తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శుభలేఖ సుధాకర్ అందుకే సారీ చెప్పారు: గౌతమి - gouthami latest news

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ప్రముఖ నటి గౌతమి.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. తను నటిగా ఎంట్రీ ఇవ్వడం దగ్గర నుంచి ఇప్పటివరకు సంబంధించిన విషయాల్ని వెల్లడించింది.

actress gouthami in ali tho saradaga
నటి గౌతమి

By

Published : Apr 29, 2021, 1:44 PM IST

సినిమా తారగా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. విశాఖపట్నంలో చదువుకుంటూ సినీ నటిగా ప్రవేశించి తనదైన నటనతో అలరించిన నటి గౌతమి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాల్లో అలరించింది. ‘దయామయుడు’ సినిమాతో సినీ రంగప్రవేశం చేసి, ఆ తర్వాత ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ప్రభుదేవాతో కలిసి ‘చికుబుకు..చికుబుకు రైలే అదరెను దీని స్టైలే’ అనే ప్రత్యేక గీతంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ పాట ఎంతలా ప్రాచుర్యం పొందిందో మనకు తెలిసిందే. ఇటీవల ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదా'గా కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విశేషాలు పంచుకున్నారు.

‘చికుబుకు చికుబుక్‌ రైలే’ పాట వచ్చి 27 ఏళ్లు అయ్యింది. అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలానే ఉన్నారు. ఈ పాట చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?

గౌతమి: ఈ సినిమా వచ్చి అప్పుడే 27 ఏళ్లు అయ్యిందా! మీ అందరి ఆదరణ వల్లే ఇప్పుడు కూడా అలానే ఉన్నా. ఈ పాట చేయడమే చాలా ఇంట్రస్టింగ్‌. ఈ సినిమాతోనే ప్రభుదేవా నటుడిగా పరిచయమయ్యారు. అతడు సుందరం మాస్టర్‌ (ప్రభుదేవా తండ్రి) దగ్గర అసిస్టెంట్‌గా చేస్తున్నప్పటి నుంచే తెలుసు. నేను రజనీకాంత్‌తో చేసిన సినిమాల్లో అతను అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేస్తుండేవాడు. ఓ సారి సుందరం మాస్టర్‌ ప్రభుదేవాను హీరోగా పరిచయం చేస్తున్నారని చెప్పారు. దర్శకుడు శంకర్‌ అప్పుడు ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు నా సినిమాలో ఏడీగా క్లాప్‌ ఇచ్చారు. నాకు ఇంకా బాగా గుర్తుంది.. అప్పట్లో టు ఇన్‌ వన్‌ టేప్‌ రికార్డర్‌ మా ఇంటికి తీసుకొచ్చి పాట వినిపించి.. ‘ఈ పాటలో మీరు చేయాలి. ఇది సినిమాకే హైలైట్‌ అవుతుంది’ అని చెప్పారు. శంకర్, ప్రభుదేవా అప్పుడు సినీ కెరీర్‌ బిగినింగ్‌లో ఉన్నారు. నా పాట ఈ సినిమాకు ఒక ఉత్సాహాన్నిచ్చి ఉపయోపడుతుందని చేశా.

ఆ పాటలో మీరు అతిథా? ఐటెమ్‌ భామనా?

గౌతమి: ఒరిజినల్‌ ఐటెమ్‌ గాళ్‌ నేనే.. (నవ్వుతూ) ఆ తర్వాత ఈ పాట ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యింది. తర్వాత ప్రత్యేక గీతాల్లో నటించమని చాలా మంది అడిగారు. కానీ, నేను అలా అనుకుని ఈ పాట చేయలేదు. కేవలం వాళ్లతో ఉన్న స్నేహం వల్ల, వారికి చేయూత ఇవ్వాలనే చేశా.

మీ అసలు పేరు గౌతమినేనా లేక చిత్రసీమకు వచ్చాక పేరు మార్చుకున్నారా?

గౌతమి: ఇది నా సొంత పేరు. జాతకం ప్రకారమే ‘గ’తో మొదలు అవ్వాలని చెప్పిన తర్వాత మా తల్లిదండ్రులు ఈ పేరు పెట్టారు.

నటి గౌతమి

మీ సొంత ఊరు ఏది?

గౌతమి: మంచి ప్రశ్న అడిగారు. నేను పుట్టింది శ్రీకాకుళం. ఆ తర్వాత వైజాగ్‌లో కొంతకాలం, కేరళలో ఒక సంవత్సరం ఉన్నాం. నేను ముందు భారతీయురాలిని. పూర్తిగా దక్షిణ భారత అమ్మాయిని. బెంగళూర్‌లో బిషప్‌ కాటన్స్ హైస్కూల్‌లో చదువుకున్నా. మళ్లీ వైజాగ్‌ వచ్చి ఎంసెట్‌ రాసి ట్రిపుల్‌-ఇ చదవడం మొదలుపెట్టా, ఆ వెంటనే మద్రాసు వచ్చాను.

అంటే ఆంధ్రా టు కేరళ టు కర్ణాటక టు తమిళనాడు ఇలా రావడానికి కారణం?

గౌతమి: ఇదే జీవితం. నా జీవితం ఒక్కసారి చూస్తే మా తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంతో కొత్త ప్రాంతాలు, కొత్త అనుభవాలు, వివిధ ప్రాంతాలకు చెందిన మనుషులను కలిసే అవకాశం కలిగింది. ఇంజనీరింగ్‌ చదివేటప్పుడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు అది నా నిర్ణయం. అప్పట్లో చిత్రసీమలో కొత్త ముఖం కోసం ఎదురు చూస్తుండేవాళ్లు. అప్పటికే నాకంటే సీనియర్స్, రాధ, సుహాసిని, రేవతి ఉన్నారు. నాకు అప్పుడే అవకాశాలు రావడం మొదలయ్యాయి. తొలుత పి.ఎన్‌.రామచంద్రరావు ‘గాంధీనగర్‌ రెండవ వీధి’ సినిమా చేసేటప్పుడు రెండు నెలలు వరుసగా ఫోన్‌ చేశారు. మా అమ్మానాన్న ఇద్దరూ డాక్టర్లే. వాళ్లకు ఇండస్ట్రీ గురించి తెలియదు. మా నాన్న రేడియేషన్‌ అంకాలజిస్ట్‌. క్యాన్సర్‌ వ్యాధి చికిత్స ఉపయోగించే రేడియేషన్‌ విధానాన్ని ఇండియాకు తీసుకొచ్చిన మొదటి వ్యక్తి మానాన్నే. అమ్మ పాథాలజిస్టు. మా అన్నయ్య ఇంజనీర్‌. మాకు చదువు తప్ప వేరే ప్రపంచం తెలియదు. ‘‘చదువు అనేది ఎప్పుడైనా వస్తుంది. కానీ కళ అనేది పెద్ద అవకాశం. ప్రతి రంగంలోనూ మంచి చెడూ ఉంటాయి ఆలొచించుకో’’ అన్నారు. 30 సెకన్లు కూడా ఆగకుండా.. నేను వెంటనే చిత్రసీమకు వెళ్తానని చెప్పాను. అప్పుడే నా జీవితం 180 డిగ్రీల్లో మారి కొత్త ప్రపంచానికి వెళ్లాను.

మీరు మొదట ఏ సినిమాలో కనిపించారు?

గౌతమి: ‘దయామయుడు’ అనే చిత్రం (విజయ్‌ చందర్‌). మాకు విజయ్‌ చందర్‌ బంధువు అవుతారు. ఆ సినిమా కాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఆయనే మా నాన్నని అడిగారు. ‘అమ్మాయి బాగుంటుంది’ అని ఒప్పించారు. అప్పుడే కాలేజీలో నా చదువు మొదలైంది. ర్యాగింగ్‌ నుంచి తప్పించుకోవచ్చని సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. ఈ లోపు సినిమా కూడా అయిపోంది. ఇక ఆ సినిమా ఫుటేజ్‌ చూసి ఫోన్‌లు చేయడం మొదలుపెట్టారు. రామచంద్రరావు అయితే నిన్ను తప్ప వేరేవారిని నేను ఊహించుకోవడం లేదని అన్నారు. ‘వచ్చి నన్ను సంప్రదించండి. నీకు ఇష్టమైతేనే సినిమా చేయి.. లేదంటే వద్దు. వెంటనే విమానం ఎక్కి తిరిగి వెళ్లొచ్చు’ అన్నారు. అమ్మానాన్నతో కలిసి కూర్చొని మాట్లాడాను. వెంటనే వాళ్లు ఒప్పుకొన్నారు.

నటి గౌతమి

‘గాంధీనగర్‌ రెండవవీధి’ మీ రెండో సినిమా అనుకోవచ్చా?

గౌతమి: ఇదే నా మొదటి చిత్రం అనిపిస్తుంది. ‘దయామయుడు’ చిత్రాన్ని నేను షూటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకోలేదు. అదొక కొత్త ప్రపంచం. మొదట హైదరాబాద్‌లో కుతుబ్‌షాహీ టూంబ్స్‌ ‘గాంధీనగర్‌’ షూటింగ్‌ జరిగింది. ఓ సన్నివేశంలో డైలాగ్‌ చెప్పాలని వివరించారు. చుట్టూ లైట్స్ మధ్యలో నేను తల ఎత్తి పైకి చూడగానే కిందపడిపోయా. అప్పటికే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అందరూ కంగారుపడిపోయి నీడలో పడుకోబెట్టారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాను.

మొత్తం ఎన్ని చిత్రాల్లో కథానాయికగా నటించారు?

గౌతమి: 5 భాషల్లో దాదాపు 120 సినిమాలు చేశా. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ. హిందీలో మిథున్‌ చక్రవర్తి, జాకీష్రాఫ్‌, వినోద్‌ ఖన్నా. బాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు మాత్రమే చేశా.

మీరు నటించిన మొదటి తమిళ చిత్రం?

గౌతమి: ‘గురుశిష్యన్‌’. రజనీకాంత్‌ హీరో. అది అనుకోకుండా వచ్చిన అవకాశం. ఈ సినిమానే నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అప్పుడే చిత్రసీమలో కొనసాగాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికీ ఆ సినిమా అంటే ఇష్టం. ఈ చిత్రంతోనే నాకు మంచి అవకాశాలు వచ్చాయి. నాకొక బూస్టప్‌ లాంటిది అని చెప్పవచ్చు.

కమల్‌హాసన్‌తో మీ మొదటి సినిమా?

గౌతమి: ‘అపూర్వ సోదరగల్‌’. ఈ సినిమా నాకు తమిళంలో నాలుగో/ఐదో చిత్రం అనుకుంటా. తమిళం, తెలుగు రెండు భాషలు రావు. ఇంగ్లీష్‌లోనే మాట్లాడేదాన్ని. కానీ, ప్రతి చిత్రంలో నా డబ్బింగ్‌ లిప్‌ సింక్‌ సరిగ్గా కుదురుతుంది. అందుకోసం ఎంతో శ్రమించే దాన్ని. ‘అపూర్వ సోదరగల్‌’ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. దీని తర్వాత ‘క్షత్రియ పుత్రుడు’ ఇంకా చాలా సినిమాల్లో నటించా.

‘శ్రీనివాసకల్యాణం’ వెంకటేష్‌ హీరో. కోడి రామకృష్ణ దర్శకుడు. మురారి చిత్ర నిర్మాత. ఇది నా రెండో చిత్రం. నిర్మాతగా మురారి చాలా కఠినంగా ఉంటారు. కానీ, చాలా సపోర్టు చేస్తారు. సినిమాకు ఏం కావాలి? ఎంత కావాలి? ఎలా చేయాలనే దానిపై ఆయన చాలా కచ్చితంగా ఉంటారు. అనవసరంగా ఏమైనా జరిగితే మాత్రం కర్ర పట్టుకొని వచ్చేస్తారు. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర చాలా అతిగా మాట్లాడుతుంది. కానీ, నిజజీవితంలో నేను పెద్దగా మాట్లాడను. పైగా తెలుగులో మాట్లాడాలి. నా కోసం దర్శకుడు కోడి రామకృష్ణ, హీరో వెంకటేష్‌, మోహన్‌బాబు, గొల్లపూడి మారుతీరావు చాలా ఓపికతో నాకు తెలుగు నేర్పించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో చాలా టేకులు తీసుకునే దాన్ని. ఎందుకంటే నాకు తెలుగు భాష తెలియదు.

మీ జీవితంలో తొలి నుంచి క్లారిటీ ఉందా? లేదా సమస్య ఎదురైనప్పుడు వచ్చిందా?

గౌతమి: సమస్య వచ్చినప్పుడే మనలో ఒక గొప్ప గుణం ఉంటుంది. దాన్ని ఎదిరించే సత్తా పుడుతుందని అనుకుంటాను. ఎప్పుడు ఎలా ఉండాలో అది నేర్పుతుంది.

మీ పాప పేరు?

గౌతమి: సుబ్బలక్ష్మి. సంప్రదాయ పేరు కావాలనే ఈ పేరు పెట్టాం. నాకు చాలా బాగా నచ్చింది. ఈ పేరంటే మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం. అమ్మాయికి మాత్రం సుబ్బు అని పిలుపించుకోవడం ఇష్టం. యూఎస్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్‌ కోర్సు చదువుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే చదువుకుంటోంది. ఆమె ఏం చేసినా సొంతంగా చేస్తుంది. అమ్మాయికి అన్నీ నేర్పించా. సంగీతం, నాట్యం, మ్యూజిక్‌ ఏది కోరితే అది చేశా. నాలుగు సంవత్సరాలు నిండేంత వరకూ అమ్మాయి టీవీ, కంప్యూటర్‌ చూడలేదు తెలుసా!

నటి గౌతమి

మీ కుటుంబ సభ్యులు ఎంతమంది?

గౌతమి: అన్నయ్య, నేను. ఆయన ఇక్కడే ఇంజనీరింగ్‌ చదివి విదేశాల్లో ఉన్నారు. అమ్మానాన్న ఇద్దరు చనిపోయారు. అమ్మ చనిపోయేటప్పుడు నాన్న ఏం చెప్పారంటే.. ‘నీకు ఇంకా మా అవసరం ఉంది. మేం నిన్ను చాలా జాగ్రత్తగా పెంచాం. ఇప్పుడు ఒక గోడ కూలిపోయింది. మరోవైపు నేను ఉన్నా. కానీ నిన్ను నా జీవితం ఉన్నంత వరకు చూస్తాను’ అని అన్నారు.

మీ నాన్న అంకాలజీ వైద్యుడు అలాంటి ఇంటి నుంచి వచ్చిన మీకు క్యాన్సర్‌ రాకూడదు. అయినా దానిపై మీరు సాగించిన పోరాటం మామూలు విషయం కాదు..

గౌతమి: క్యాన్సర్ ఫలానా వాళ్లకి రాకూడదనే అని అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. క్యాన్సర్‌కి ఉన్న గొప్ప గుణం ఏంటంటే అది ఎప్పుడైనా, ఎవరికైనా, ఏ వయసు వారికైనా రావచ్చు. ఏ సమయంలోనైనా రావచ్చు. మిగతా వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్త పడుతున్నామో అలా క్యాన్సర్‌కి కూడా జాగ్రత్త పడాలి. అన్ని వ్యాధుల మాదిరిగానే ఇదొక వ్యాధి అనుకోవాలి.

గౌతమికి క్యాన్సర్‌ రావడం ఏమిటి అని చాలామంది బాధపడ్డారు. దాని గురించి మీరిచ్చే సలహా?

గౌతమి: ఏదొచ్చినా సిద్ధంగా ఉండాలి. భయపడకూడదు. ఆ సమయంలో మా అన్నయ్య చాలా సపోర్టుగా ఉన్నారు. మా పిన్ని నన్ను బాగా చూసుకుంది. కీమో థెరపీ జరిగిన తర్వాత పదిరోజుల పాటు నన్ను చూసుకుంది. అప్పటికే వాళ్లకు వయసు పైబడింది. ఇంకొకరు శ్రీలత అంటీ నాకెంతో తోడ్పడ్డారు. కమల్‌హాసన్‌ కూడా అండగాగా నిలిచారు. నాకు క్యాన్సర్‌ వచ్చినప్పుడు నా పాప వయసు నాలుగేళ్లు. అమ్మాయిని తలుచుకుని భయపడేదాన్ని. క్యాన్సర్‌ ఈ సమయంలో నన్నేం చేయలేదని నాకు తెలుసు. అసలు మొదట నాలో ఈ క్యాన్సర్‌ ఉందని నిర్ధారించుకొన్న తర్వాతే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను. అమ్మాయి కోసం ఏమీ చేయగలను అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను.

మీరు 2 వేల కిలోమీటర్లైనా డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్తారట?

గౌతమి: అవును. నా జీవితంలో ఇష్టమైన వాటిల్లో ఒకటి డ్రైవింగ్‌. రెండోది కెమెరా ముందు నిలబడటం.

నటించడం ఇష్టం ఉన్న మీరు చిత్రీసీమకు ఎందుకు దూరమయ్యారు. ఇది సరైనా సమయం కాదనా? లేక అద్భుతమైన పాత్ర కోసం వేచి చూస్తున్నారా?

గౌతమి: అలాంటిదేమీ లేదు. చిత్రసీమకు ఎప్పుడూ దూరం కాలేదు. నాకు అమ్మాయి ఉంది. తనని చూసుకోవడం నా బాధ్యత. ఏం చేసినా పిల్లలే మొదట అనేది మా అమ్మ. షూటింగ్‌ వెళ్లొచ్చిన తర్వాత తల దువ్వుతానంటే కుదరదు కదా. కొన్నాళ్ల తర్వాత సినిమాల్లో టెక్నిషియన్‌, డిజైనర్‌గా పనిచేశా. అప్పుడే అమ్మాయి (సుబ్బు) నన్ను ప్రొత్సహించింది. ‘నా పని నేను చేసుకోగలను’ అని చెప్పింది. పదేళ్లుగా ప్రొడక్షన్‌లో పనిచేశా. చిత్రసీమ నుంచి నేను ఎప్పుడూ బయటకు వెళ్లలేదు. తర్వాత మోహన్‌లాల్‌తో ‘మనమంతా’ చేశా. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేశాను. ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను.

శివాజీ గణేశన్‌తో ‘క్షత్రియపుత్రుడు’ చేశారు. భానుమతితో ‘బామ్మమాట బంగారుబాట’, మణిరత్నం ‘ఇద్దరు’లాంటి చిత్రాలు చేశారు. అలాంటి గొప్పవాళ్ల నుంచి ఏమీ నేర్చుకున్నారు?

గౌతమి: భానుమతితో పనిచేసేటప్పటికే ఆమె పెద్ద లెజెండ్‌, ఐకాన్‌. ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆ సినిమాలో ఆమెను చూస్తూ కూర్చుండిపోయాను. అప్పట్లో నేను మూడు షిప్టుల్లో పనిచేసేదాన్ని. సరిగా నిద్ర ఉండేది కాదు. ఆ సినిమా చేస్తున్నపుడు అందులో నిద్రపోయే సన్నివేశం ఉంది. నేను నిజంగానే నిద్రపోయాను. లేచే చూసేసరికి నా తలపై నెమురుతూ భానుమతి కనిపించింది. ‘నీవు విశ్రాంతి తీసుకో. సరిగా నిద్రలేదు’ అంటూ విసనకర్రతో అలా ఊపుతూ సేవ చేసింది. ఇక శివాజీ గణేశన్‌ కూడా అంతే నేను కనిపిస్తే చాలు పక్కన కూర్చోబెట్టి మాట్లాడేవారు. ఒకసారి నాకు తెలియకుండా మాంసం తినిపించి ఆటపట్టించారు.

మణిరత్నంతో ‘ఇద్దరు’ చిత్రంలో చేశారు. ఆ సంగతులు ఏంటి?

గౌతమి: ఆయన తీసిన ‘మౌనరాగం’ నుంచి ఎన్నో ప్రేమకథా చిత్రాలు చూశా. ఆయనతో కలిసి పనిచేద్దామనే ఆలోచనే ఎప్పుడూ రాలేదు. ఓ సారి అనుకోకుండా ఆయన్నుంచి పిలుపొచ్చింది. ‘మీకు ఈ సినిమాలో ఓ పాత్ర ఉంది. అది మీరు చేస్తేనే బాగుంటుంది చేస్తారా’ అని అడిగారు. వెంటనే ఒప్పేసుకున్నా.

శుభలేఖ సుధాకర్‌ మీతో కలిసి ఓ సన్నివేశంలో నటించి, తర్వాత వచ్చి ఒక్కసారి సారీ చెప్పారట ఏంటా సంగతి?

గౌతమి: ఒక్క సారీనా.. అది ‘ద్రోహి’ చిత్రం. అతను టెర్రరిస్టు పాత్రలో నటించారు. మా ఇంట్లోకి ప్రవేశించి అబ్బాయిపై కత్తి పెట్టి నన్ను బలవంతం చేసే సన్నివేశం. నిజంగా సన్నివేశంలో లీనమై చేశారు. తర్వాత ఆ సన్నివేశం కట్‌ చెప్పగానే ‘‘ఐయామ్‌ సో సారీ... ఐయామ్‌ సో సారీ..’’ అని ఎన్ని సార్లు చెప్పారో (నవ్వుతూ).

కాల్‌షీట్స్ ఇబ్బంది వల్ల చిరంజీవితో సినిమా చేయలేకపోయారు. ఏంటా ఆ సినిమా?

గౌతమి: ఒకటి కాదు ఆయనతో రెండు మూడు సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయాను. కాల్షీట్స్ సర్దుబాటు చేయలేకపోయా. అలా సుబ్బరామిరెడ్డి నిర్మాతగా వ్యవహరించిన (స్టేట్‌రౌడీ) చిత్రానికి కూడా అలా జరిగింది. ఆయన నాకు చిన్నప్పట్నుంచే తెలుసు. ‘మేమే మీ ఇంటికొచ్చి అడిగిన తర్వాత కూడా మా సినిమా చేయలేదు’అని చనువుగా అడిగారు. (మధ్యలో అలీ అందుకుంటూ..బాలకృష్ణ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం ఇలానే జరిగిందట) అవును. మనం ముందు ఒక సినిమాకు డేట్స్ ఇచ్చిన తర్వాత పూర్తి చేయడం మన బాధ్యత. చిరంజీవి సినిమాలకు డేట్స్ అడిగినప్పుడల్లా రజనీకాంత్‌ సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. అందువల్లో చిరంజీవితో కలిసి నటించలేకోపోయాను.

రోజుకు ఎన్ని గంటలు యోగా చేసేవారు?

గౌతమి: గతంలో చేసేదాన్ని. ఇప్పుడు చేయడం లేదు. ఎందుకంటే పనుల్లో బిజీగా ఉండిపోయి. ఇది వేరే వాళ్లు చెబితే ఒప్పుకొనే దాన్ని కాదు. కానీ, ఇక నుంచి యోగా చేస్తాను.

మీ కోపం (నవ్వతూ) వస్తుందా?

గౌతమి: నాకు న్యాయంగా కోపం వస్తుంది. అన్యాయంగా, కూర్రంగా వ్యవహరిస్తే కచ్చితంగా అలాంటి వారిపై కోపం వస్తుంది.

మీ జీవితంలో అనుకుకోకుండా ఏమైనా మాటలు అని బాధపడిన సందర్భం ఉందా?

గౌతమి: లేదు. మాటలు అనేవి ఎప్పుడూ ఆలోచించి మాట్లాడతా. మాటల్లో ఉన్న శక్తి ఏంటో నాకు తెలుసు. అందుకే వాటికి విలువనిస్తా. మాటలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడతా. కొన్ని మాటలు ఇంకా గట్టిగా అని ఉంటే బాగుండు. వాళ్ల బుర్రలకు ఎక్కేవి అనే సందర్భాలు మాత్రం ఉన్నాయి.

ఎందుకు ఇలాంటి సినిమా తీశాను అని ఎప్పుడైనా అనిపించిందా?

గౌతమి: ఎందుకు ఇలా చేశానని అనుకోలేదు. కానీ ఈ సినిమా చేసినప్పుడు నా తెలివి ఏమైందా అని అనుకున్నా.

ABOUT THE AUTHOR

...view details