తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వావ్‌-3'.. ఈసారి వినోదమే కాదు విజ్ఞానం కూడా!

'వావ్‌' మంచి కిక్​ ఇచ్చే గేమ్​షో.. అంటూ ప్రతి మంగళవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారమైన వినోదాత్మక షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారు నటుడు సాయికుమార్​. ఈసారి ప్రేక్షకులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని ఆందిస్తామని అంటున్నారు. నేటి(ఆగస్టు 4) నుంచి ప్రతి మంగళవారం రాత్రి ఈటీవీలో ప్రసారం కానున్న 'వావ్‌-3' ముచ్చట్లు వ్యాఖ్యాత సాయికుమార్​ మాటల్లోనే

actor saikumar about WOW new season
''వావ్‌-3'.. ఈసారి వినోదమే కాదు విజ్ఞానంతో వస్తున్నాం'

By

Published : Aug 4, 2020, 6:55 AM IST

'వావ్‌'... ఈటీవీలో ప్రసారమైన 'వావ్‌' మొదటి సీజన్‌లో 165 ఎపిసోడ్లు చూసిన తెలుగు ప్రేక్షకులు ఆనందంతో అన్న మాట ఇది. ఆ తర్వాత.. రెండో సీజన్‌ ప్రారంభం...మరో 52 ఎపిసోడ్లు...మళ్లీ.. ఇన్నాళ్ల తర్వాత... డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ మరోసారి...'వావ్‌ - 3'తో వినోదాల వర్షం కురిపించనున్నారు. మిరుమిట్లు గొలిపే సెట్‌లో- మైమరపించే రౌండ్లతో-నలుగురు సెలబ్రిటీ గెస్ట్‌లతో కలిసి 'వావ్‌' అనిపించబోతున్నారు. ఈరోజు నుంచి ప్రతి మంగళవారం రాత్రి 9.30 గంటలకు వావ్‌ మూడోసీజన్‌ ఈటీవీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా సాయికుమార్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు.
'వావ్‌ 3' ఎలా ఉండబోతోంది?
'వావ్‌ 3'లో నాలుగు రౌండ్లు ఉంటాయి. ఆడేవారికి ముందే రూ.పది లక్షలు ఇచ్చేస్తాం. గెలుచుకుంటే అవి వారికే, లేకుంటే నా బ్యాంకుకు ఇచ్చెయ్యాలి. మొదటి ఎపిసోడ్‌లో సుమ, అనసూయ, మనో, ధన్‌రాజ్‌ పాల్గొంటున్నారు. 'లకలక', 'బొమ్మాలి', 'కట్‌ చేస్తే' రౌండ్లు అలాగే కొనసాగిస్తున్నాం. ఇప్పుడు 'సూపర్‌ హిట్టు..బొమ్మ పట్టు' అని కొత్త రౌండ్‌ ఒకటి చేర్చాం. ఇది తమాషాగా ఉంటుంది. ఫొటోలను మ్యాచ్‌ చేయాలి. 'లకలక' మేధస్సు మీద ఆధారపడుతుంది. 'బొమ్మాళి' కార్యక్రమంలో పాల్గొనేవారిని ఎలా ఆడుకుంటుందో షోలోనే చూడాలి. ఈ షో మిగిలిన వాటిలాగే పెద్ద హిట్టు అవుతుందన్న నమ్మకం ఉంది.
ఇంత మంది మేధస్సును పరీక్షిస్తున్నారు? మరి మీ ఐక్యూ ఎలా ఉంటుంది?
నేను సివిల్స్‌కి సన్నద్ధం అయ్యా. విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం 'కాంపిటేషన్‌ సక్సెస్‌ రివ్యూ' పుస్తకం చదివేవాణ్ని. మద్రాస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేశా. 'వావ్‌'తో చాలా నేర్చుకున్నా.
లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణలన్నీ ఆగిపోయాయి? జీవితంలో ఎప్పుడైనా ఇంత విరామం తీసుకున్నారా?
పదకొండేళ్ల నుంచే నటించడం మొదలుపెట్టా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ఖాళీ సమయం ఎప్పుడూ రాలేదు. ఈ సమయంలో ప్రజల్ని ఉత్తేజపరిచేలా యాభై వీడియోలు చేశా. కరోనా గురించి అవగాహన కల్పిస్తూ వాయిస్‌ ఓవర్లు ఇచ్చా. నేను, ఆది, నా కూతురు కలిసి కరోనా యోధులుగా మారి ప్రజలకు సందేశం ఇచ్చేలా వీడియో రూపొందించాం.
బుల్లితెరతో అనుబంధం ఎలా ఏర్పడింది?
నేను చిన్నప్పటి నుంచే సీరియల్స్‌లో నటించేవాణ్ని. 'పోలీస్‌ స్టోరీ' సమయంలో 'పోలీస్‌ ఫైల్‌' అనే ధారావాహిక చేశా. అలా నాకు బుల్లితెరతో మంచి అనుబంధం ఉంది. సోనో పిక్స్‌ ప్రసాద్‌, దర్శకుడు అనిల్‌ కలిసి 'వావ్‌' మొదటి సీజన్‌ ప్రారంభించాం. 180 ఎపిసోడ్లు పూర్తయ్యాక, దీన్నే మళ్లీ ఈటీవీ కన్నడలో చేశాం. 'వావ్‌ 2'ని కూడా తెలుగు, కన్నడలో రూపొందించాం. నేను ఎక్కడికి వెళ్లినా 'ఏంటీ సార్‌? ఎప్పుడూ తారలతోనే చేస్తారా! సాధారణ వ్యక్తులతో షో చేయరా?' అనే ప్రశ్నలు తలెత్తేవి. వాటికి సమాధానంగా గ్నాపిక ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో 'మనం' ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా ఇది ఆగిపోయింది. 'వావ్‌' సెలబ్రిటీ షో అయినా అందులో సమాచారం ఉంటుంది. ఇందులో 'లకలక' రౌండ్‌లో వచ్చే ప్రశ్నల్ని డైరీల్లో రాసుకునేవారున్నారు. 'బొమ్మాళి' రౌండ్‌ చాలా హిట్టయ్యింది. వీటితో విజ్ఞానం, వినోదం రెండూ లభిస్తున్నాయి.
ఎన్నో విలక్షణ పాత్రల్లో మెప్పించారు? ఇంకా మీరు చేయాలనుకునే పాత్రలు ఏమైనా ఉన్నాయా?
దర్శకుడిగా కూడా రాణించాలనుకుంటున్నా. ఓ కుటుంబ కథకు సంబంంచిన స్క్రిప్ట్‌ పనులు మొదలుపెట్టా. శ్రీకృష్ణ దేవరాయలు, ఛత్రపతి శివాజీ లాంటి చారిత్రక నేపథ్యం కలిగిన పాత్రలు చేయాలని ఉంది. రెండు, మూడు కొత్త కథలకు పచ్చజెండా ఊపా. ఇటీవలే 'హ్యాపీ న్యూ ఇయర్‌' అనే కన్నడ సినిమాకు తొలిసారి ఉత్తమ హాస్య నటుడిగా పురస్కారం అందుకున్నా. కన్నడ వాళ్లు నాకు విభిన్నమైన పాత్రలు ఇస్తున్నారు. తెలుగు దర్శకులూ నన్ను వైవిధ్యంగా చూపే ప్రయత్నం చేయాలి.
త్వరలో ఏ ఏ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు?
ప్రస్తుతం తెలుగులో 'శ్రీకారం', 'ఎస్‌ఆర్‌ కల్యాణమండపం', 'అర్ధశతాబ్దం', 'ఎఫ్‌5', 'ఆనందభైరవి', 'నిన్నేపెళ్లాడుతా', కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్నసినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నా. యముడిగా ఒక సినిమాలో నటిస్తున్నా. ఇప్పుడు కన్నడలో తొమ్మిది పెద్ద సినిమాలు చేస్తున్నా. థ్రిల్లర్‌ మంజు దర్శకత్వంలో 'రాక్షసర్‌' అనే సినిమా చేస్తున్నా. ఇందులో పోలీస్‌గా కనిపిస్తా. వెబ్‌ సిరీస్‌ల విషయానికి వస్తే ఆర్కా మీడియా వాళ్లు లాక్‌డౌన్‌ కంటే ముందే ఒక కథ చెప్పారు. నిర్మాత విష్ణు కూడా వెబ్‌ సిరీస్‌ కోసం అడిగారు. 'ఆహా' ఓటీటీ కోసం ఒక కథ వింటున్నా. ఇలా నాలుగు ఐదు వెబ్ సిరీస్‌లు చేయడానికి సిద్ధంగా ఉన్నా.

ABOUT THE AUTHOR

...view details