తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ: మాస్ మసాలా ఎంటర్​టైనర్​ 'విజయ్ సేతుపతి' - మూవీ లేటేస్ట్ న్యూస్

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన ఓ తమిళ చిత్రం.. 'విజయ్ సేతుపతి' పేరుతో తెలుగులో శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? కథేంటి? తదితర విషయాలు మీకోసం.

vijay sethupathi movie review
విజయ్ సేతుపతి మూవీ రివ్యూ

By

Published : May 14, 2021, 3:07 PM IST

చిత్రం: విజయ్‌ సేతుపతి; నటీనటులు: విజయ్‌ సేతుపతి, రాశీఖన్నా, నివేదా పేతురాజ్‌, సూరి తదితరులు; సంగీతం: వివేక్‌ మర్విన్‌; నిర్మాత: భారతీరెడ్డి; రచన, దర్శకత్వం: విజయ్‌ చందర్‌; విడుదల: ఆహా

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు విజయ్‌ సేతుపతి. ఇటీవల వరుస తెలుగు చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నాడు. విలక్షణ నటుడిగా ఆయనకు తమిళంలో పేరుంది. అందుకు తగినట్లుగానే పాత్రల ఎంపిక ఉంటుంది. అయితే, ఫుల్‌లెంగ్త్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాల్లో నటించింది మాత్రం తక్కువే. అలా వచ్చిన చిత్రాల్లో 'సంఘతమిళన్‌' ఒకటి. 2019లో విడుదలై అలరించిన ఈ తమిళ చిత్రం ఇప్పుడు 'ఆహా' ఓటీటీ వేదికగా 'విజయ్‌ సేతుపతి'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది? మరి మాస్‌ హీరోగా విజయ్‌ సేతుపతి నటన ఎలా ఉంది? అసలు ఈ చిత్ర కథేంటి?

విజయ్ సేతుపతి మూవీ

కథేంటంటే: చరణ్‌(విజయ్ సేతుపతి) తన స్నేహితుడు (సూరి)తో కలిసి సినిమా అవకాశాల కోసం నగరానికి వస్తాడు. ఒకరోజు సరదాగా పబ్‌కు వెళ్లిన చరణ్‌కు కమలిని(రాశీఖన్నా) పరిచయం అవుతుంది. తను ఫొటోగ్రఫీ కోర్సు చదువుతుంటుంది. ప్రాజెక్టులో భాగంగా చరణ్‌ ఉండే ఏరియాలో పరిస్థితులను ఫొటో తీసేందుకు వెళ్తుంది. అలా వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. మరోవైపు రామాపురం అనే గ్రామంలో కాపర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి బిజినెస్‌మెన్‌ అయిన సంజయ్‌(రవికిషన్‌) ప్రయత్నిస్తుంటాడు. అందుకు స్థానిక ఎమ్మెల్యే చంటబ్బాయ్‌(అసుతోష్‌ రాణా) సహాయం తీసుకుంటాడు. అయితే ఆ ఊరి ప్రజలు కోర్టుకు వెళ్లడం వల్ల ఫ్యాక్టరీ పనులు ఆగిపోతాయి. తన కుమార్తె కమలిని ప్రేమిస్తున్న చరణ్‌ రామాపురానికి చెందిన విజయ్‌ సేతుపతిలా ఉండటం వల్ల సంజయ్‌ ఆశ్చర్యపోతాడు. దీంతో ఊరి ప్రజలను దారి తెచ్చుకునేందుకు అచ్చం విజయ్‌లా ఉన్న చరణ్‌కు అక్కడకు పంపిస్తాడు. మరి ఆ ఊరు వెళ్లిన చరణ్‌ ఏం చేశాడు? ఇంతకీ విజయ్‌ సేతుపతి ఎవరు? అతనికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: విలక్షణ నటనకు, పాత్రలకు విజయ్‌ సేతుపతి పెట్టింది పేరు. తాను ఎంచుకునే ప్రతి పాత్రలోనూ కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. అయితే 'సంఘతమిళన్‌' ఔట్ అండ్‌ ఔట్‌ మాస్‌ మసాలా కమర్షియల్‌ చిత్రం. ఇలాంటి కథతో ఎన్నో చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. అగ్ర కథానాయకుల నుంచి ఇటీవల ఫామ్‌లో ఉన్న యువ కథానాయకుల వరకూ ఇలాంటి కథను కాస్త అటూ ఇటూగా మార్చి ప్రయోగాలు చేశారు. తెలిసిన కథే అయినా, దాన్ని ఎంటర్‌టైనింగ్‌ చూపించడంలోనే దర్శకుడి ప్రతిభ దాగి ఉంది. ఈ విషయంలో విజయ్‌ చందర్‌ ఓకే అనిపించాడు. సినిమా తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతున్నా సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. నటీనటులు కూడా తెలుగు ప్రేక్షకులకు కాస్త తెలిసిన వాళ్లే కావడం కాస్త ఊరట కలిగించే అంశం.

విజయ్ సేతుపతి సినిమాలోని సీన్

దర్శకుడు మొదటి సన్నివేశం నుంచి చివరి వరకూ ఎక్కడా రిస్క్‌ తీసుకోలేదు. ప్రథమార్థమంతా ఎంటర్‌టైనింగ్‌ చేసేలా తీర్చిదిద్దాడు. చరణ్‌, సూరిలు సినిమా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు, చరణ్‌-కమలిని ప్రేమ సన్నివేశాలతో సగటు సాధారణ సినిమాలాగానే సాగుతుంది. ద్వితీయార్థంలోనైనా బలమైన కథ ఉంటుందని ఆశించిన ప్రేక్షకుడికి నిరాశే అవుతుంది. విలన్‌ డబ్బుతో ప్రజలకు సౌకర్యాలు కల్పించి.. చివరకు విలన్‌కే ట్విస్ట్ ఇచ్చే పాత రొటీన్‌ ఫార్ములాగా ఇక్కడా కనపడుతుంది. కథ, కథనాలు ప్రేక్షకుడి ఊహకు తగినట్లే సాగుతాయి. ప్రతినాయకుడి పాత్ర అయినా బలంగా ఉందనుకుంటే అదీ లేదు.

ఎవరెలా చేశారంటే: తన మార్క్‌ నటనా ప్రాధాన్యం కలిగిన చిత్రాలకు భిన్నంగా విజయ్‌ సేతుపతి ఒక మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌లో నటించాడు. ఇలాంటి పాత్రలు నటించడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. కథానాయికలు రాశీఖన్నా, నివేదా పేతురాజ్‌ల పాత్ర పరిమితం. రవి కిషన్‌, అశుతోష్‌ రాణా వారి పాత్రల పరిధి మేరకు నటించారు. నాజర్‌ మరోసారి తండ్రి పాత్రలో అలరించారు. సూరి తనదైన శైలిలో నవ్వించాడు. సాంకేతికంగా సినిమా ఓకే. ఒక మాస్‌ కమర్షియల్‌ సినిమాకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి. దర్శకుడు విజయ్‌ చందర్‌ పాత చింతకాయ పచ్చడిని తీసుకొచ్చి, దానికి కాస్త తాలింపు, మసాలా వేసి ఇచ్చాడంతే. ప్రస్తుతం సినిమాలు విడుదలయ్యే పరిస్థితి లేదు కాబట్టి, సరదాగా కొత్త సినిమా చూడాలనుకుంటే ‘విజయ్‌ సేతుపతి’పై ఓ లుక్కేయొచ్చు. సినిమా రెండున్నర గంటలు ఉంది. తెలుగులోనైనా పాటలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది.

బలాలు

+ విజయ్‌ సేతుపతి

+ సూరి కామెడీ

బలహీనతలు

- తెలిసిన కథే కావటం

- నిడివి

చివరిగా: విజయ్‌ సేతుపతి.. అదే పాత కథ.. !

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details