తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అర్జున్​ సురవరం' ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడా..?

'హ్యాపీడేస్‌' చిత్రంతో అల్లరి చేసిన నిఖిల్ సిద్దార్థ్‌.. ఆ త‌ర‌్వాత సోలో హీరోగా ఎదిగాడు. 'స్వామి రారా', 'కార్తికేయ' లాంటి చిత్రాలతో హిట్లు అందుకున్నాడు. కాన్సెప్ట్ క‌థ‌ల‌కు కేరాఫ్‌గా పేరు తెచ్చుకున్న అతడు... నేడు 'అర్జున్ సుర‌వ‌రం' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో నిజాయ‌తీ ఉన్న పాత్రికేయుడిగా క‌నిపించాడు. నేడు విడుదలైన ఈ సినిమా సమీక్షకు సంబంధించిన విశేషాలివే..

tollywood-movie-arjun-suravaram-relesed-on-november-29-and-review-which-is-starer-by-nikhil-siddhartha-lavanya-tripathi
వీక్షకులకు నిజమే చెప్పిన అర్జున్​ సురవరం..?

By

Published : Nov 29, 2019, 1:50 PM IST

యువ దర్శకుడు టీఎన్​ సంతోష్​, హీరో నిఖిల్​ సిద్దార్థ్​ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం 'అర్జున్​ సురవరం'. లావణ్య తిపాఠి కథానాయిక. క్రైమ్​, సస్పెన్స్, థ్రిల్లర్​ కలగలిపిన కథాంశంతో సినిమా రూపొందింది. తమిళ సూపర్‌ హిట్ కనితన్‌ను రీమేక్​ ఇది. మొదట్లో 'ముద్ర' అనే టైటిల్‌‌తో ప్రచారం కల్పించి... ఆ తర్వాత అనేక వివాదాలు, వాయిదాల అనంతరం నవంబర్​ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా వ్యవహరించాడు.

  • ఇదీ కథః

సాప్ట్ వేర్ ఉద్యోగమని చెప్పి తండ్రికి తెలియకుండా టీవీ99లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా పనిచేస్తుంటాడు అర్జున్(నిఖిల్). బీబీసీలో పనిచేయాలనేది తన కోరిక. ఈ క్రమంలో ఫేక్ సర్టిఫికెట్ల పేరుతో బ్యాంకులను మోసం చేసిన స్కాంలో అర్జున్ తోపాటు మరికొంత మంది యువకులను పోలీసులు అరెస్టు చేస్తారు. కోర్టు అర్జున్ సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ ఏడేళ్ల శిక్ష విధిస్తుంది. బెయిల్​పై విడుదలైన అర్జున్..ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేస్తోంది దొరై సర్కార్(సత్య అరోరా) అనే వ్యక్తని తెలుసుకుంటాడు. ఫేక్ సర్టిఫికెట్లతో రకరకాల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో దొరై సర్కార్.. అర్జున్​నే ఫేక్ సర్టిఫికెట్లు తయారు ముఠా నాయకుడంటూ జనాలను నమ్మిస్తాడు. మరి అర్జున్ అందులో నుంచి ఎలా బయటపడ్డాడు, దొరై సర్కార్​కు సంబంధించిన సాక్షాలను హీరో ఎలా సంపాదించాడనేది అర్జున్ సురవరం కథ.

  • ఎలా ఉందంటేః

ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. ఫేక్ సర్టిఫికెట్లతో దేశంలో ఎంత మంది ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారో, నిరుద్యోగులు ఎలా నష్టపోతున్నారో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో ఒక జర్నలిస్టు చుట్టూ కథ అల్లి... రెండున్నర గంటల పాటు సినిమాను నడిపించాడు. నూటికి నూరు శాతం కాకపోయినా బయట ఇలా జరుగుతుందంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే తొలి అర్ధభాగంలో అర్జున్ టీవీ 99 రిపోర్టర్​గా చేసే ఇన్విస్టిగేషన్, నకిలీ సర్టిఫికెట్ల స్కాంలో అరెస్టు అవడాన్ని ఆసక్తికరంగా మలిచిన దర్శకుడు...సెకండాఫ్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని సాగదీశాడు. ప్రేక్షకుడు ఊహించిన విధంగానే క్లైమాక్స్ ను ముగించాడు.

  • ఎవరెలా చేశారుః

సాప్ట్ బాయ్​గా పేరున్న నిఖిల్... ఈ సినిమాతో యాక్షన్ హీరోగా మెప్పించే ప్రయత్నం చేశాడు. విడుదల వాయిదా పడుతూ వచ్చిన తన చిత్రాలు మంచి పేరు తీసుకొస్తాయనే నమ్మకాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. రిపోర్టర్ పాత్రలో లీనమైపోయాడు. పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో నిఖిల్ నటన బాగుంది. లావణ్య త్రిపాఠి సినిమా మొత్తం కనిపించినా ఆ పాత్ర అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. కెమెరామెన్ పాత్రలో సత్య, లాయర్​గా వెన్నెల కిషోర్ పాత్రలు వినోదాన్ని పంచాయి. నాగినీడు, పోసాని కృష్ణమురళి పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి. విలన్​గా నటించిన సత్యఅరోరా... నకిలీ సర్టిఫికెట్ల ముఠా నాయకుడిగా మెప్పిస్తాడు. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. మాటలు మాత్రం అక్కడక్కడ చప్పట్లు కొట్టిస్తాయి. ఫస్టాఫ్ అర్జున్ అరెస్టయ్యే సన్నివేశాలు, సెకండాఫ్​లో పాఠశాల భవనం కూలిపోయే సన్నివేశాలు అర్జున్ సురవరం కథలో కీలకంగా నిలిచాయి. కథకు తగినట్లే నిర్మాణ విలువలు కనిపిస్తాయి.

బలంః కథ, నిఖిల్

బలహీనతలుఃకథనం, అక్కడక్కడ సాగదీసే సన్నివేశాలు

చివరగాఃమంచి, చెడు ప్రేక్షకులు చూసుకుంటారు. నిజం చెబుతామన్న అర్జున్ సురవరం

గమనిక: ఈ సమీక్ష కేవలం సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది మాత్రమే. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ABOUT THE AUTHOR

...view details