తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ: మెగాస్టార్ అయ్యారు 'సైరా' - uyyalawada narsimha reddy

మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటించిన 'సైరా' నరసింహారెడ్డి.. ప్రేక్షకులను మైమరిపిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో చిరు ఎలా అలరించారో తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.

రివ్యూ: మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి

By

Published : Oct 2, 2019, 9:06 AM IST

Updated : Oct 2, 2019, 8:33 PM IST

నటీనటులు: చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు
నిర్మాత:రామ్‌చరణ్‌
దర్శకత్వం: సురేందర్‌రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి సినిమా థియేటర్లలోకి వస్తుందంటే అభిమానులకు పండగే. దాదాపు పదేళ్ల విరామం అనంతరం 'ఖైదీ నంబర్‌ 150'తో పునరాగమనం చేస్తే బ్లాక్​బస్టర్​తో స్వాగతం పలికారు. 151వ చిత్రంగా తన పన్నెండేళ్ల కలల ప్రాజెక్టు 'సైరా'ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు చిరు. బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు వివిధ పరిశ్రమలకు చెందిన స్టార్‌ నటులు ఇందులో నటించారు. రామ్‌చరణ్‌ నిర్మిస్తుండటం, స్టైలిష్ డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి, యాక్షన్‌ సన్నివేశాల కోసం హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌ పనిచేయడం వల్ల సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాల మధ్య విడుదలైన 'సైరా' ఎలా ఉన్నాడు? బ్రిటిష్‌ వారిపై అతడి పోరాటం ఎలా సాగింది? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు ఎలా అలరించారు? అభిమానుల అంచనాలను అందుకుందా? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.

సైరా నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి

కథేంటంటే...?
రాయలసీమ రేనాడు ప్రాంతాన్ని 61మంది పాలెగాళ్లు.. చిన్న చిన్న సంస్థానాలుగా చేసుకుని పరిపాలన సాగిస్తుంటారు. అయితే ఎవరి మధ్యా ఐకమత్యం ఉండదు. ఒకరంటే ఒకరికి పడదు. రేనాడుపై పన్ను వసూలు చేసుకునే హక్కును నిజాం నవాబు.. ఆంగ్లేయులకు ఇవ్వడం వల్ల ఎవరికీ స్వయం పాలన ఉండదు. మరోవైపు వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పంటలు పండకపోయినా పన్నులు కట్టాలని ప్రజలను ఆంగ్లేయులు హింసిస్తుంటారు. అలాంటి సమయంలో మజ్జారి నరసింహారెడ్డి(చిరంజీవి) అనే పాలెగాడు ఆంగ్లేయులపై ఎలా పోరాటం చేశాడు? ఐకమత్యం కొరవడిన 61మంది పాలెగాళ్లను ఎలా ఏకతాటిపైకి తీసుకొచ్చాడు? వీరారెడ్డి(జగపతిబాబు), అవుకు రాజు(సుదీప్‌), పాండిరాజా(విజయ్‌ సేతుపతి), లక్ష్మి(తమన్నా)లు తొలి స్వాతంత్ర్యపోరాటంలో నరసింహారెడ్డికి ఎలా సహకరించారు? చివరకు నరసింహారెడ్డి పోరాటం ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను రగిలించిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

సైరా నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి

ఎలా ఉందంటే?
ఝాన్సీపై ఆంగ్లేయులు దాడి చేయటం దగ్గర కథ ప్రారంభమవుతుంది. తొలి స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నది మనం కాదని, అంతకుముందే ఆంగ్లేయులను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే వ్యక్తి గడగడలాడించాడని... అతడి గురించి లక్ష్మీబాయి(అనుష్క) తన సైనికులకు వివరించడం దగ్గర 'సైరా' కథ మొదలవుతుంది. రేనాడులోని చిన్న చిన్న సంస్థానాలు, వాటి మధ్య ఐకమత్యం లేకపోవడం, మరోపక్క పంటలు పండకపోయినా పన్నులు కట్టాలని ఆంగ్లేయులు ప్రజలను హింసించడం తదితర అంశాలు చూపిస్తూ.. నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆరంభ సన్నివేశాలన్నీ ప్రాతల పరిచయం కోసం వాడుకున్నాడు. 61 సంస్థానాలు వాటిల్లో పన్నులు వసూలు చేసేందుకు ఆంగ్లేయులు చేసే అకృత్యాలను కళ్ల కట్టినట్లు చూపించారు.

సైరా నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి

ప్రజల కష్టాలను చూసిన నరసింహారెడ్డి ఆంగ్లేయులపై పోరాటం చేయడానికి ఏం చేశాడు? ఐకమత్యంలేని సంస్థానాలు ఏకతాటిపైకి పైకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలతో ప్రథమార్ధం సాగుతుంది. ముఖ్యంగా విరామానికి ముందు ఆంగ్లేయులతో నరసింహారెడ్డి చేసే పోరాట సన్నివేశాలు ఒళ్లు గగురుపొడుస్తాయి. ఆ సమయంలో కథలో ప్రేక్షకుడు మరింత లీనమవుతాడు. బ్రిటిష్ అధికారి జాక్సన్‌ తల నరికి ఆంగ్లేయులకు పంపుతాడు నరసింహారెడ్డి. అనంతరం ద్వితీయార్ధంలో ఏం జరుగునుందన్న ఉత్సుకత ఏర్పడుతుంది.

అయితే అందుకు తగ్గట్టుగానే ద్వితీయార్ధాన్ని మలిచాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. కథ, కథనాల్లో వేగం పెంచాడు. రేనాడులో నరసింహారెడ్డి పోరాటం గురించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలియడం, దాన్ని అణచివేసేందుకు ఆ ప్రాంతానికి అత్యంత క్రూరుడైన మరో అధికారిని పంపినప్పుడు ద్వితీయార్ధం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే కథ మరింత ఆసక్తిగా ఉంటుంది. కథలో నాటకీయత మొదలవుతుంది. ఒకపక్క నరసింహారెడ్డి మిగిలిన సంస్థానాధీశుల్లో స్వాతంత్ర్యపోరాట స్ఫూర్తిని రగిలించి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేయడం తదితర సన్నివేశాలతో సాగుతుంది. ఇక్కడే దర్శకుడు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.

చిరంజీవిలోని మాస్‌ ఇమేజ్‌. స్టార్‌ డమ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయా సన్నివేశాలను రాసుకున్నాడు. అవుకురాజు, వీరారెడ్డి, బసిరెడ్డి పాత్రలు నరసింహారెడ్డికి సహకరిస్తున్నాయా? లేక వెన్నుపోటు పొడుస్తున్నాయా? అన్న ఉత్కంఠను ప్రేక్షకుల్లో కలిగించేలా సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా చిరంజీవి నుంచి ప్రేక్షకులను ఏం ఆశిస్తారో అవన్నీ దర్శకుడు దృష్టిలో పెట్టుకున్నాడు. దీంతో ద్వితీయార్ధంలో తీసిన పోరాట ఘట్టాలు రోమాంచితంగా చిరు అభిమానులకు పండగలా ఉంటాయి. అయితే, అతి చిన్నదైన సైరా సైన్యం 10వేలమంది ఆంగ్లేయ సైన్యాన్ని చంపడం ఇవన్నీ కొంత లాజిక్‌ దూరంగా సాగే సన్నివేశాలే. క్లైమాక్స్‌లో మరింత లిబర్టీ తీసుకున్నాడు దర్శకుడు. చరిత్రలో ఆంగ్లేయులు నరసింహారెడ్డిని ఉరితీసినట్లుగా ఉంది. అయితే క్లైమాక్స్‌కు భావోద్వేగాలు జోడించడంతో సినిమా విషాదాంతంగా ముగించినట్లు అనిపించకుండా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు.

ఎవరెలా చేశారంటే..!
మెగాస్టార్ చిరంజీవి... 'సైరా' తన 12ఏళ్ల కలల ప్రాజెక్టు అని ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు తగినట్లే ఆ పాత్రకు సిద్ధమయ్యారు. తన 150 చిత్రాల అనుభవం 'సైరా'లో మనకు కనబడుతుంది. స్వాతంత్ర్యపోరాట యోధుడిగా చిరు ఆహార్యం, నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక పోరాట ఘట్టాల్లో ఆయన నటన అద్భుతం. నేటి యువ కథానాయకులకు దీటుగా యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టేశారు. సంభాషణలు పలకడంలోనూ చిరు తనదైన మార్కును చూపించారు.

సైరా నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి

నరసింహారెడ్డికి విద్యలు నేర్పి, స్వాతంత్ర్యపోరాట స్ఫూర్తిని రగిలించే గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్‌ ప్రాత హుందాగా ఉంది. ఆ పాత్రలో ఆయన ఇమిడిపోయారు.

అవుకు రాజుగా సుదీప్‌.. నరసింహారెడ్డి అంటే అసూయ కలిగిన వ్యక్తిగా చక్కగా నటించారు. వీరారెడ్డిగా జగపతిబాబు పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. మొదటి నుంచి నరసింహారెడ్డి వైపు ఉండే వీరారెడ్డి అనుకోని పరిస్థితుల్లో మారతాడు. బసిరెడ్డిగా రవికిషన్‌ మోసపూరిత ప్రాతలో కనిపించారు. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార చక్కగా సరిపోయింది. తమన్నా.. నరసింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా చాలా చక్కగా నటించింది. తన నృత్యం, పాటలతో ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను రేకెత్తిస్తుంది. పాండిరాజాగా విజయ్‌సేతుపతి.. ఆంగ్లేయులపై నరసింహారెడ్డి చేస్తున్న పోరాటానికి తనవంతు సహకారాన్ని అందిస్తాడు. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా.. ‘సైరా’కు దర్శకత్వం వహించమనగానే ‘సమయం కావాలి’ అని దర్శకుడు సురేందర్‌రెడ్డి ఎందుకు చెప్పాడో సినిమా చూస్తే అర్థమవుతుంది. చరిత్ర అర్థం చేసుకోవడం, చిరంజీవి స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రాసుకోవడం ఇలా ఎన్నో అంశాలను పరగణనలోకి తీసుకున్నారు. దర్శకుడు తీసుకున్న ప్రతి జాగ్రత్త తెరపై కనపడుతుంది. చిరంజీవి సినిమా అంటే అభిమానులు ఏం ఆశిస్తారో వాటిని దృష్టిలో పెట్టుకుని మరీ కథ, కథనాలను తీర్చిదిద్దాడు.

సైరా నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి
ఈ సినిమా ప్రధాన బలం సంగీతం. అమిత్‌ త్రివేది, జూలియస్‌ ఫాఖియంలు ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్‌లో వినిపించే నేపథ్య సంగీతంతో ఒళ్లు గగురుపొడుస్తుంది. 'సైరా'లో యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌తో పాటు ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్‌లు తీర్చిదిద్దిన పోరాట ఘట్టాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. బుర్రా సాయిమాధవ్‌ డైలాగ్‌లు చిరు అభిమానులను ఆకట్టుకోగా, రాజీవన్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ ఆనాటి రోజులను కళ్లకు కట్టాయి.

ఇక చివరిగా చెప్పుకోవాల్సింది నిర్మాత రామ్‌చరణ్‌ గురించే. ఒక కథను నమ్మి ఈ స్థాయిలో ఖర్చు చేసి సినిమాను తీయడం నిజంగా ధైర్యమనే చెప్పాలి. తన తండ్రి కలల ప్రాజెక్టు అద్భుతంగా రావడానికి నిజంగా ఎంతో శ్రమించారు. ప్రతి ఫ్రేములోనూ భారీతనం కనపడుతుంది.

బలాలు

  • చిరంజీవి నటన
  • కథనం
  • విరామ సన్నివేశాలు

బలహీనతలు

  • ప్రథమార్ధంలో ప్రారంభ సన్నివేశాలు
  • తెలిసిన కథ

చివరిగా:'సైరా' తెలుగు సినిమా ఖ్యాతిని చాటి 'ఔరా' అనిపిస్తుంది!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Last Updated : Oct 2, 2019, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details