తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Republic movie review: 'రిపబ్లిక్' మూవీ రివ్యూ - republic meaning

మెగాహీరో సాయిధరమ్ కలెక్టర్​గా నటించిన 'రిపబ్లిక్'.. ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? కథేంటి? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి.

republic movie telugu review
రిపబ్లిక్ మూవీ రివ్యూ

By

Published : Oct 1, 2021, 1:40 PM IST

చిత్రం: రిపబ్లిక్

నటీనటులు: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, ఆమని, రాహుల్ రామకృష్ణ తదితరులు

దర్శకత్వం: దేవకట్ట

సంగీతం: మణిశర్మ

నిర్మాణ సంస్థ: జేబీ ఎంటర్ టైన్ మెంట్స్

విడుదల తేది: 01-10-2021

రిపబ్లిక్ మూవీ రివ్యూ

'ప్రస్థానం' లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు దేవకట్ట నుంచి వచ్చిన మరో చిత్రం 'రిపబ్లిక్'. సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చకు దారితీసే వేదికగా నిలిచింది. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడం, ముందస్తు విడుదల వేడుకల్లో పవన్ కల్యాణ్ చలనచిత్ర పరిశ్రమపై వ్యాఖ్యానించడం రిపబ్లిక్ చిత్రంపై మరింత ఆసక్తిని రేకెత్తించేలా చేసింది. అయితే తేజ్​కు ఈ సినిమా బ్రేక్ ఇచ్చిందా? దేవకట్ట తన ప్రస్థానాన్ని 'రిపబ్లిక్'తో కొనసాగించాడా? ఈటీవీ భారత్ రిపబ్లిక్ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

ఇదీ కథ:

అభిరామ్(సాయిధరమ్ తేజ్) ఉన్నత చదువులు పూర్తి చేసి అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతాడు. చిన్నప్పటి నుంచే సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తుంటాడు. ఆ ప్రభావంతోనే యూపీఎస్​సీ బోర్డును మెప్పించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​గా ఎంపికవుతాడు. అదే జిల్లాలో విశాఖవాణి(రమ్యకృష్ణ) బలమైన రాజకీయ నాయకురాలు. అధికార పార్టీకి అధ్యక్షురాలు. తన పలుకుబడి, రాజకీయ అధికారంతో అక్కడి తల్లేరు చెరువుపై ఆధిపత్యం చేస్తూ మత్స్యగంధ ఫిషరీస్ పేరుతో వ్యాపారం చేస్తుంటుంది. ఆక్రమణలు, కాలుష్యంపై ప్రశ్నించిన వారిని నామరూపాల్లేకుండా చేస్తుంటుంది. ఈ క్రమంలో విశాఖవాణికి అభిరామ్ ఎదురెళ్తాడు. ఈ పోరాటంలో అభిరామ్ అనుకున్న లక్ష్యం నెరవేరిందా? ప్రవాస భారతీయురాలైన మైరా హాసన్(ఐశ్వర్య రాజేశ్)తో అభిరామ్​కు ఉన్న సంబంధం ఏంటీ? డిప్యూటీ కలెక్టర్ అయిన దశరథ్ (జగపతిబాబు) పాత్ర ఏంటో తెలియాలంటే రిపబ్లిక్ చిత్రం చూడాల్సిందే.

రిపబ్లిక్ మూవీ రివ్యూ

ఎలా ఉందంటే:

వ్యవస్థలో మార్పును కాంక్షిస్తూ వెండితెరపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. ప్రజలకు అవగాహన కల్పించేలా చాలా మంది దర్శకులు తమ కథలను సమాజంలో వేళ్లూనుకుపోయిన సమస్యలకు ముడివేసి చెప్పే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని ప్రజల ఆదరణ పొంది ఉత్తమ చిత్రాలు అనిపించుకోగా మరికొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థ తీరును తల్లేరు చెరువుకు ముడిపెట్టి తన కలాన్ని కదిలించాడు దర్శకుడు దేవకట్ట. ఈ కాలంలో మనుషుల నుంచి రాజకీయాలను వేరు చేయలేమన్న జార్జ్ ఆర్వెల్ మాటల స్ఫూర్తి తోపాటు రాజకీయ వ్యవస్థకు ఎదురినిలిచి పోరాడిన బ్యూరోక్రాట్స్ నిజ జీవిత కథల ఆధారంగా రిపబ్లిక్​ను తెరకెక్కించాడు.

ప్రథమార్థం కలెక్టర్ అభిరామ్ తన ఆశయాలు, సమాజం నుంచి ఎదురయ్యే సంఘటనలకు ఎలా ప్రభావితుడయ్యాడని చూపించారు. ద్వితీయార్థంలో కలెక్టర్ అభిరామ్, రాజకీయ నాయకురాలు విశాఖవాణి మధ్య జరిగే తల్లేరు చెరువు పోరాటం వల్ల కథ వేగం పుంజుకుంటుంది. రాజకీయ వ్యవస్థకు, పరిపాలన వ్యవస్థకు మధ్య జరిగే ఈ పోరాటంలో ప్రథమార్థం సాదా సీదాగా సాగినా.... ద్వితీయార్థం ప్రేక్షకులను ఆలోపించజేస్తుంది. రాజకీయ శక్తుల్లో బ్యూరోక్రాట్స్ ఎలా పావులుగా మారుతున్నారు, అధికారంలో ఉన్న నేతల ఎత్తుగడలతో జిల్లా స్థాయిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విషయాలను తల్లేరు చెరువు ఉదాహారణగా వివరిస్తూ దర్శకుడు చెప్పిన విషయాలు వాస్తవం అనిపిస్తుంటుంది. అయితే ఇందులో ఒక కొత్త అంశాన్ని దర్శకుడు దేవకట్ట తెరపైకి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ల బదిలీలు, బాధ్యతలు రాజకీయ నాయకుల చేతుల్లో కాకుండా పూర్తిగా యూపీఎస్​సీ అధికారంలో ఉండేలా ప్రయోగం చేశారు. కానీ రాజకీయ శక్తుల ముందు ఆ ప్రయోగాలన్నీ పనికిరావని విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ప్రజలకు అసలు విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి వ్యవస్థను మార్చాలనుకునే ప్రయత్నంలో వ్యవస్థ ఆ వ్యక్తిని ఎలా దూరం చేసుకుందనే నిజాన్ని దర్శకుడు దేవకట్ట రిపబ్లిక్ రూపంలో చూపించాడు.

రిపబ్లిక్ మూవీలో రమ్యకృష్ణ

ఎవరెలా చేశారంటే:

రిపబ్లిక్ చిత్రాన్ని పూర్తిగా తన భుజాలకెత్తుకున్నాడు సాయిధరమ్ తేజ్. యువ ఐఏఎస్ అధికారి పంజా అభిరామ్ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రజాసమస్యలపై రాజకీయ శక్తులతో పోరాడే అధికారిగా సాయిధరమ్ తేజ్ నటన అద్భుతమనే చెప్పాలి. అలాగే ప్రతినాయకురాలిగా రమ్యకృష్ణ మరోసారి తనదైన మ్యానరిజంతో రిపబ్లిక్ కు పతాక స్థాయికి తీసుకెళ్లింది. విశాఖవాణి పాత్రలో తనదైన హావభావాలు, సంభాషణలతో తెరను రక్తికట్టించింది. ఇక ఉన్నతాధికారి దశరథ్ పాత్రలో జగపతిబాబు నటన మరోసారి మెప్పిస్తుంది. పతాక సన్నివేశాల్లో చెప్పుల దండ వేసుకొని నటించాడంటే జగపతి తన పాత్రకు ఎంత వరకు న్యాయం చేశాడో అర్థమవుతుంది. ఇక ప్రవాసభారతీయురాలి పాత్రలో ఐశ్వర్యరాజేశ్ నటన ఫర్వాలేదనిపిస్తుంది. రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాజులు తమ పాత్ర పరిధి మేర నటించారు. మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రిపబ్లిక్ మూవీ రివ్యూ

దర్శకుడిగా దేవకట్ట మరోసారి తన మార్క్ చూపించారు. ప్రస్థానం తర్వాత మరో మంచి కథ అందించాలనే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో బ్యూరోక్రాట్స్ నేపథ్యంగా రిపబ్లిక్ కథను ఎంచుకొని వ్యవస్థలో మార్పు కోసం తపించాడు. ఆ తపన తెరపై కొంత వరకు ప్రతిఫలించిందనే చెప్పాలి. అజ్ఞానం గూడుకుట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ చెప్పే మాటలు చప్పట్లు కొట్టిస్తాయి. తల్లేరు చెరువు కట్టపై రమ్యకృష్ణ, సాయిధరమ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు, యూపీఎస్సీ బోర్డు ఇంటర్వ్యూ, పతాక సన్నివేశాల్లో జగతిబాబు- సాయిధరమ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశం ఆకట్టుకుంటాయి. అయితే దేవకట్ట గత చిత్రాల కంటే రిపబ్లిక్ కథాగమనం వేగంగా ఉండటం చెప్పుకోదగిన విషయం.

బలం: సాయిధరమ్ తేజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, మణిశర్మ నేపథ్య సంగీతం

బలహీనత: కథ, కథనం

చివరగా: రిపబ్లిక్.. వ్యవస్థలో మార్పును ఆశించిన మరో చిత్రం

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details