తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమీక్ష: 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' కేసు గెలిచాడా? - సందీప్ కిషన్ కొత్త సినిమా

'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'.. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. లాయర్​గా సందీప్​ కిషన్​ ఏ మేరకు మెప్పించాడు. విలన్​గా చేసిన వరలక్ష్మి శరత్​కుమార్ ఆకట్టుకుందా లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ రివ్యూ

By

Published : Nov 15, 2019, 2:13 PM IST

  • సినిమా:తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్
  • నటీనటులు:సందీప్ కిషన్, హన్సిక, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ త‌దిత‌రులు
  • దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి
  • విడుదల తేదీ: 15-11-2019

హాస్యం ప‌రంగా మంచి ప‌ట్టున్న ద‌ర్శకుడిగా జి. నాగేశ్వర‌రెడ్డికి గుర్తింపు ఉంది. మ‌ధ్యలో ప‌రాజ‌యాల్ని చ‌విచూస్తూ వ‌స్తున్నా.. మంచి క‌థ కుదిరిన ప్రతిసారీ న‌వ్విస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాడు. ఈ కారణంతో నాగేశ్వర‌రెడ్డి నుంచి సినిమా వ‌స్తుందంటే ఇప్పటికీ ప్రేక్షకులు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుంటారు.

గ‌త మూడు సినిమాలు వ‌రుస‌గా ప‌రాజ‌యాల్ని చ‌విచూసిన ఈ డైరక్టర్.. తాజా ప్రయత్నమే 'తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్'. హీరో సందీప్‌కిష‌న్ నటించడం, ట్రైలర్​ ఆక‌ట్టుకునేలా ఉండ‌టం.. నాగేశ్వర‌రెడ్డి మ‌ళ్లీ త‌న మార్క్‌ను చూపించాడేమో అనే అంచ‌నాలు ప్రేక్షకుల్లో క‌నిపించాయి. మ‌రి వాటిని ఈ సినిమా నిజం చేసిందా? లేదా? తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.

తెనాలి రామకృష్ణ బీఏబీఎల్

క‌థేంటి?

చెట్టు కింద ప్లీడ‌ర్ తెనాలి రామ‌కృష్ణ (సందీప్‌కిష‌న్‌). ఎన్ని ఆఫ‌ర్లు ఇచ్చినా త‌న ద‌గ్గరికి కేసులు రావు. తండ్రి మాత్రం కొడుకు ఒక పెద్ద కేసు వాదించి గెలిస్తే చూడాల‌ని ఆశ‌ప‌డుతుంటాడు. ఎంత‌కీ కేసులు రాక‌పోవ‌డం వల్ల పెండింగ్ కేసుల గురించి తెలుసుకొని ఇరు వ‌ర్గాల్ని రాజీ చేస్తూ సొమ్ము చేసుకుంటుంటాడు. ఇంత‌లో పేరు మోసిన రాజ‌కీయ నాయ‌కురాలు వ‌ర‌ల‌క్ష్మి దేవి (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌) కేసు త‌గులుతుంది. త‌న జీవితాన్ని మ‌లుపు తిప్పే కేసు ఇదే అని స‌వాల్‌గా భావించి కోర్టులో వాదిస్తాడు. ఆమెను గెలిపిస్తాడు. కానీ ఆ కేసు గెలిచాక అందులో మ‌రో కోణం బ‌య‌టికొస్తుంది. ఆ కోణ‌ం ఏంటి? తెనాలికి, వ‌ర‌ల‌క్ష్మికి మ‌ధ్య సాగిన పోరాటంలో ఎవ‌రు గెలిచారు? రుక్మిణి (హ‌న్సిక‌)తో తెనాలి ప్రేమాయ‌ణం ఎక్కడివరకు వెళ్లింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

తెనాలి రామకృష్ణ బీఏబీఎల్

ఎలా ఉందంటే?

క‌థ కంటే కామెడీనే ఎక్కువ న‌మ్ముకుంటాడు ద‌ర్శకుడు జి. నాగేశ్వర‌రెడ్డి. ఇందులోనూ మ‌రోసారి క‌థను విడిచిపెట్టి కామెడీ సాము చేశాడు. అయితే ఆ కామెడీలో ప‌స లేక‌పోవ‌డం, ద్వంద్వార్థాలతో కూడిన అసభ్యకర‌మైన సంభాష‌ణ‌ల మోతాదు ఎక్కువవ‌డం, క‌థనం ప‌రంగా ఏమాత్రం ఆస‌క్తి, లేక‌పోవ‌డం వల్ల సినిమా అతి సాధార‌ణంగా సాగిపోతుంది. తెనాలి రామ‌కృష్ణ అనే పేరు హీరోకు పెట్టారే కానీ.. ఆ పాత్రలో ఏమాత్రం తెలివి తేట‌లు కానీ, చ‌మ‌క్కులు కానీ క‌నిపించ‌వు.

స్పూఫ్‌ల్ని న‌మ్ముకొని రొటీన్ కామెడీ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. అవి అంతగా పండలేదు. సందీప్‌కిష‌న్‌, ర‌ఘుబాబుల మ‌ధ్య తండ్రీ కొడుకుల ఎమోష‌న్‌ను చూపించాల‌ని ప్రయ‌త్నించినా.. అది ఆకట్టుకోలేదు. దీంతో ప్రథ‌మార్ధం అంతా చప్పగా సాగుతుంది. విరామ స‌మ‌యంలో వ‌ర‌ల‌క్ష్మి పాత్ర ప్రవేశంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ద్వితీయార్ధంలో కోర్టు రూమ్ డ్రామా, మ‌లుపులు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. తెనాలి రామ‌కృష్ణ వ‌ర‌ల‌క్ష్మి కేసును గెలిచిన తీరు మెప్పిస్తుంది. కోర్టులో పండిన హాస్యం న‌వ్విస్తుంది.

ఆ త‌ర్వాత వ‌చ్చే మ‌లుపు నుంచి క‌థ‌లో డ్రామాను పండించాల్సి ఉండ‌గా, ఆ ప్రయ‌త్నం చేయ‌లేక‌పోయారు. దాంతో సినిమా మ‌ళ్లీ సాధార‌ణంగా మారిపోతుంది. ప‌తాక స‌న్నివేశాలు ఏమాత్రం మెప్పించ‌వు. ఇద్దరు శత్రువులు ఒక్కటై క‌థానాయ‌కుడిని అంతం చేయాల‌నుకున్నప్పుడు ఆ డ్రామా మ‌రింత శ‌క్తిమంతంగా సాగాలి. కానీ ఏమాత్రం పోరాటం లేకుండా ప‌తాక స‌న్నివేశాల్లో క‌థానాయ‌కుడు వ‌చ్చి సాక్ష్యాల్ని ఎత్తుకెళ్లి కోర్టుకిస్తారు.

తెనాలి రామకృష్ణ బీఏబీఎల్

ఎవరెలా చేశారంటే?

సందీప్‌కిష‌న్‌తో కామెడీ చేయించ‌డం కంటే.. మాస్ క‌థానాయ‌కుడిగా చూపించాల‌నే ప్రయత్నమే ఇందులో ఎక్కువ‌గా క‌నిపించింది. పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించాడీ కథానాయకుడు. హ‌న్సిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాట‌ల్లో మాత్రం అందంగా క‌నిపించింది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. ఆమె పాత్రను మ‌రింత శ‌క్తిమంతంగా తీర్చిదిద్దడంలో ద‌ర్శకుడు విఫ‌ల‌మ‌య్యాడు.

సాంకేతిక విభాగం ప‌ర్వాలేద‌నిపించింది. సాయి కార్తిక్ సంగీతం, సాయి శ్రీరామ్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. నివాస్‌, భ‌వానీ ప్రసాద్ సంభాష‌ణ‌లు అక్కడక్కడా మెప్పించినా ద్వంద్వార్థాలు ఎక్కువ‌గా వినిపిస్తాయి. ద‌ర్శకుడు నాగేశ్వర‌రెడ్డి అనుభ‌వం ప్రభావం సినిమాపై ఎక్కడా క‌నిపించ‌దు.

బ‌లాలు

  • కొన్ని హాస్య స‌న్నివేశాలు
  • ద్వితీయార్ధంలో మ‌లుపు

బ‌ల‌హీన‌త‌లు

  • క‌థ, క‌థ‌నం
  • ఆశించిన స్థాయిలో వినోదం లేక‌పోవ‌డం
  • ద్వంద్వార్థాల‌తో కూడిన సంభాష‌ణ‌లు

చివ‌రిగా.. తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్... ఇత‌నిదో సెక్షన్‌ట

గమనిక: ఇది కేవలం సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది మాత్రమే. ఇది కేవలం సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే.

ABOUT THE AUTHOR

...view details