చిత్రం: తిమ్మరుసు; నటీనటులు: సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, అజయ్, అల్లరి రవిబాబు తదితరులు; సంగీతం: శ్రీచరణ్ పాకాల; నిర్మాతలు: మహేశ్ కోనేరు, సృజన్; దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి; సంస్థ: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్.ఒరిజినల్స్; విడుదల: 30-07-2021
రెండో దశ కరోనాతో మూడు నెలలకుపైగా థియేటర్లు మూతబడిపోయాయి. బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమా ఊసే లేకుండా పోయింది. కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. క్లిష్టమైన పరిస్థితుల మధ్య తెరుచుకున్న థియేటర్ల ముందుకు మొట్ట మొదటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో 'తిమ్మరుసు' ఒకటి. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందా? అని పరిశ్రమ మొత్తం ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూసింది. మంచి కథల్ని ఎంచుకుంటూ.. మంచి పాత్రల్లో ఒదిగిపోయే సత్యదేవ్ కథానాయకుడిగా నటించడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి చిత్రం అందుకు తగ్గట్టు ఉందో లేదో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం!
కథేంటంటే: న్యాయం గెలవడమే ముఖ్యం అనుకునే యువ న్యాయవాది రామచంద్ర అలియాస్ రామ్ (సత్యదేవ్). ఒక క్యాబ్ డ్రైవర్ అరవింద్ హత్య కేసులో ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించిన ఒక అమాయక కుర్రాడు వాసు (అంకిత్) కేసును రీ ఓపెన్ చేయిస్తాడు. వాసు జైలు పాలు కావడంలో పోలీస్ అధికారి భూపతిరాజు (అజయ్) ఏ పాత్ర ఏమిటి? ఇంతకీ క్యాబ్ డ్రైవర్ అరవింద్ హత్య వెనక ఎవరున్నారు? వాళ్లను రామ్ తన తెలివితేటలతో ఎలా బయటికి తీసుకొచ్చాడు? ఈ కథలో వాలి ఎవరు?అతని పాత్ర ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: కథానాయకుడు న్యాయవాది అనగానే ఇదొక కోర్టు రూమ్ డ్రామా అనుకుంటాం. పైగా ఇప్పుడు ఆ కథల ట్రెండ్ కూడా నడుస్తోంది. అయితే ఇందులో కోర్టు రూమ్ డ్రామా కంటే కూడా నేర నేపథ్యమే ఎక్కువగా ఉంటుంది. ఒక హత్యా నేరం వెనక అసలు గుట్టును బయటపెట్టడం కోసం ఓ న్యాయవాది తన తెలివి తేటలన్నింటినీ కేంద్రీకరించి పరిశోధన జరుపుతుంటాడు. ఆ క్రమంలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తుంటాయన్నది ఆసక్తికరం. అసలు కథలోకి వెళ్లడానికి మాత్రం చాలా సమయమే తీసుకున్నాడు దర్శకుడు. సహజంగా ఒక కేసును చేపట్టాక దాని పూర్వపరాలన్నీ కూలంకషంగా తెలుసుకుని రంగంలోకి దిగుతాడు న్యాయవాది. తన తెలివి తేటలతో పని మొదలు పెడతాడు. ఇందులో మాత్రం న్యాయవాది ప్రతి పది నిమిషాలకు ఓ విషయం తెలుస్తుంటుంది. ఇది ముందే ఎందుకు చెప్పలేదని బాధితుడిని అడుగుతుంటాడు. ఆ సన్నివేశాలు ఏమాత్రం ఆసక్తి లేకుండా సాగుతున్నట్టు అనిపిస్తాయి. విరామ సన్నివేశాల నుంచి కథపై కాస్త పట్టు ప్రదర్శించాడు దర్శకుడు. సాక్ష్యాల్ని సేకరిస్తున్న కొద్దీ, వాటిని హంతకుడు మాయం చేయడం కథలో లీనమయ్యేలా చేస్తుంది. ద్వితీయార్ధంలో కథలోని పార్శ్వాలు ఆకట్టుకుంటాయి. ఈ కేసుకూ, కథానాయకుడి వ్యక్తిగత జీవితానికీ ముడిపెట్టిన తీరు మరింతగా మెప్పిస్తుంది. పతాక సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఎవరెలా చేశారంటే: సత్యదేవ్ యువ న్యాయవాదిగా చాలా బాగా నటించారు. సుధ (బ్రహ్మాజీ)తో కలిసి అక్కడక్కడా నవ్విస్తూ... ద్వితీయార్ధంలో భావోద్వేగాలు పంచుతూ పాత్రలో ఒదిగిపోయారు సత్యదేవ్. అను అనే యువతిగా కథానాయిక ప్రియాంక జవాల్కర్ నటించింది. హీరో ప్రేయసిగా కనిపిస్తుంది కానీ.. కథ రీత్యా ఇందులో డ్యూయెట్లలో ఆడిపాడే అవకాశం దక్కలేదు. అజయ్ అలవాటైన పాత్రలో ఒదిగిపోయాడు. అమాయక కుర్రాడిగా అంకిత్ నటన బాగుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం, అప్పు కెమెరా పనితనం చిత్రానికి బలాన్నిచ్చాయి. పరిమిత వ్యయంతో నాణ్యతతో నిర్మించారు. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి కథనాన్ని నడిపిన తీరు బాగుంది.
బలాలు