వేల కోట్లు సంపాదించినా సమయానికి చేతిలో డబ్బు లేకపోతే ఆ సంపాదన అంతా వృథా అని అన్నారు హీరో మంచు విష్ణు. సమయానికి డబ్బు లేకపోవడం వల్ల విదేశాల్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని తీసుకురాలేక పోయానని తెలిపారు. గతేడాది లాక్డౌన్ సమయంలో భార్య, పిల్లలకు దూరంగా ఉన్నప్పుడు ఆవేదనగా ఉండేదని పేర్కొన్నారు. 'అలీతో సరదాగా' (Alitho Saradaga) షోలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అలీ ప్రశ్నకు..
గతేడాది లాక్డౌన్ సమయంలో చేసిన ఓ ఏమోషనల్ వీడియో వెనుక కారణం ఏంటని అలీ.. మంచువిష్ణును అడిగారు. దీనిపై స్పందించిన ఆయన.. ఆ సమయంలో తను పడిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.
"గతేడాది మార్చిలో మా ఫ్యామిలీలో ఒకరికి క్యాన్సర్ సర్జరీ కోసం సింగపుర్ వెళ్లాల్సి వచ్చింది. ఫ్యామిలీ అందరం వెళ్లాం. ముందు నాన్నగారు, నేను, అమ్మ వెనక్కి వచ్చేశాం. విన్నీ (మంచు విష్ణు భార్య), పిల్లలు అక్కడే ఉన్నారు. నేను మళ్లీ 21న వెళ్లి 24వ తేదీన వారిని తీసుకురావాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలో లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ మే నెల చివరి వరకు కొనసాగవచ్చు అని తెలిసే సరికి టెన్షన్ మొదలైంది. ఆర్థికంగా ఓ స్థాయికి చేరుకున్నా కూడా సింగపూర్లో ఉండటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మే నెలలో.. భార్య, పిల్లలను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చేద్దాం అనుకున్నాను. కానీ నా దగ్గర అప్పుడు రెడీగా లిక్విడ్ క్యాష్ లేకపోవడం వల్ల తీసుకురాలేకపోయాను. అప్పుడు అనిపించింది.. ఎంత సంపాదించినా సమయానికి చేతిలో డబ్బు లేకపోతే అది వృథా అని."