చిత్రం:సోలో బ్రతుకే సో బెటర్
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, రావు రమేశ్, రాజేంద్రప్రసాద్ తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
దర్శకత్వం: సుబ్బు
సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
సమర్పణ: జీ స్టూడియోస్
విడుదల: 25-12-2020
థియేటర్లలో శుక్రవారం (డిసెంబరు 25) నుంచి మళ్లీ జోష్ మొదలైంది. లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లు.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఓ కొత్త సినిమా సందడిని రుచి చూశాయి. క్రిస్మస్ సందర్భంగా 'సోలో బ్రతుకే సో బెటర్' విడుదల కావడం వల్ల... ప్రేక్షక, పరిశ్రమ వర్గాలు ఈ సినిమా గురించి ప్రత్యేకమైన ఆసక్తిని వ్యక్తం చేశాయి. దీని ఫలితంపైనే మిగతా సినిమాల రిలీజ్‌లు ఆధారపడి ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని ఈ సినిమా ఏ మేరకు సంతృప్తి పరిచింది? గతేడాది 'ప్రతి రోజు పండగ'తో విజయాన్ని అందుకున్న సాయితేజ్ దాన్ని పునరావృతం చేశారా?
కథేంటంటే:
విరాట్ (సాయి తేజ్) సోలో బ్రతుకే సో బెటర్ అని చెబుతూ తోటి స్నేహితులతో కలిసి కాలేజీలో సోలో క్లబ్‌ను నడుపుతుంటాడు. సోలో జీవితంపై శ్లోకాలతో కూడిన ఓ బుక్ కూడా రాస్తాడు. అలాంటి కుర్రాడు ఓ దశలో సోలో జీవితానికి పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటాడు. జోడీని వెదుక్కునే పనిలో ఉన్న అతని జీవితంలోకి అమృత (నభా నటేష్) ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సోలో జీవితం గురించి అంతగా చెప్పిన విరాట్ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? అమృత.. విరాట్ జీవితంలోకి రావడం వెనక కారణమేమిటి? వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే:
పెళ్లి అయిన వాళ్లకీ, కాని వాళ్లకైనా ఎవరికైనా సులభంగా కనెక్ట్ అయ్యే కథ ఇది. కొత్త దర్శకుడు సుబ్బు ఈ కథను రాసుకున్న విధానం, ఒక చిన్న అంశాన్ని ఫార్ములా తరహాలో విస్తరించిన ప్రయత్నం కూడా మెచ్చుకోతగినదే. కానీ, ఆ కథ నుంచి హాస్యాన్ని, భావోద్వేగాల్ని రాబట్టడంలో విఫలమయ్యారు. ప్రథమార్ధం సరదాగా సాగినట్టు అనిపించినా, ద్వితీయార్ధంలో మాత్రం ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతూ నీరసంగా ముగుస్తుంది. కొన్ని సన్నివేశాలు పునరావృతం అవుతున్నట్లుగా ఉంటాయి. ఒంటరి జీవితం గురించి ఫిలాసఫీ చెబుతూ, ఎంతో మందిని ఆ తరహా జీవితం వైపు ఆకర్షితుల్ని చేసిన ఓ కుర్రాడు ఎలా మారాడనే విషయంలోనే ఈ సినిమా ఆత్మ ఉంది. కానీ, ఆ సన్నివేశాల్లోనే బలం లేదు. విరాట్ మావయ్య (రావు రమేశ్) తన భార్య చనిపోయాక ఆమె విలువ తెలుసుకోవడం, ఆ విలువ గురించి విరాట్‌కు వివరించే సన్నివేశాలు ఆకట్టుకున్నా.. ఆ భావోద్వేగాల స్థాయి మాత్రం సినిమాకు సరిపోలేదు.