తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2021, 1:19 PM IST

ETV Bharat / sitara

Movie Review: 'శ్రీదేవి సోడా సెంటర్' రివ్యూ

సుధీర్​బాబు, ఆనంది జంటగా నటించిన 'శ్రీదేవి సోడా సెంటర్' థియేటర్లలోకి వచ్చేసింది. అయితే సినిమా ఎలా ఉంది? దర్శకుడు కరుణ కుమార్ ఎలాంటి కథతో వచ్చారు? లాంటి విషయాల కోసం ఈ రివ్యూ చదివేయండి.

Sridevi Soda Center Movie Review
శ్రీదేవి సోడా సెంటర్​

చిత్రం పేరు: శ్రీదేవి సోడా సెంటర్

నటీనటులు:సుధీర్ బాబు, ఆనంది, నరేశ్, రఘుబాబు తదితరులు

దర్శకుడు:కరుణకుమార్

నిర్మాణం:70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్

విడుదల తేది:2021 ఆగస్టు 27

'శ్రీదేవి సోడా సెంటర్​' రిలీజ్​ పోస్టర్​

పలాస, శ్రీదేవి సోడా సెంటర్. పేర్లతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కరుణకుమార్. తొలి చిత్రంతోనే రచయితగా తెలుగు తెరపై కరుణకుమార్ తనదైన ముద్ర వేసుకున్నారు. విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న కథానాయకుడు సుధీర్​బాబు. మరి వీరిద్దరి కలయికలో ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'శ్రీదేవి సోడా సెంటర్' ఎలా ఉంది? లైటింగ్ సూరిబాబు తెలుగు తెరపై వెలుగులు విరజిమ్మాడా? లేదా? ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

ఇదీ కథ:

అమలాపురంలో లైటింగ్ సెంటర్ నడుపుకుంటూ చలాకీగా తిరిగే యువకుడు సూరిబాబు(సుధీర్​బాబు). కోర్టు సమీపంలో శ్రీదేవి సోడా సెంటర్ యజమాని సంజీవరావు(నరేశ్) కూతురు శ్రీదేవి(ఆనంది)ని చూసి ఇష్టపడతాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు. వారి ప్రేమకు కులం అడ్డుగోడగా నిలుస్తుంది. ఈ క్రమంలో హత్య కేసులో సూరిబాబు అరెస్టై జైలుపాలవుతాడు. జైలు నుంచి తిరిగొచ్చిన సూరిబాబుకు ఎలాంటి నిజం తెలిసింది? శ్రీదేవి, సూరిబాబుల ప్రేమ వెలిగిందా? లేదా? చూడాలంటే సినిమా చూడాల్సిందే.

'శ్రీదేవి సోడా సెంటర్​' సినిమా సుధీర్​ బాబు

ఎలా ఉందంటే:

కుల, మతంతార ప్రేమకథలు తెలుగు తెరపై ప్రేక్షకులకు కొత్తేం కాదు. అయితే ఒక్కో ప్రేమకథకు ఒక్కో నేపథ్యం. అలాంటి విభిన్న నేపథ్యమున్న ప్రేమ కథే ఈ శ్రీదేవి సోడా సెంటర్. ప్రేమను కులాన్ని ముడేసి కథను కడదాక తీసుకొచ్చాడు దర్శకుడు కరుణకుమార్. ప్రథమార్థమంతా సూరిబాబు, శ్రీదేవిల ప్రేమతో నింపేశాడు. ద్వితీయార్థంలో అసలు కథను మొదలుపెట్టాడు. అమ్మలా చూసుకునే అమ్మాయి ప్రేమ దొరికితే ఆ ప్రేమికుడికి ఆనందం అంతా ఇంతా కాదు. కానీ అంతలోనే ఆ ప్రేమ కులం రంగు పులుముకొని కుట్రలు చేస్తే భగ్నప్రేమికుడు హృదయం ఎంత తపిస్తుందో ద్వితీయార్థంలో కనిపిస్తుంది. పగ, ప్రతీకారాలే కాదు.. కులం, మతం పేరుతో ప్రేమను చంపే సమాజాన్ని సూటిగా ఈ శ్రీదేవి సోడా సెంటర్ రూపంలో మరోసారి ప్రశ్నించింది. పతాక సన్నివేశాలు పూర్తయ్యాక సిరివెన్నెల గొంతు చెప్పే సంభాషణ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

ఎవరెలా చేశారంటే:

'శ్రీదేవి సోడా సెంటర్'లో ఏ పాత్రకు ఆ పాత్రే ప్రాణం పోసిందనే చెప్పాలి. ముఖ్యంగా లైటింగ్ సూరిబాబుగా సుధీర్ బాబు ఆద్యంతం కథను రక్తికట్టించారు. తనలో ఇంతకు ముందు చూడని కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించి, శెభాష్ అనిపించుకున్నారు. కథానాయికగా ఆనంది నటన కేవలం పాత్రకే పరిమితమైపోకుండా కథలో కీలకంగా నిలిచింది. నరేశ్​తో వచ్చే సన్నివేశాలు మధ్యతరగతి కుటుంబాల్లోని తండ్రీ కూతుళ్లను మరిపిస్తుంది. తండ్రి పాత్రలకు కొట్టిన పిండైన నరేశ్ మరోసారి తనదైన మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు. పరువు కోసం బతికే సగటు తండ్రిగా నూటికి నూరుపాళ్లు తనపాత్రకు న్యాయం చేశాడు. సుధీర్​బాబు తండ్రి నర్సయ్య పాత్రలో రఘుబాబు నటన ఫర్వాలేదనిపిస్తుంది. కాశీ పాత్రతో పరిచయమైన నటుడు పావుల్ నవగీతన్ తన నటనతో తెలుగు తెరకు మరో ప్రతినాయకుడు దొరికాడు అనిపించేలా నటించాడు.

'శ్రీదేవి సోడా సెంటర్​' సినిమాలో ఆనంది

సుధీర్​బాబు స్నేహితుడిగా సత్యం రాజేశ్, చిత్తూరు శివగా ప్రవీణ్ పాత్రలు కథకు అనుగుణంగా సాగిపోతాయి. వీళ్లందరితో తన కథకు ప్రాణం పోసిన దర్శకుడు కరుణకుమార్. తన తొలి చిత్రం పలాసతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరుణకుమార్.. కులం, పరువు పేరుతో ఇంటి దీపాన్ని ఆర్పేసి చీకట్లో కూర్చునే తండ్రులను తనదైన మాటలతో సూటిగా ప్రశ్నించారు. అయితే రెండో సినిమాకు కూడా కుల ప్రస్తావన ఎంచుకోవడం దర్శకుడిగా కరుణకుమార్​కు సవాల్ అనే చెప్పాలి. అయినా ఎక్కడా పక్కదోవ పట్టకుండా సూరిబాబు పాత్రతో తాను చెప్పాలనుకున్న విషయాన్ని తెరపై స్పష్టంగా ఆవిష్కరించారు. మణిశర్మ సంగీతం సినిమాకు బలమనే చెప్పాలి. నేపథ్య సంగీతం పతాక సన్నివేశాలకు ప్రాణం పోశాయి. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

బలం బలహీనత
కథ ప్రథమార్థం నెమ్మదిగా సాగడం

సుధీర్​బాబు, ఆనంది,

నరేశ్​ నటన

మణిశర్మ నేపథ్య సంగీతం

చివరిగా: 'శ్రీదేవి సోడా సెంటర్'.. సమాజాన్ని మరోసారి ఆలోచించమనే చిత్రం

గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details