Super Deluxe Review: 'సూపర్‌డీలక్స్' ఎలా ఉందంటే? - ఫహాద్ ఫాజిల్
2019లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న తమిళ చిత్రం 'సూపర్ డీలక్స్'(Super Deluxe). ఈ సినిమా తెలుగు అనువాదాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' శుక్రవారం(ఆగస్టు 6) విడుదల చేసింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? ఇందులో ప్రధాన నటీనటులైన విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్ రాజా, గాయత్రీ శంకర్ నటన ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకోండి.
Super Deluxe Review: 'సూపర్‌డీలక్స్' సినిమా ఎలా ఉంది?
కొన్ని చిత్రాలు చూడటం మొదలు పెడితే అలా చూస్తూ ఉండిపోతాం. తెరపై కనిపించే పాత్రలు మన నిజ జీవితాలకు దగ్గరగా ఉండటం అందుకు ఒక కారణం కావొచ్చు. అలాంటి సినిమాలు ఏ భాషలో ఉన్నా ఆకట్టుకుంటాయి. ఆ కోవకు చెందిన చిత్రమే తమిళ 'సూపర్ డీలక్స్'(Super Deluxe). 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు, విమర్శకులనూ మెప్పించింది. తెలుగులోనూ ఈ సినిమా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవేవీ పట్టాలెక్కలేదు. కరోనాతో ఓటీటీల వినియోగం పెరిగిన తర్వాత సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది ఈ సినిమాను డబ్ చేయమంటూ కోరారు. ఎట్టకేలకు 'ఆహా'లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్ర కథ ఏంటి? విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాజిల్, రమ్యకృష్ణ ఎలా నటించారు?
రమ్యకష్ణ
కథేంటంటే?
'సూపర్ డీలక్స్' నాలుగు ఉప కథల సమాహారం. పవిత్ర(సమంత), మహేశ్(ఫహద్ ఫాజిల్) భార్య భర్తలు. పవిత్ర చేసిన పని కారణంగా ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుంటారు. శిల్ప/మాణిక్యం(విజయ్ సేతుపతి) హిజ్రా. తన కుటుంబం కోసం ముంబయి నుంచి తిరిగి వస్తాడు. సమాజంలో ఎదురైన పరిస్థితుల కారణంగా భార్య, బిడ్డలను వదిలి ముంబయి వెళ్లిపోవాలనుకుంటాడు. ఆశీర్వాదం(మిస్కిన్) సునామీ నుంచి ప్రాణాలతో బయటపడతాడు.
అప్పుడు అతనికి ఒక కొత్త దేవుడు దొరుకుతాడు. ఆ ఆధ్యాత్మిక ధ్యానంలో లీనమైపోతుంటాడు. అతని భార్య లీలా(రమ్యకృష్ణ) ఒకప్పుడు శృంగార తారగా పలు చిత్రాల్లో నటిస్తుంది. గాయపడిన తన కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ కథలకు ఉన్న లింక్ ఏంటి? ఎవరి వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరింది? ఎవరికి నష్టం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఇతర చిత్రాలతో పోలిస్తే, ఉప కథలతో కథ, కథనాలను నడిపిస్తూ వాటిని ఒకదానితో ఒకటి జత చేస్తూ, సినిమాను తెరకెక్కించడం కాస్త సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి కథలను డీల్ చేయడంలో ఏ మాత్రం తడబడినా మొత్తం సినిమాపై ప్రభావం చూపుతుంది. అయితే, నాలుగు కథల సమాహారమైన 'సూపర్ డీలక్స్' విషయంలో దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా ఎలాంటి ఇబ్బంది లేకుండా కథ, కథనాలను నడిపించిన తీరు మెప్పిస్తుంది.
పైగా దర్శకుడు అనుకున్న పాత్రలకు తగిన నటులు దొరికితే వెండితెరపై అలరించే చిత్రాన్ని తీర్చిదిద్దవచ్చు. అది కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. పవిత్ర కథతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు ఒక్కో కథలోని పాత్రలు, వాటికి ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించుకుంటూ వెళ్లాడు. వాటి నుంచి ఆయా పాత్రలు బయట పడటానికి చేసే ప్రయత్నాలు, వాటి మధ్య చోటు చేసుకునే సంఘర్షణకు హాస్యం జోడిస్తూ నడిపించిన విధానం అలరిస్తుంది. ఆ పాత్రలు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటన్నది సినిమాలో చూస్తే మజా వస్తుంది.
ఫహాద్ ఫాజిల్, సమంత
పవిత్ర, నలుగురు యువకులు, లీల, శిల్ప ఇలా ప్రతి పాత్ర.. వాటికి అనుబంధంగా వచ్చే సన్నివేశాలు చక్కగా అలరిస్తాయి. కాస్త కామెడీ, కాస్త ఎమోషన్, కాస్త టెన్షన్ ఇలా సినిమా చూస్తున్నంత సేపు ఒక్కో రుచిని ప్రేక్షకుడు ఆస్వాదిస్తుంటాడు. విరామ సమయానికి నాలుగు పాత్రలకు సంక్లిష్ట పరిస్థితులను సృష్టించడం ద్వారా ద్వితీయార్ధంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. పవిత్ర తాను చేసిన పని నుంచి ఎలా బయటపడుతుంది? యువకులు టీవీ ఎలా తీసుకొస్తారు? లీలా తన కొడుకును ఎలా కాపాడుకుంటుంది? శిల్ప తన కుమారుడిని వదిలి వెళ్లిపోతుందా? వంటి ప్రశ్నలకు ద్వితీయార్ధంలో సమాధానం ఇచ్చాడు. యువత ఎలాంటి వాటికి ఆకర్షించబడుతుంది? ట్రాన్స్‌జెండర్‌లను సమాజం ఎలా చూస్తుంది? మతానికి, మూఢనమ్మకానికి మధ్య ప్రజలు ఎలా ఏవిధంగా చిక్కుకుపోతున్నారన్న విషయాలను దర్శకుడు ఇందులోని పాత్రల ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి పాత్రను డీటెయిల్‌గా చూపించటం కోసం దర్శకుడు నిడివి ఎక్కువ తీసుకున్నాడు.
పెద్ద పెద్ద పాత్రలే కాదు, చిన్న పాత్రల విషయంలో దర్శకుడు ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు. యువకులకు సీడీ ఇచ్చే మహిళ, రాజా స్కూల్ ప్రిన్సిపల్ ఇలా పాత్ర కనిపించేది కాసేపే అయినా.. అలరిస్తుంది. అయితే, కథనం కాస్త నెమ్మదిగా సాగుతున్న భావన కలుగుతుంది. అయితే, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ముందు అది పెద్ద లోటుగా అనిపించదు.
ఎవరెలా చేశారంటే?
'సూపర్ డీలక్స్'లో కనిపించే ప్రతి నటుడూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తెరపై సినిమా చూస్తున్నప్పుడు మనకు ఆ పాత్రే కనపడుతుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆయా పాత్రల ప్రభావం మనపై ఉంటుంది. పవిత్రగా శిల్ప, ఆమె భర్తగా ఫహద్ ఫాజిల్ జోడీ ప్రతి సన్నివేశంలోనూ మెప్పించింది. చనిపోయిన శవాన్ని మాయం చేయడానికి వాళ్లు పడే కష్టం నుంచి హాస్యం పుట్టించాడు దర్శకుడు. అదే విధంగా అడల్ట్ మూవీ చూడాలనుకునే ప్రయత్నంలో టీవీని పగలగొట్టి దాన్ని తెచ్చేందుకు యువకులు పడే పాట్లు కూడా నవ్వులు పంచుతాయి.
ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విజయ్ సేతుపతి గురించే. ఇందులో ఆయన ట్రాన్స్ జెండర్ శిల్పగా కనిపిస్తారు. చాలా తక్కువ మంది నటులు మాత్రమే ఇలాంటి పాత్రలు చేయడానికి ముందుకొస్తారు. ఏదో మెప్పుకోసం, ప్రచారం కోసం పాత్రను చేయడం కాకుండా, అసలు ట్రాన్స్‌జెండర్‌లు ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ల హావభావాలు ఎలా ఉంటాయి? ఇలా ప్రతి విషయాన్ని విజయ్ సేతుపతి అధ్యయనం చేసి ఉంటారు. అదంతా తెరపై కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న నటుల్లో ఈ పాత్రను విజయ్‌సేతుపతి లాంటి నటులు తప్ప కమర్షియల్ హీరోలెవరూ చేయడానికి ముందుకురారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
విజయ్ సేతుపతి
కుమారుడి ప్రాణాలు కాపాడుకోవటం కోసం తపన పడే తల్లిగా లీల పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయారు. ఆమె భర్త ఆశీర్వాదం పాత్రలో మిస్కిన్ మెప్పిస్తారు. నవ్వుతూనే తన క్రూరత్వాన్ని ప్రదర్శించే ఎస్‌ఐ బెర్లిన్ పాత్రలో భగవతి పెరుమాళ్ చక్కగా నటించారు.
ఉత్తమ సాంకేతికత..
సాంకేతికంగా ప్రతి విభాగం ఎంతో చక్కగా పనిచేసింది. పి.ఎస్.వినోద్, నీరవ్ షా సినిమాటోగ్రఫీ ఎక్స్‌లెంట్. ప్రతి సన్నివేశాన్ని ఒక థీమ్‌లో తెరకెక్కించారు. ఆయా కథలు, పాత్రలకు తగినట్లు పరిసరాలను, లైటింగ్ ఎఫెక్ట్‌లను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. సత్యరాజ్ నటరాజన్ ఎడిటింగ్ ఓకే. నాలుగు కథలు కావడం వల్ల సినిమా దాదాపు మూడు గంటల నిడివి ఉంది. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం కథలో ప్రేక్షకుడిని లీనం చేసింది. సినిమాలో ప్రత్యేకంగా పాటలేవీ లేవు. దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా 'సూపర్‌డీలక్స్' చక్కగా తీర్చిదిద్దారు. తాను అనుకున్న కథలను అనుకున్న విధంగా ఎలాంటి తికమక లేకుండా తెరకెక్కించారు. అందుకు తగిన నటులను ఎంచుకుని వాళ్ల నుంచి కావాల్సిన నటన రాబట్టుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
బలహీనతలు
నటీనటులు
అక్కడక్కడా నెమ్మదిగా
సాగే కథనం
దర్శకత్వం
నిడివి
సాంకేతిక విభాగం పనితీరు
చివరిగా:'సూపర్ డీలక్స్'.. ఈ సినిమాతో ప్రయాణం మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది.
గమనిక:ఈసమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!