తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Malli modalaindi review: 'మళ్ళీ మొదలైంది' ఎలా ఉందంటే? - Sumanth new movie

Sumanth new movie: సుమంత్ నటించిన 'మళ్ళీ మొదలైంది'.. ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూ చదివి తెలుసుకోండి.

malli modalaindi movie review
మళ్ళీ మొదలైంది మూవీ రివ్యూ

By

Published : Feb 11, 2022, 9:28 AM IST

చిత్రం: మళ్ళీ మొదలైంది; నటీనటులు: సుమంత్‌, నైనా గంగూలీ, వర్షిణి, సుహాసినీ, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి తదితరులు; సంగీతం: అనూప్‌ రూబెన్స్‌; రచన, ద‌ర్శక‌త్వం: టీజీ.కీర్తి కుమార్‌; నిర్మాత: రాజశేఖర్‌రెడ్డి; విడుద‌ల తేదీ: 11-02-2022 (జీ5 ఓటీటీ)

వివాహం - విడాకులు... ఈ రెండింటి నేపథ్యంలో ఇప్పటివరకు టాలీవుడ్‌లో చాలా సినిమాలొచ్చాయి. అయితే రెండింటి గురించీ వివరించిన చిత్రాలు తక్కువే. విడాకులు తీసుకున్నాక వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి మార్పులొస్తాయి? మళ్లీ పెళ్లి అంటే ఏమవుతుంది? లాంటి అంశాన్ని కీలకంగా తీసుకొని తెరెక్కించిన చిత్రం 'మళ్ళీ మొదలైంది'. సుమంత్‌, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.

మళ్ళీ మొదలైంది మూవీ

కథేంటంటే: విక్రమ్‌ (సుమంత్‌) ఒక చెఫ్‌. తనకు నచ్చిన అమ్మాయి నిషా (వర్షిణీ సౌందర్‌రాజన్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కొన్నాళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల విడాకులు తీసుకుంటారు. ఆ తర్వాత నిషాతో విడాకులు ఇప్పించిన న్యాయవాది పవిత్ర (నైనా గంగూలీ)తో ప్రేమలో పడతాడు. కానీ, రెండోసారి పెళ్లి చేసుకోవాలంటే విక్రమ్‌కు భయం. వివాహమైన తర్వాత మళ్లీ గొడవలై.. విడాకుల వరకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతుంటాడు. ప్రేమ విషయం తెలుసుకొని పవిత్ర అతడిని దూరం పెడుతుంది. చివరికి ఏం జరిగింది? విక్రమ్‌ మనసులోని భయాలు తొలగిపోయాయా? పవిత్రను వివాహం చేసుకుంటాడా? అన్నది సినిమా చూసే తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే: విడాకుల తర్వాత ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందన్న కథాంశంతో దర్శకుడు కీర్తి కుమార్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. విక్రమ్‌, నిషా గొడవ పడటం.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడంతో కథ ప్రారంభమవుతుంది. విడాకులు తీసుకున్న వారిని సమాజం ఏ విధంగా చూస్తుందో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరోవైపు నిషా తరఫు న్యాయవాది పవిత్రతో విక్రమ్‌ ప్రేమలో పడటం, ఆమె ప్రేమను పొందేందుకు అతడు పడే కష్టాలతో ప్రథమార్ధం సాగిపోతుంది. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. ఎట్టకేలకు విక్రమ్‌ ప్రేమను పవిత్ర అంగీకరించి.. పెళ్లి చేసుకుందామని అడగడం, దానికి విక్రమ్‌ వెనకడుగు వేసేసరికి కథ మొదటికొస్తుంది.

మళ్ళీ మొదలైంది మూవీ రివ్యూ

అసలు మళ్లీ పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న విక్రమ్‌కు.. న్యాయవాది కుటుంబరావు (పోసాని కృష్ణమురళి) రెండో పెళ్లి అవసరాన్ని వివరించే సన్నివేశాలు హీరోనే కాదు, ప్రేక్షకుల మనసుల్నీ కదిలిస్తాయి. రెండో పెళ్లి అనే ఒక సోషల్‌ ఎలిమెంట్‌ను దర్శకుడు క్లాసిక్‌గా చూపించారు. భార్యభర్తలు విడిపోవడానికి గల కారణాలతోపాటు, గొడవలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోతే జీవితం ఎంతో బాగుంటుందనే సందేశం ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. మధ్యమధ్యలో విక్రమ్‌ స్నేహితుడు కిషోర్‌ (వెన్నెల కిషోర్‌) హాస్యం పండింది. సంభాషణలు బాగున్నాయి. ముఖ్యంగా విక్రమ్‌కు, అతడి తల్లి సుజా (సుహాసినీ) మధ్య సాగే సంభాషణలు ఆలోచింపజేస్తాయి.

సుమంత్ - నైనా గంగూలీ

ఎవరెలా చేశారంటే: విక్రమ్‌ పాత్రలో సుమంత్‌ ఒదిగిపోయాడు. ఆ పాత్రలోని మానసిక సంఘర్షణను సుమంత్‌ చక్కగా ఆవిష్కరించాడు. నైనా గంగూలీ తన పాత్రకు న్యాయం చేసింది. బుల్లితెరపై వ్యాఖ్యాతగా అలరించే వర్షిణీ సౌందర్‌రాజన్‌ ఈ చిత్రంతో నటిగా గుర్తింపు పొందుతుందనడంలో సందేహం లేదు. వెన్నెల కిషోర్‌ తనదైన టైమింగ్‌తో కనిపించినంత సేపు నవ్విస్తాడు. మిగతా నటీనటులు పరిధి మేరకు నటించారు. మంచి కథను ఎంపిక చేసుకున్న దర్శకుడు కథనాన్ని ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. కొన్ని సన్నివేశాలు సాదాసీదాగా ఉన్నట్లు అనిపిస్తాయి. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. సినిమాటోగ్రాఫర్‌ ఉన్నంతలో చక్కటి విజువల్స్‌ చూపించారు. నేపథ్య సంగీతం, ఉన్న రెండు పాటలూ సో సోగా ఉన్నాయి.

బలాలు:

+ కథ

+ సుమంత్‌ నటన

+ సంభాషణలు

బలహీనతలు

- కథనం

- స్లో నరేషన్‌

చివరగా: 'మళ్ళీ మొదలైంది'.. ఓ ఫీల్‌గుడ్‌ మూవీ

గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details