తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Minnal murali review: దేశీ సూపర్​హీరో 'మిన్నల్ మురళి' - tovino thomas movies

హాలీవుడ్​లోనే కాకుండా మన గ్రామంలోనూ ఓ సూపర్​హీరో ఉంటే ఎలా ఉంటుందనే కథతో తీసిన 'మిన్నల్ మురళి' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. నెట్​ఫ్లిక్స్​లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఎలా ఉంది? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

minnal murali review
మిన్నల్ మురళి రివ్యూ

By

Published : Dec 25, 2021, 7:27 PM IST

చిత్రం: మిన్నల్‌ మురళి; నటీనటులు: టొవినో థామస్‌,గురు సోమసుందరం, అజు వర్గీస్‌, సాజన్‌ తదితరులు; సంగీతం: సుశీన్‌ శ్యామ్‌, షాన్‌ రెహమాన్‌; దర్శకత్వం: బాసిల్‌ జోసెఫ్‌; విడుదల: నెట్‌ఫ్లిక్స్‌

సూపర్‌మ్యాన్‌, బ్యాట్‌మెన్‌, స్పైడర్‌ మ్యాన్‌ ఇలా సూపర్‌హీరోస్‌ అందరూ హాలీవుడ్‌లోనూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాలకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. ఇక మన దేశంలో సూపర్‌హీరో పాత్రలు చాలా తక్కువ. మాస్‌ కమర్షియల్‌ సినిమాలకే ఇక్కడ ప్రేక్షకులు పట్టం కడతారు. అయితే, వైవిధ్య కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ. అలా వచ్చిన చిత్రమే 'మిన్నల్‌ మురళి'. మలయాళంలో ప్రయోగాత్మక చిత్రాలంటే గుర్తొచ్చే యువ నటుడు టొవినో థామస్‌. అతడు నటించిన చిత్రమిది. మరి 'మిన్నల్‌ మురళి' కథేంటి? సూపర్‌ హీరో ఎలా అయ్యాడు?(minnal murali telugu movie review)

మిన్నల్ మురళి మూవీ

కథేంటంటే: ఉరవకొండ గ్రామంలో నివసించే జేసన్ (టొవినో థామస్)(Tovino Thomas) ఓ టైలర్. ఎప్పటికైనా అమెరికా వెళ్లాలని అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటాడు. పోలీస్‌ ఆఫీసర్‌ కూతురిని ప్రేమించి విఫలమవుతాడు. అదే ఊళ్లో చిన్న హోటల్‌లో పని చేస్తుంటాడు శిబు (గురు సోమసుందరం). ఒకరోజు అనుకోకుండా వీరిద్దరూ మెరుపు దాడికి గురవుతారు. దీంతో ఇద్దరికీ ఊహించని శక్తులు వస్తాయి. ఆ శక్తులను వాళ్లు ఎలా గుర్తించారు? వాటిని ఎలా ఉపయోగించారు? వీరి శక్తుల కారణంగా ఆ గ్రామ ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు? పరిస్థితులు వీళ్లను ఎలా మార్చాయి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: వెండితెరపై కనిపించే సూపర్‌ హీరోలు, వాళ్లకు ఉండే శక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్వెల్‌, డీసీ కామిక్స్‌ ద్వారా ఎందరో సూపర్‌ హీరోలు ప్రపంచానికి పరిచయం అయ్యారు. అయితే, భారతీయ తెరపై సూపర్‌ హీరోలు పాత్రలు చాలా తక్కువ. మార్వెల్‌ సూపర్‌హీరో తరహాలో ఇక్కడి ప్రేక్షకులకు ఒక సూపర్‌ హీరో ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ 'మిన్నల్‌ మురళి'. అరుణ్‌ అనిరుధన్‌, జస్టిన్‌ మాథ్యూల సూపర్‌హీరో కథను భారతీయ నేటివిటీకి దగ్గరగా తెరకెక్కించడంలో దర్శకుడు బాసిల్‌ జోసెఫ్ విజయవంతమయ్యారు. ఇటు జేసన్‌, అటు శిబు పాత్రలను పరిచయం చేస్తూ త్వరగానే కథలోకి తీసుకెళ్లిపోయారు. ఇద్దరూ మెరుపుదాడికి గురైన తర్వాత తమకు శక్తులు వచ్చాయని గుర్తించటం, వాటిని ఉపయోగించడం సరదాగా అనిపిస్తుంది. తన శక్తులను పరీక్షించుకునేందుకు జేసన్‌ చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. సూపర్‌హీరో కథ కాబట్టి దర్శకుడు కూడా నేలవిడిచి సాము చేయలేదు. బడ్జెట్‌, భారతీయ నేటివిటికీ దగ్గరగా సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది.

టొవినో థామస్ మిన్నల్ మురళి

సాధారణంగా డీసీ కామిక్స్‌లో విలన్స్‌ వికృత రూపాల్లో, అత్యంత శక్తిమంతులుగా కనిపిస్తారు. కానీ, 'మిన్నల్‌ మురళి'లో జేసన్‌, శిబులకు ఎదురయ్యే పరిస్థితులే ప్రధాన శత్రువులు. అవే వారిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా శిబు తనకు ఎదురయ్యే సవాళ్లను తప్పించుకునేందుకు జేసన్‌ను బలి చేయాలనుకోవటం ఆసక్తికరంగా అనిపిస్తుంది. తనను ఎవరు టార్గెట్‌ చేశారన్న విషయాన్ని తెలుసుకునేందుకు జేసన్‌ చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ సృష్టించి ఆద్యంతం ఆసక్తి కలిగించేలా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే, ప్రథమార్ధంలో కథా గమనం నెమ్మదిగా సాగడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. చివరి 40 నిమిషాలు సినిమా పరుగులు పెట్టినా, ప్రేక్షకుడి ఊహకు తగినట్లే సన్నివేశాలు సాగుతాయి. పతాక సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగిస్తాయి.

నటి ఫెమినా జార్జ్

ఎవరెలా చేశారంటే: మలయాళంలో ఉన్న విలక్షణ నటుల్లో టొవినో థామస్‌ ఒకడు. ఇప్పటివరకూ అతడు నటించిన చిత్రాల్లో అత్యధిక భాగం ప్రయోగాలే. భారతీయ చిత్ర పరిశ్రమలో 'మిన్నల్‌ మురళి' సరికొత్త ప్రయోగం. సూపర్‌హీరో పాత్రలో టొవినో అదరగొట్టాడు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర గురు సోమసుందరం. శిబు పాత్రలో ఆయన నటన, పలికించిన హావభావాలు అద్భుతం. ఎన్ని శక్తులు ఉన్నా విధిని ఎదిరించి నిలబడటం ఎవరికీ సాధ్యం కాదన్నది శిబు పాత్ర ద్వారా చూపించారు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సుశీన్‌ నేపథ్య సంగీతం, సమీర్‌ సినిమాటోగ్రఫీని మెచ్చుకోవాల్సిందే. ఎడిటర్‌ లివింగ్‌స్టన్‌ సినిమాను ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సింది. ముఖ్యంగా ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయవచ్చు. దర్శకుడు బాసిల్‌ జోసెఫ్‌ ఓ సరికొత్త హీరోను భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడంలో విజయం సాధించారు. జేసన్‌, శిబు పాత్రలను తీర్చిదిద్దిన విధానం, తెరపై వారి పాత్రల మధ్య చోటు చేసుకునే సంఘర్షణ చాలా చక్కగా తీశారు. సీక్వెల్‌ తెరకెక్కించేలా ముగింపు ఇవ్వడం విశేషం. ఈ వీకెండ్‌ కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకుంటే ‘మిన్నల్‌ మురళి’ నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న బెస్ట్‌ ఆప్షన్‌.

మిన్నల్ మురళి మూవీ

బలాలు

+ టొవినో థామస్‌, గురు సోమ సుందర్‌ల నటన

+ కథ, దర్శకత్వం

+ ద్వితీయార్ధం

బలహీనతలు

- నెమ్మదిగా సాగే ప్రథమార్ధం

చివరిగా: 'మిన్నల్‌ మురళి' ఎంటర్‌టైన్‌ చేసే ఇండియన్‌ సూపర్‌ హీరో!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details