తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''చంద్రముఖి' నేనే చేయాల్సింది.. కానీ'!

తేజ దర్శకత్వంలో నటించిన తన తొలి తెలుగు సినిమా 'జయం'లో అవకాశం ఎలా వచ్చిందో వివరించారు నటి సదా(Sadha). తాను దిగిన చెత్త ఫొటోలను చూసి తేజ సినిమా ఛాన్స్​ ఇచ్చారని హాస్యస్పదంగా చెప్పారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) కార్యక్రమానికి ఈ వారం అతిథిగా విచ్చేసిన సదా.. ఆమె వ్యక్తిగత విషయాలతో పాటు సినీ విశేషాలను వెల్లడించారు.

Actress Sadha Interview in Alitho Saradaga
హీరో మనోజ్​.. సదాను ర్యాగింగ్​ చేశాడా?

By

Published : Jul 1, 2021, 3:45 PM IST

'వెళ్లవయ్యా..వెళ్లూ' అంటూ 'జయం' సినిమాతో తన సక్సెస్‌ ట్రాక్‌ను మొదలుపెట్టి, దక్షిణాదిన సూపర్‌ సక్సెస్‌ సాధించిన నటి సదా. యువతకు ఇష్టసఖిగా అలరించిందీ ముద్దుగుమ్మ. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె పంచుకున్న కబుర్లేంటో చూద్దాం..

సదా పూర్తి పేరేంటి?

సదా:సదా మహమ్మద్‌ సయ్యద్‌.

స్వస్థలం ఎక్కడ?

సదా:ముంబయి, గోవా హైవే మధ్యలో ఉండే రత్నగిరి అనే చిన్న టౌన్‌ మాది.

అమ్మానాన్నలు ఏం చేస్తారు?

సదా:నాన్న డాక్టర్‌, అమ్మ ప్రభుత్వాధికారి.. వాళ్లది ప్రేమ వివాహం. అమ్మ హిందూ, నాన్న ముస్లిం. కుటుంబాలను వదిలేసి రత్నగిరికి వచ్చేశారు. అద్దె గదిలోనే జీవితం ప్రారంభించారు. నేను పుట్టిన ఆరు నెలలకే సొంతిల్లు కట్టుకున్నారు.

ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు?

సదా:చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌, డ్యాన్స్‌ అంటే ఆసక్తి ఉండేది. పదో తరగతిలో ఒక ఎమ్మెల్యే నన్ను చూసి సినిమా అవకాశం ఇస్తానన్నారు. కానీ అప్పుడు అమ్మానాన్న ఒప్పుకోలేదు. అప్పటినుంచే సినిమా ఆలోచన బలంగా నాటుకుపోయింది. ఇంజినీరింగ్‌ కోసం ముంబయికి వచ్చాను. అక్కడ యాక్టింగ్‌ స్కూల్‌ కనిపిస్తే అమ్మతో చెప్పి జాయిన్‌ అయ్యాను. ముందు నేను యాక్టింగ్‌ నేర్చుకోవడం టైం వేస్ట్‌ అన్నారు. కానీ అమ్మ కావాలనే చేర్పించింది. ఫొటోస్‌ అడిగితే వారం రోజుల్లో ఇచ్చాను. అవి చాలా దరిద్రంగా వచ్చాయి. కానీ విచిత్రంగా ఆ ఫొటోస్‌ వల్లే 'జయం'లో చేసే అవకాశం వచ్చింది.

మొదటి సినిమా అదేనా?

సదా:'జయం' కన్నా ముందు ఒకటి చేశాను. అది సగం షెడ్యూల్‌ పూర్తయ్యాకనే తేజ గారు నన్ను చూసేందుకు ముంబయికి వచ్చారు. ఆయన్ని కలిసేందుకు జీన్స్‌లోనే వెళ్లాను. నన్ను చూసిన వెంటనే ఓకే చేశారాయన. అది అంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదు.

'వెళ్లవయ్యా.. వెళ్లూ..' డైలాగ్‌ బాగా పాపులర్‌ అయింది కదా?

సదా:'జయం' సినిమాలో అన్ని సంభాషణలు, సన్నివేశాలు ఒకే టేక్‌లో చేశాను. కానీ 'వెళ్లవయ్యా.. వెళ్లూ' సీన్‌ మాత్రం డైరెక్టర్‌ అనుకున్నట్టు రావట్లేదు. అప్పుడు తేజ గారు.. "నేను చెప్పినట్లు చేస్తే.. నువ్వు ఎక్కడో ఉంటావు. నేను ఎలా చెబితే అలాగే చేయాలి" అని గట్టిగా చెప్పారు. నేను అలాగే చేసి చూపాను. అది ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే.

ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయి?

సదా:నిజానికి ఆ సినిమా వచ్చిన మూడు నెలల వరకు ఎలాంటి అవకాశాలు రాలేదు. ఆ తర్వాతే సినిమా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. 'నాగ'లో నటించే అవకాశం వచ్చింది. ఓ ప్రొడక్షన్‌ హౌస్‌లో మూడు సినిమాలకు కాంట్రాక్ట్‌ వచ్చింది. అవి కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయి.

ఇన్నేళ్ల ప్రయాణంలో చూసిన అద్భుతాలేంటి?

సదా:'జయం' సినిమా నా జీవితంలో జరిగిన అద్భుతం. శంకర్‌ సర్‌ దర్శకత్వంలో 'అపరిచితుడు' చేసే అవకాశం రావడం మరో మైలురాయి. అందులోని రోల్ గత చిత్రాల్లోలాగే పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. కానీ 'నీకు నాకు.. నోకియా' పాటలో వాటికి భిన్నంగా ఆధునిక యువతిగా కనిపిస్తాను.

విక్రమ్, సదా మధ్యలో అన్నాచెల్లెళ్ల అనుబంధం ఏంటి?

సదా:అందరూ విక్రమ్‌ను అన్నా అని పిలుస్తున్నారని నేనూ అలానే పిలిచా. 'అయ్యంగారి ఇంటి సొగసా' పాట షూటింగ్‌ చేస్తున్నప్పుడు విక్రమ్‌ నన్ను చెల్లీ అని సంబోధించారు. ఇది విన్న శంకర్‌ ఈ విషయం బయటకు వెళితే నా సినిమా ఎవరూ చూడరన్నారు. ఇక అప్పటినుంచి అలా పిలుచుకోవడం మానేశాం.

'అపరిచితుడు'లో నటించే అవకాశం ఎలా వచ్చింది?

సదా:నేను బ్యాంకాక్‌లో ఓ కన్నడ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ వచ్చింది. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ శంకర్‌ సర్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్లు వచ్చాయని అమ్మ చెప్పింది. ముందు ఎవరో ప్రాంక్‌ చేస్తున్నారని అనుకున్నాను. కానీ మాటల్లో శంకర్‌ సర్‌ అని తెలిసిపోయింది.

ఏదో ఒక సినిమాకు కాస్ట్యూమ్‌ సరిపోలేదని ఫ్లైట్‌లో వెనక్కి పంపించారంట?

సదా:మొదట్లో కొన్ని కాస్ట్యూమ్స్ మోడల్స్‌ చూపించి ఇలాంటి దుస్తుల్లో నటిస్తారా? అని అడిగారు. అందులో కొన్నింటిని ఓకే చేసి అంతకు మించి గ్లామరస్‌గా కనిపించలేనని చెప్పేశాను. శంకర్‌ సర్‌ కూడా ఓకే చేశారు. కాస్ట్యూమ్స్ అన్నీ ముంబయి నుంచి ఫ్లైట్‌లో వచ్చేవి. అయితే 'నీకు నాకు నోకియా' పాట చిత్రీకరణ సమయంలో ఆ కాస్ట్యూమ్స్‌ కొన్ని అసౌకర్యంగా అనిపించాయి. ఇలాంటివి వేసుకొని నటించలేనని చెప్పాను. శంకర్‌ సర్‌ రాత్రికి రాత్రే వాటిని వెనక్కి పంపించి కొత్త కాస్ట్యూమ్‌ తెప్పించారు.

షూటింగ్‌కు ఆలస్యం అయిందని ఓ నటి కెమెరా ముందు ఏడ్చిందట? ఎవరామె?

సదా:అలా ఏడ్చింది నేనే. తేజ గారు గురించి అందరికీ తెలిసిందే. ఆయనలాంటి క్రమశిక్షణను ఏ సెట్‌లోనూ చూడలేదు.

తేజ ఎప్పుడైన కొట్టారా?

సదా:లేదు. అలాంటి పరిస్థితి రానీయలేదు. తేజ గారు ఎలా ఉన్నారో నేనూ అలాగే అంకితభావంతో ఉన్నాను. అయితే 'ఔనన్నా కాదన్నా' చిత్రం షూటింగ్‌కు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వెళ్లాను. నేను వెళ్లేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు. నా కోసం అంతమంది ఎదురు చూడటం చూసి తెలియకుండానే ఏడుపొచ్చేసింది.

'ఆనంద్'‌, 'చంద్రముఖి' ఆఫర్లు వచ్చాయి కదా?

సదా:'చంద్రముఖి'లో రెండుసార్లు అవకాశం వచ్చింది. 'అపరిచితుడు' సినిమా షూటింగ్‌ వల్ల డేట్స్‌ కుదరలేదు. అలా జ్యోతిక చేసిన గంగ పాత్ర మిస్‌ అయింది. రజనీకాంత్‌ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. మళ్లీ వారిని అడిగి చూశాను. కానీ ఆ సమయంలో యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. అలా రెండోసారీ డేట్‌లు కుదర్లేదు. ఆ పాత్రను నయనతార చేశారు.

'ఆనంద్‌' ఎలా మిస్‌ అయింది?

సదా:అది నేనే వదిలేశాను.

శేఖర్‌ కమ్ముల మీద నమ్మకం లేదా?

సదా:నాది సినిమా నేపథ్యం కాదు. నా అనుభవాల మీదే నిర్ణయాలు తీసుకోవాలి. 'జయం' తర్వాత అన్నీ మంచి పాత్రలే చేయాలనుకున్నాను. అలా చేసిన 'ప్రాణం' సినిమా ఫ్లాప్‌ అయింది. ఆ తర్వాత కొత్త దర్శకుడు, కొత్త ప్రొడక్షన్‌ అయితే ఎలా ఉంటుందోనని 'ఆనంద్' సినిమా ఒప్పుకోలేదు.

'ప్రాణం'లో ఒక పాటతోనే చాలా క్రేజ్‌ వచ్చింది కదా?

సదా:'నిండు నూరేళ్ల సావాసం' పాటకు మంచి పేరొచ్చింది. ఆ పాట వినగానే సంతకం చేశాను.

సదా సినిమా చేయాలంటే పాట వినిపించాలి. అంతేనా..?

సదా:అదే ఆ తర్వాత చాలాసార్లు అనిపించింది. కథ కూడా పూర్తిగా వినకుండా చేసిన సినిమా అది. 'ఆనంద్‌' ఒప్పుకోకపోవడానికి కారణమిదే. ఇప్పటికీ 'ప్రాణం' బాగుందంటారు. అప్పుడు ఎందుకాడలేదో తెలియదు.

తోలు ఉత్పత్తులు వాడవని తెలిసింది. కారణమేంటి?

సదా:జంతువులు సజీవంగా ఉన్నప్పుడే చర్మాన్ని యంత్రాలతో ఒలిచేస్తారు. నాణ్యత బాగుంటుందని అలా చేస్తారు. మనకు ఏదైన చిన్నగా గీరుకుపోతేనే భరించలేం. బతికుండగానే చర్మాన్ని ఒలిచేస్తే ఎంతటి బాధ కలుగుతుందో ఊహిస్తేనే వణుకు పుడుతుంది. అందుకే అవి ఉపయోగించను. తోలు ఉత్పత్తులు లేకున్నా మనం చాలా సౌకర్యంగా జీవించొచ్చు. నాలుగేళ్ల క్రితమే పూర్తి వీగన్‌గా మారిపోయాను.

పెళ్లి చేసుకోకపోడానికి ఇదొక కారణమా?

సదా:అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దొరికితే చేసుకుంటాను. కచ్చితంగా వీగన్‌ అయి ఉండాలి. లేదంటే సింగిల్‌గా ఉండిపోతాను. అలా ఉండాల్సి రావడం నిజంగా అదృష్టం.

బిజీగా ఉండే సదా.. ఉన్నపళంగా ఖాళీగా ఎందుకు ఉండాల్సి వచ్చింది?

సదా:నా జీవితంలో 2015 ఏడాది కుదిపేసింది. అప్పటివరకు ఎలాంటి టెన్షన్స్‌ లేకుండా సాగిపోయింది. కుటుంబంలో జరిగిన ఓ ఘటన వల్ల సినిమా కోసం ఎవరు ఫోన్‌ చేసినా ఆసక్తిలేదని చెప్పేసేదాన్ని.

ఏమైంది? మాతో పంచుకోకూడనిదా?

సదా:మా అమ్మ పుట్టినరోజునే ఆమెకు క్యాన్సర్‌ ఉందని తెలిసింది. కొన్నాళ్లకు ఆ క్యాన్సర్‌ నాలుక నుంచి గొంతు వరకు వ్యాపించింది. ఆ చికిత్స చాలా బాధాకరమైంది. ఆ తర్వాత తినడం కూడా కష్టంగా మారిపోయింది. క్యాన్సర్‌ అని తెలిసినప్పుడు వణికిపోయాం. అమ్మ మాత్రం చాలా ధైర్యంగా ఉండేది.

'జయం' చేస్తున్నప్పుడు యాక్సిడెంట్‌ అయింది కదా?

సదా:'జయం' సమయంలో రెండు యాక్సిడెంట్లు అయ్యాయి. అందులో ఒకటి అమ్మ వల్లే అయింది. ఓ సన్నివేశంలో గోడ మీద నుంచి దూకాలి. అప్పటివరకు ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. మా నాన్న వద్దని అంటే, అమ్మ మాత్రం దూకేయమంది. దీంతో భయంగానే దూకేశాను. కిందపడ్డాక మోకాలు, దవడకు బలంగా తగిలి గాయమైంది. రెండు రోజులు ఆ గాయం ఇబ్బంది పెట్టింది. 'జయం' షూటింగ్‌ కోసమే చిత్తూరు నుంచి పూతలపట్టుకు సుమోలో వెళ్తున్నప్పుడు మరో ప్రమాదం జరిగింది. సుమో మూడు పల్టీలు కొట్టింది. నాకు ఎలాంటి గాయాలు తగల్లేదు. కానీ నడవడం, కూర్చోవడం కూడా చాలా కష్టమైపోయింది. కొంచెం కదిలినా కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. ఆసుపత్రిలో అయిదారు రోజులు చికిత్స తీసుకున్నాను. ఆసుపత్రి నుంచి వచ్చిన వెంటనే పరుగెత్తుకుంటూ రైలెక్కే సన్నివేశం చేయమన్నారు. చాలా కష్టపడి చేశాను.

ఎన్ని సినిమాలు చేశారు?

సదా:40కి పైగా చేశాను.

ఎన్ని భాషల్లో చేశారు?

సదా:తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో చేశాను. హిందీలో మూడు చిత్రాల్లో నటించాను.

'దొంగ దొంగది' సినిమా సమయంలో మనోజ్‌ బాగా ఏడిపించాడంట?నిజమేనా?

సదా:మనోజ్‌ స్వీట్‌ పర్సన్‌. కానీ ర్యాగింగ్‌ అంటే ఎలా ఉంటుందో చూపించాడు. ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదు. నేను చదువుకునే రోజుల్లో అందరూ నన్ను చూసి భయపడేవారు. అందుకే ఎక్కడా ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు.

పెద్ద హీరోలతో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?

సదా:విక్రమ్‌ చాలా ప్రశాంతంగా ఉంటారు. పెద్ద నటుడనే భావం లేకుండా సరదాగా ఉంటారు. మాధవన్‌తో మూడు సినిమాలు చేశాను. దీంతో మా మధ్య ఎఫైర్‌ ఉందని పుకార్లు పుట్టించారు. అదొక్కటి తప్ప జీవితంలో ఎలాంటి రూమర్లూ లేవు.

గాసిప్స్‌ను ఎంజాయ్‌ చేస్తావా?

సదా:లేదు. అదంతా అనవసరం అనిపిస్తుంది. మన పనే మన గురించి మాట్లాడాలి. పుకార్లు కాదు.

ఎన్టీఆర్‌, బాలకృష్ణలో గమనించిన అంశాలేంటి?

సదా:ఎన్టీఆర్‌ లాంటి డ్యాన్సర్‌ను ఇంతవరకూ చూడలేదు. ఎంత పెద్ద స్టెప్‌ అయినా సులువుగా చేసేస్తారు. ఒకసారి చూసి చేస్తారు. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా పనిపట్ల అంకితభావంతో ఉంటారు.

బాలకృష్ణ గురించి?

సదా:చిన్నపిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉంటారాయన. ఆయన సెట్లోకి వచ్చారంటే అందరికీ ఉత్సాహం వచ్చేస్తుంది. చాలా యాక్టివ్‌గా, ఎనర్జెటిక్‌గా ఉంటారు.

కొన్ని పేర్లు చెబుతాను. ఒక్క పదంలో వారి గురించి చెప్పాలి.

ఉదయ్‌కిరణ్‌

సదా:నిజంగా మిస్‌ అవుతున్నాను.

శంకర్‌

సదా:అణుకువగా ఉంటారు.

అజిత్‌

సదా:క్యూట్‌. శాలిని చాలా లక్కీ.

అమ్మానాన్న

సదా:ప్రాణం.

ఆలీతో సరదాగా

సదా:ఒక్క మాటలో చెప్పలేను. నా ఇంటర్వ్యూల్లో ఇది బెస్ట్‌.

ఇదీ చూడండి..ఆ షూటింగ్​లో సదా ఎందుకు ఏడ్చింది?.. తేజ కొట్టారా?

ABOUT THE AUTHOR

...view details