది. నవ్వుతూనే నటించేలా చేసేవారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా అనుభవం ఎంతో గొప్పది. చిరంజీవితో నటన, డ్యాన్సు కూడా బాగా చేయించారు. జంధ్యాలతోనూ బాగా పని చేశా.
హీరోయిన్‌గా చేస్తూ చెల్లెలి పాత్ర అంటే ఒప్పుకునేవారా..?
పూర్ణిమ: అన్నీ ఒప్పుకునేదాన్ని. కృష్ణగారితో హీరోయిన్‌గా చేయలేను. అందుకే చెల్లెలి పాత్ర వేశా. నాగేశ్వరరావుగారికి కూతురుగా నటించా. శివకృష్ణతో ఆడపడుచుగా నటించిన తీరు మరచిపోలేను.
'మా పల్లెలో గోపాలుడు' తర్వాత మళ్లీ అర్జున్‌తో సినిమా చేయలేదు..?
పూర్ణిమ: ఆ సినిమా హిట్. ఆ తర్వాత ఒక సినిమా చేసినా చిన్నది. ఎందుకో కలిసి రాలేదు.
సావిత్రిగారితో నటించారట..?
పూర్ణిమ: ఆమెతో మొదట డాక్యుమెంటరీ చేశా. అది నా అదృష్టం. సావిత్రిగారు చనిపోయే సమయానికి ఆమెతో కలిసి నటించా. నటనకు సంబంధించి ఎన్నో సూచనలు చేశారు.
ప్రేమ పెళ్లా..? పెద్దలు కుదిర్చారా..?
పూర్ణిమ: సినిమా నటినని ఆరు సంబంధాలు పోయాయి. ఎవరూ చేసుకోవడానికి సుముఖత చూపలేదు. అసలు పెళ్లి అవుతుందా అనుకున్నా. ఇక కుమారిగానే ఉండిపోవాల్సిందేనని భావించా. ఆయన ఒకరోజు మా అంకుల్ వాళ్ల ఇంటికి వచ్చారు. మా అమ్మ నన్ను పిలిచి ‘అబ్బాయి బాగున్నాడు. వెళ్లి చూడు’ అని చెప్పింది. ఇతను వెళ్లిపోతాడులే అనుకున్నా. సినిమా నటినని వద్దంటారనుకున్నా. వాళ్లు ఒప్పుకున్నారు. 1998లో పెళ్లి అయ్యింది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుందామనుకుని సినిమాలు చేయలేదు.