చిత్రం:వెంకీమామ
నటీనటులు: వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్
దర్శకుడు:కె.ఎస్.రవీంద్ర(బాబీ)
సంగీతం:తమన్
నిర్మాణ సంస్థలు:సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేది: 2019 డిసెంబర్ 13
మంచి కథ, అందులో తనకు సరిపోయే పాత్ర వస్తే జీవంపోసే నటుడు విక్టరీ వెంకటేశ్. అందుకే ఈ ఏడాది జనవరిలో 'ఎఫ్ 2'లో వరుణ్‌తేజ్‌తో కలిసి ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచాడు. బాక్సాఫీసును గలగలలాడించాడు. అలాగే ఒక్కో చిత్రంతో నటుడిగా తనను తాను ఆవిష్కరించుకుంటున్న యువహీరో నాగచైతన్య. 'మజిలీ'తో మరో మెట్టు ఎక్కి హిట్ కొట్టాడు. ఈసారి ఈ మామా అల్లుళ్లిద్దరూ కలిసి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు 'వెంకీమామ'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి వెంకీ, చైతూల సందడి ఎలా ఉంది? వీరిద్దరూ ఎలా నవ్వులు పంచారో ఆ చిత్ర సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథేంటంటే:
ద్రాక్షారామంలో మిలటరీ నాయుడు అలియాస్ వెంకటరత్నం(వెంకటేశ్ )కు సైన్యంలో చేరాలనేది కల. తన అక్కా బావ చనిపోవడం వల్ల తన మేనల్లుడు కార్తీక్(చైతన్య)కు అన్నీ తానై పెంచి పెద్ద చేస్తాడు. కార్తీక్‌కు మేనమామ అంటే అంతులేని ప్రేమ. కానీ కార్తీక్ జాతక చ్రకం ప్రకారం మేనమామకు ప్రాణగండం ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న కార్తీక్.. తన మేనమామకు దూరంగా సైన్యంలో చేరుతాడు. ఓ ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు చిక్కుతాడు. ఈ విషయం తెలుసుకున్న మిలటరీ నాయుడు.. తన మేనల్లుడి కోసం ఎలాంటి త్యాగం చేశాడనేది వెంకీమామ కథ.
ఎలా ఉందంటే:
ఇలాంటి కథను ఇదివరకే తెలుగు ప్రేక్షకులు చూశారు. కృష్ణవంశీ తెరకెక్కించిన 'మురారి'ని బ్లాక్ బస్టర్ చేసి మహేశ్‌బాబు కెరీర్లో మరిచిపోలేని చిత్రంగా మలిచారు. ఇంచుమించు అలాంటి కథే ఈ వెంకీమామ. కృష్ణుడి జాతకంతో పుట్టిన కార్తీక్.. తన మేనమామ వెంకటరత్నంకు ఎలా ప్రాణగండంగా మారాడనే లైన్‌తో దర్శకుడు బాబీ ఈ కథను సిద్ధం చేశాడు. ఫస్టాప్ మొత్తం మామా అల్లుళ్ల మధ్య అనుబంధాన్ని, వినోదాన్ని పంచుతూ సాగే కథలో ఇంటర్వెల్ సమయానికి కథలో కీలకంగా నిలిచే జాతకం విషయం బయటపడుతుంది. ఆ జాతకం మామ అల్లుళ్ల విషయంలో ఎలా నిజమైందో చూపించే క్రమంలో కొన్ని ప్రమాదాలను సృష్టించిన దర్శకుడు.. మేనమామకు దూరంగా వెళ్లిన కార్తీక్.. సైన్యంలో చేరడం, కార్తీక్‌ను వెతుక్కుంటూ వెళ్లిన వెంకటరత్నం ఏం చేశాడనే అంశంతో కథను ముగించాడు.