తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఉప్పెన' రివ్యూ: ప్రేమకథకు సరికొత్త ముగింపు! - uppena cutting scene

మెగాహీరో వైష్ణవ్​తేజ్ పరిచయమవుతున్న 'ఉప్పెన' సినిమా థియేటర్లలోకి వచ్చింది. విజయ్ సేతుపతి విలనిజం, కృతిశెట్టి అందం, దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభతో పాటు ఇంకెన్నో అంశాలు గురించే ఈ కథనం.

uppena telugu movie review
'ఉప్పెన' రివ్యూ: ప్రేమ కథకు సరికొత్త ముగింపు!

By

Published : Feb 12, 2021, 1:23 PM IST

చిత్రం: ఉప్పెన‌

న‌టీన‌టులు: వైష్ణవ్‌ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్రహ్మాజీ త‌దిత‌రులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌

నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌

దర్శకత్వం: బుచ్చిబాబు సానా

సంస్థ‌‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌

విడుద‌ల‌ తేదీ: 12-02-2021

ఎప్పుడెప్పుడా అని విడుదల గురించి ప్రేక్షకుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన చిత్రం 'ఉప్పెన'. క‌రోనాతో గ‌తేడాది నుంచి వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. లాక్‌డౌన్ త‌ర్వాత మ‌రింత ఆత్రుత‌గా ఎదురు చూసేలా చేయించిన చిత్రాల్లో ఇదీ ఒకటి. చిరంజీవి మేన‌ల్లుడు వైష్ణవ్‌తేజ్ క‌థానాయ‌కుడిగా పరిచ‌యమవుతున్న చిత్రం కావడం... సుకుమార్ రైటింగ్స్‌లో సిద్ధమైన ప్రేమ‌క‌థ కావ‌డం వల్ల ఈ సినిమాపై అంచనాలు మ‌రింత‌గా పెరిగాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? తొలి చిత్రంలో వైష్ణవ్‌తేజ్‌ ఎలా నటించాడు? కృతి నటన ఎలా ఉంది?దర్శకుడిగా బుచ్చిబాబు తానేంటో నిరూపించుకున్నారా?

ఉప్పెన చిత్రంలోని సన్నివేశం

కథేంటంటే:ప్రాణం కంటే పరువు ముఖ్యమనుకునే పెద్ద మనిషి శేషారాయనం (విజయ్ సేతుపతి). ఆయన ఒక్కగానొక్క కూతురు సంగీత అలియాస్ బేబ‌మ్మ (కృతి శెట్టి). రోజూ బ‌స్సులో కాలేజీకి వెళ్లే సంగీత.. మత్స్యకారకుటుంబానికి చెందిన ఓ పేదింటి అబ్బాయి ఆశితో(వైష్ణవ్ తేజ్) ప్రేమలో పడుతుంది. ఇంట్లో తెలిశాక ఇద్దరూ క‌లిసి ఊరి నుంచి వెళ్లిపోతారు. ఈ విష‌యం బ‌య‌ట‌కి తెలిస్తే త‌న ప‌రువు పోతుంద‌ని ఆర్నెల్ల పాటు కూతురు ఇంట్లో ఉంద‌నే ఊరి జ‌నాలంద‌రినీ న‌మ్మిస్తాడు రాయ‌నం. మ‌రి ఆరు నెల‌ల త‌ర్వాతైనా సంగీత ఇంటికి తిరిగొచ్చిందా? త‌న కులం కానివాడు త‌న కూతురిని ప్రేమించాడ‌న్న కోపంతో ఆశిని శేషారాయ‌నం ఏం చేశాడన్నది 'ఉప్పెన' కథ.

ఎలా ఉందంటే:పెద్దింటి అమ్మాయి... పేదింటి అబ్బాయి మ‌ధ్య ప్రేమ ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మే. అలాంటి ‌క‌థ‌లు తెలుగు తెర‌కు కొత్తేం కాదు. అంత‌స్తుల్లో గ‌డిపే అమ్మాయి... పూరి గుడిసె నుంచి వ‌చ్చిన అబ్బాయి మ‌న‌సులు ఇచ్చి పుచ్చుకోవ‌డం చూడ‌టానికి ఎప్పుడూ ప్రత్యేక‌మే. ఆ జంట ప్రేమ‌లో ప‌డ్డాక డ‌బ్బు, ప‌లుకుబ‌డి ప్రభావంతో అడుగ‌డుగునా అడ్డంకులు ఎదుర‌వుతుంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లేకొద్దీ క‌థ ర‌క్తి క‌డుతుంటుంది. 'ఉప్పెన' కూడా అలాంటి క‌థ‌తోనే తెర‌కెక్కింది. ప్రథమార్ధంలో సింహ‌భాగం స‌న్నివేశాలు ఆశి, సంగీత ప్రేమ ప్రయాణం నేప‌థ్యంలోనే సాగుతాయి. వాళ్లిద్దరూ ఒక‌నొక‌రు చూసుకోవ‌డం, మ‌న‌సులు ఇచ్చి పుచ్చుకోవ‌డం, ఆ ప్రేమ గురించి ఇంట్లో తెలియ‌డం వంటి స‌న్నివేశాల‌తో ప్రథ‌మార్ధం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

ఉప్పెన సినిమాలోని సన్నివేశం

ఈ ప్రేమ‌క‌థ స‌ముద్రం నేప‌థ్యంలో సాగ‌డం మ‌రింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రేమ‌జంట పారిపోవ‌డం, వాళ్ల కోసం శేషారాయ‌నం మ‌నుషులు వెద‌క‌డం కోసం బ‌య‌ల్దేర‌డంతో ద్వితీయార్ధం మొద‌ల‌వుతుంది. మ‌ధ్యలో చెప్పేందుకు కథేమీ లేక‌... కొన్ని స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మ‌ళ్లీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. సంగీత ఇంటికి రావ‌డం, తండ్రితో మాట్లాడే స‌న్నివేశాలు ర‌క్తిక‌ట్టిస్తాయి. అయితే అప్పటివ‌ర‌కూ కర్కశంగా క‌నిపించిన రాయ‌నం... చివ‌రిలో కూతురు చెప్పే మాట‌ల్ని వింటూ నిలబడటం ఒక్కసారిగా ఆ పాత్ర తేలిపోయిన‌ట్టు అనిపిస్తుంది. దర్శకుడు త‌న ప్రత్యేక‌త‌ను ప్రద‌ర్శిస్తూ క్లైమాక్స్‌లో క‌థ‌నాన్ని మ‌లిచిన ‌విధానం మాత్రం ఆక‌ట్టుకుంటుంది. తెర‌పై సుఖాంతమ‌య్యే ప్రేమ‌క‌థ‌ల్ని చూస్తుంటాం, విషాదాంతంగా మారే ప్రేమ‌క‌థ‌ల్నీ చూస్తుంటాం. వాటికి భిన్నమైన ముగింపున్న చిత్రమిది.

ఉప్పెన చిత్రంలోని సన్నివేశం

ఎవ‌రెలా చేశారంటే: ప్రేమ‌జంట‌గా క‌నిపించిన వైష్ణవ్‌ తేజ్, కృతిశెట్టి సినిమాకి ప్రాణం పోశారు. నాయ‌కానాయిక‌లుగా ఇద్దరికీ ఇదే తొలి సినిమా అయినా... ఎంతో అనుభ‌వం ఉన్న న‌టుల్లా తెర‌పై క‌నిపించారు. వైష్ణవ్‌ తెర‌పై క‌నిపించిన విధానంతో పాటు... భావోద్వేగాలు పలికించిన తీరులోనూ ప‌రిణ‌తి క‌నిపిస్తుంది. కృతిశెట్టి త‌న అందంతో క‌ట్టిప‌డేసింది. సంగీత పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ప‌తాక స‌న్నివేశాల్లో ఆమె బాగా న‌టించింది. విజ‌య్ సేతుప‌తి పాత్ర సినిమా ప్రధాన‌బ‌లం. రాయ‌నం పాత్రలో ఒదిగిపోయారు. క‌థానాయ‌కుడి తండ్రిగా సాయిచంద్ న‌ట‌న దీటుగా ఉంది.

ఉప్పెన చిత్రంలోని సన్నివేశం

సాంకేతిక విభాగాలు చక్కటి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. దేవిశ్రీ ప్రసాద్‌ పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకి ప్రాణం పోశాయి. శ్యాంద‌త్ సైనుద్దీన్ స‌ముద్ర తీర ప్రాంతాన్ని కెమెరాలో బంధించిన తీరు ప్రేక్షకుల‌కి కొత్త అనుభూతిని పంచుతుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా ఓ కొత్త ప్రేమ‌క‌థ‌ను తెర‌పైకి తీసుకొచ్చాడు. ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కు ఇది కూడా ఓ సాధార‌ణ ప్రేమ‌క‌థే అనిపించినా... చివ‌ర్లో మాత్రం త‌న మార్క్‌ను ప్రద‌ర్శించాడు. ఆయ‌న రాసిన మాట‌లు మెప్పిస్తాయి.

బ‌లాలు

వైష్ణ‌వ్ తేజ్, కృతిల న‌ట‌న

సాంకేతిక బృందం పనితీరు

క‌థా నేప‌థ్యం ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

ప్రేక్షకుడి ఊహకు తగినట్టు సాగే కథ

చివ‌రిగా: సరికొత్త ముగింపుతో ఉప్పెనంత ప్రేమ

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details